Themes from World History

Themes from World History

Sunday, October 16, 2016

ప్రాచీన రోమ్ చరిత్ర రచనకి పూనుకున్న లివీ



ఆ విధంగా ఊపిరి పోసుకున్న రోమ్ నగరం క్రమంగా ఎదిగింది. తొలిదశల్లో ఆ ప్రదేశాన్ని నగరం అనడం కన్నా ఓ గూడెం అనడం సమంజసంగా ఉంటుందేమో. దాన్నిపాలించే  పాలకులు సింహాసాలని అధిష్టించిన సామ్రాట్టులు కారు. ఓ చిన్న గూడేన్ని ఏలే గూడెం దొరలు వారు. సింహాసనాలు, సామ్రాజ్యాలు ఆపై కొన్ని శతాబ్దాల తరువాత వచ్చిన వైభోగం. ఇటలీలోనే మరో చోట ఘనంగా వర్ధిల్లే ఎట్రుస్కన్లతో పోల్చితే అప్పటి రోమన్లు ఎంతో వెనకబడి ఉండేవారు. కాబట్టి ఎట్రుస్కన్ల నుండి వాళ్లు ఎంతో నేర్చుకున్నారు.

ఎట్రుస్కన్లు సాంస్కృతికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వారిలో కొన్ని కిరాతకమైన ఆచారాలు అనాదిగా చలామణిలో ఉండేవి. బాగా పరిపాకం చెందిన సమాజం కనుక వారిలో తీరని వర్గవిభజన ఉండేది. ఉన్న వారు, లేని వారు అనే భేదం వారి సామాజిక వ్యవహారాలలో స్పష్టంగా కనిపించేది. ఎవడైనా గొప్పింటి వాడు చనిపోతే వాడి అంత్యక్రియలు జరిగే సందర్భంలో మల్లయుద్ధ పోటీలు నిర్వహించేవారు. అందులో విజేతకి ఇచ్చే బహుమానాల మీద ఆశతో పేదవారు పాల్గొనేవారు. విజేతకి బహుమతులు చిక్కినా ఆటలో అసలు  ఉద్దేశం విజేతల మన్నన కాదు. అందులో ఓడిపోయిన వారిని మృతుడి ఆత్మశాంతి కోసం బలి ఇచ్చేవారు. ఈ విధమైన అమానుషమైన రక్తతర్పణతో కూడిన ఆచారాలు మధ్యధరా ప్రాంత రాజ్యాలలో ఆ రోజుల్లో సర్వసామాన్యంగా వాడుకలో ఉండేవి. ఇలాంటి దుష్టవాసనలు కొన్ని రోమన్లకి కూడా అబ్బాయి. కొన్ని శతాబ్దాల తరువాత, రోమ్ నగరం ఓ మహాసామ్రాజ్యంగా అవతరించిన తరువాత కూడా, గ్లాడియేటర్ క్రీడల రూపంలో ఇలాంటి దారుణ మారణ క్రీడలు కొన్ని చిరకాలం నిలిచాయి.

ఎట్రుస్కన్ల నుండి రోమన్లు నేర్చుకున్న కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో వాళ్లు నేర్చుకున్న విషయాలు తదుపరి రోమన్ సామ్రాజ్య వైభవానికి పునాది రాళ్లు అయ్యాయి. రోమ్ ఉన్న ప్రాంతం అంతా మొదట్లో బురద నేలగా ఉండేది. ఆ నీటిని ఒడుపుగా తొలగించి భోగర్భ సొరంగాల ద్వార ఊరికి దూరంగా ఎలా తరలించాలో ఎట్రుస్కన్ ఇంజినీర్లే రోమన్లకి నేర్పించారు.  రోమ్ నగరంలో తదనంతరం ఓ గొప్ప ఆకర్షణగా మారి, రోమ్ నగర జీవనానికి వేదికగా వెలసిన రోమన్ ఫోరమ్ (Roman Forum)  ని కూడా ఎట్రుస్కన్ల సహాయంతోనే రోమన్లు నిర్మించుకున్నారు. ఈ రోమన్ ఫోరం ఊరి మధ్యలో నిర్మించబడ్డ ఓ చదునైన, విశాలమైన ప్రాంతం. రోమ్ నగర జీవన వ్యవహారాలెన్నో ఆ ప్రాంతంలో జరిగేవి. దాని చుట్టూ ఎన్నో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. రోమ్ నగరపు విపణి వీధి కూడా అదే. రోమ్ రాజులు యుద్ధాలలో విజేతలై తిరిగొచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే గొప్ప ఉత్సవాలు జరిగేవి. 

ఆ విధంగా ఎట్రుస్కన్ల నుండి రోమన్లు ఒక పక్క ఎంతో నేర్చుకుంటున్నా తమ కన్నా అభ్యున్నత స్థితిలో ఉన్న  ఎట్రుస్కన్లు అంటే రోమన్లకి కన్నుకుట్టేది. ఒకే ఒరలు రెండు కత్తులు ఇమడవు అన్న నానుడి బట్టి, ఇటాలియన్ ద్వీపకల్పంలో ఎదుగుతున్న రెండు రాయాల మధ్య ఏదో ఒకనాడు స్పర్థ అనివార్యం అన్నట్టు ఉండేది. ఓ అవిశేషమైన పల్లె ప్రాంతం స్థాయి నుండి గొప్ప ప్రాభవం గల స్థానిక రాజ్యం దశకి రోమ్ ఎదిగే  క్రమంలో ఎట్రుస్కన్లతో వారి కలహాలు మొదటి మెట్టు అయ్యాయి.

రోమ్ నగర వికాసం గురించి, చరిత్ర గురించి మనకి తెలిసిన దాంట్లో చాలా మటుకు ప్రఖ్యాత రోమన్ చరిత్ర కారుడు ‘లివీ’ నుండి మనకి సంక్రమించింది. అయితే లివీ రోమ్ సామ్రాజ్యం స్థాపించబడ్డ నాటికి ఏడు శతాబ్దాల తరువాత అగస్టస్ చక్రవర్తి (క్రీపూ 67 – క్రీశ 14) కాలంలో జీవించాడు. అగస్టస్ కాలంలో రోమన్ సామ్రాజ్యం ఓ కీలక స్థితిలో ఉండేది. మధ్యధరా సముద్ర ప్రాంతంలో వజ్రకిరీటంలా కొన్ని శతాబ్దాల పాటు రాజిల్లిన రోమ్ సామ్రాజ్యంలో మొట్టమొదటి సారిగా చీలికలు కనిపిస్తున్నాయి. పతనానికి ప్రథమ చిహ్నాలు కనిపిస్తున్నాయి. మనుషులు నీతి తప్పి నడుచుకుంటున్నారు. ధనలాభం కోసం ఎంత ఘాతుకానికైనా వెనుదీయని నైచ్యం ప్రతీ చోట తాండవిస్తోంది. రోమన్ సంస్కృతికి మూల స్తంభాలైన ధైర్యం, విశ్వాసపాత్రత, ఆత్మత్యాగం మొదలైన కేంద్ర విలువలని పుణికిపుచ్చుకున్న లివీ నానాటికి భ్రష్టత చెందుతున్న సామాజిక పరిణామాన్ని జీర్ణం చేసుకోలేకపోయాడు. రోమన్ సామ్రాజ్య తేజం అణగారిపోతోంది. దానికి కారణాలు శోధించిన లివీ తనకి అవగతమైన విషయాల గురించి ఇలా రాస్తాడు –

“ఆత్మసంయమనాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. అడ్డు అదుపు లేని భోగాలకి బానిసలయ్యాం. ఈ జాఢ్యాల పర్యవసానాలని తట్టుకునే స్థితిలో గాని, దాన్నినయం చెయ్యడానికి అవసరమయ్యే చికిత్సలని ఎదుర్కునే స్థితిలో గాని ప్రస్తుతం లేము.”

 
లివీ ఆలోచనలు రోమ్ గతం మీదకి పోయాయి. ఒకప్పుడు ఘనంగా వర్ధిల్లిన ఈ మహాసామ్రాజ్యం ఎందుకు ఇలా దిగజారుతోంది? రోమ్ వైభవానికి మూలకారణాలు ఏవి? రోమ్ ని దాని మహర్దశకి ఉద్ధరించిన ఘనులు ఎవరు? ఎలాంటి విధానాల ద్వార, వీరోచిన యత్నాల ద్వార, విప్లవాల ద్వార నామరూపాల్లేని ఓ చిన్న గూడేన్ని ఓ విశాల విశ్వసామ్రాజ్యం స్థాయికి ఉద్ధరించగలిగారు?
తన మనసులో చెలరేగుతున్న ఆలోచనల పరంపరకి ఓ వ్యక్తరూపాన్ని ఇవ్వాలనుకున్నాడు లివీ. ఆ సంకల్పానికి ఫలితంగా అతడి కలం నుండి రోమన్ చరిత్ర పుట్టింది.

(ఇంకా వుంది)