Themes from World History

Themes from World History

Saturday, July 9, 2016

లండన్ లో చారిత్రక సూయేజ్ వ్యవస్థ నిర్మించిన జోసెఫ్ బజాల్ గెట్



 ఎంగెల్స్ లాంటి తాత్వికుడుఎవడికీ అర్థంగాని ఏవో ప్రగాఢ విషయాలురాస్తూ కూర్చోకుండా, లండన్ లో మురికి ప్రాంతాలన్నీ సందర్శించి అదంతా అంత సవివరంగా వర్ణించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.  ఎంగెల్స్ శ్రామికుల జీవన పరిస్థితుల గురించి తెలుసుకుని, అవి ఎంత దుర్భరంగా ఉండేవో లోకానికి తెలియజేయాలనే దృష్టితోనే ఆ నివేదిక రాసినా దాని వల్ల సమస్య గురించిన అవగాహన సమాజంలో పెరిగింది. అయినా ఏటేటా పరిస్థితి మరింత విషమిస్తోందే గాని దాన్ని నయం చెయ్యడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఎవరూ పూనుకోలేదు. ఇలా ఉండగా 1858 లో వేసవి తాపం బాగా తీవ్రంగా ఉండడం జరిగింది. ఆ వేడికి మురికి నీరు మరింత హెచ్చు స్థాయిలో ఆవిరై, దుర్గంధం ఊరంతా వ్యాపించింది. భరించరాని దుర్గంధం తో కూడుకున్న ఆ వేసవి నెలలకి The great stink of 1958 (1958 నాటి ‘మహాకంపు’) అన్న పేరు సార్థకమయ్యింది. ఆ తరువాతే లండన్ నగర వాసుల్లో పరిస్థితిని చక్కబెట్టలన్న స్పృహ, సంకల్పం ఏర్పడింది.

మానవ వ్యర్థాలతో కూడుకున్న మురికి చెరువులు లండన్ లో ప్రతీ చోట ప్రత్యక్షమయ్యాయి. అసలు థేమ్స్ నదే ఓ బహిరంగ మురికి కాలువలా తయారయ్యింది.  దాని చెడు ప్రభావం వట్టి దుర్గంధం మాత్రమే కాదు. కలరా వంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాపించి ఎన్నో ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాయి. ఇంగ్లండ్ లో మొట్టమొదటి కలరా కేసు 1931 లో న్యూకాసిల్ నగరంలో నమోదు అయ్యింది. తదనంతరం 1849, 1854 లో ఆ మహమ్మారి రోగం వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఆ రోజుల్లో కలరాకి చికిత్స ఉండేది కాదు. అసలు రోగానికి కారణం ఏంటో కూడా తెలిసేది కాదు. గాల్లో ఎప్పుడూ ఉండే దుర్గంధం ఒక కారణం కావచ్చని ఒక నమ్మకం ఉండేది. అలాంటి రోగకారక దుర్గంధాలకి ‘మియాస్మా’ (miasma) అని పేరు కూడా ఉండేది. 



థేమ్స్ నది మీద పడవలో పయనిస్తున్న మృత్యు దేవత (ఆ నది లోని కుళ్లు ప్రాణాలు బలిగొంటున్న వైనానికి అద్దం పట్టే ఓ చిత్రం )




ఇలా ఉండగా డా జాన్ స్నో అనే వైద్యుడు కలరాకి కారణాలని శోధించడం మొదలెట్టాడు. 1849 లో కలరా పెల్లుబికిన సందర్భంలో ఇతడు ఎంతో మంది కలరా రోగులతో పని చేశాడు. కాని ఇతడికి ఆ రోగం సోకలేదు. కాబట్టి రోగం గాలి ద్వారా వ్యాపించదని డా స్నో అర్థం చేసుకున్నాడు. 1954 లో రహస్యం కొంచెం విడింది. బ్రాడ్ వీధి అనే చోట ఉండే ఓ బావి నుండి నీరు తాగిన వారు కలరా వ్యాధి వాతన పడ్డారని గ్రహించాడు డా స్నో. మరో విశేషం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండే ఓ బీరు పరిశ్రమలో పని చేసే 70 మంది శ్రామికులకి రోగం సోకలేదు. వీరు బీరు తప్ప మంచి నీటీ చుక్క కూడా ముట్టుకోని పరమ నైష్టికులని వాకబు చెయ్యగా తెలిసింది! బ్రాడ్ వీధి చుట్టుపక్కల ఉండే సూయేజి నీరు బావినీట్లో కలవడం వల్ల కలరా సోకింది అని కూడా ఆ తరువాత తెలిసింది.

లండన్ లో సూయేజి సమస్యకి పరిష్కారం కావాలని పురవాసులు డిమాండ్ చెయ్యడం మొదలెట్టారు. నగరవాసుల నుండి వస్తున్న ఒత్తిడికి స్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం ఒక ‘మెట్రో సూయేజి సదస్సుని’ నియమించింది. “బాహాటంగా ఉండే మురికి గుంటలన్నీ పూడ్చి,  ఇళ్ల లోంచి బయటికి ప్రవహించే  వ్యర్థాలన్నీ ఓ కచ్చితమైన సూయేజి వ్యవస్థ ద్వారా ప్రవహించి, ఊరికి దూరంగా తొలగించబడేలా ఓ సూయేజి వ్యవస్థ నిర్మించబడాలని” ఆ సదస్సు తీర్మానించింది. అలాంటి బృహన్నిర్మాణ కార్యాన్ని శిరసావహిస్తూ  జోసెఫ్ బజాల్ గెట్ అనే ఓ  సివిల్ ఇంజినీరు కార్యాచరణ లోకి దిగాడు. 

సూయేజి కాలువల నిర్మాణంలో బజాల్ గెట్ గొప్ప దూరదృష్టిని ప్రదర్శించాడు. ప్రతీ పేటని సర్వే చేసి, అక్కడ జనాభా సాంద్రత తెలుసుకుని, అక్కడి నుండి వచ్చే వ్యర్థాల ప్రవాహ మోతాదుని అంచనా వేసి, దాన్ని బట్టి ఆ ప్రాంతం అడుగున సాగే సూయేజి సొరంగం యొక్క వ్యాసం ఎంత ఉండాలో లెక్కవేసి నిర్ణయించాడు. ఇక్కడే అతడు గొప్ప దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నాడు. “ఎలా చూసినా ఈ నిర్మాణాన్ని మనం ఒక్కసారి చెయ్యబోతాం. పైగా మనం ఊహించలేని, అనిశ్చిత కారణాలు ఎన్నయినా ఉంటాయి,” అని ఆలోచించి తను అంచనా వేసిన వ్యాసానికి రెండితలు వ్యాసం గల సొరంగాల నిర్మాణానికి పూనుకున్నాడు.
(ఇంకా వుంది)