Themes from World History

Themes from World History

Sunday, September 29, 2019

ఒక ఘోర పరాజయం రోమన్ సైన్యంలో కొత్త చైతన్యం తెచ్చింది


గాల్ సేనలు రోమన్ సేనలని తరిమితరిమి కొట్టారు. వారి ధాటికి తట్టుకోలేక రోమన్ సేనలు రోమ్ నగరానికి పలాయనం అయ్యారు. నగరపు ముఖ ద్వారాలని గట్టిగా బిగించుకుని నగరంలో తలదాచుకున్నారు. గాల్ సేనల దెబ్బకి కోట గుమ్మాలు నిలువలేకపోయాయి. శతాబ్దాల చరిత్ర గల రోమ్ నగరాన్ని గాల్ సైనికులు విధ్వంసం చేశారు. ఇక చేసేది లేక శత్రుసేనలకి ఉన్నదంతా ఊడ్చి ఇచ్చి, ప్రాణ భిక్ష పెట్టమని కోరారు రోమన్లు. దొరికినంత దోచుకుని రోమన్లని క్షమించి వదిలిపెట్టారు గాల్ సైనికులు. అప్రతిహతం, అజేయం అని పేరు తెచ్చుకున్న రోమన్ లిజియన్లకి ఆ అవమానం తల తీసేసినట్టు అయ్యింది. రోమన్ సమాజంలో ఆ చేదు అనుభవం గాఢమైన ముద్ర వేసింది. మళ్లీ అలాంటి అనుభవం భవిష్యత్తులో ఎన్నడూ కలగరాదని నిశ్చయించుకున్నారు. మరింత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేసే పనిలో పడ్డారు.


రోమన్ సైన్యంలో కొత్త చైతన్యం ప్రవేశించడం మొదలెట్టింది. సైనిక శిక్షణ మునుపటి కన్నా కఠినంగా మారింది. శౌర్యం, క్రమశిక్షణ, ఆత్మసమర్పణ  అనే మూడు ప్రధాన విలువలు సైనిక శిక్షణకి మూలస్తంభాలు అయ్యాయి. బాధతా నిర్వహణలో, రోమ్ సంరక్షణలో వైఫల్యం పొందే కన్నా ప్రాణత్యగమే మేలన్న భావన ప్రతీ రోమన్ సిపాయికి ప్రథమ పాఠం అయ్యింది.  అలాంటి సైనిక ధర్మసూత్రావళి గొప్ప సైనికులని, సేనానులని సృష్టించింది. జన్మభూమి సంరక్షణే ఊపిరిగా నిస్వార్థంగా పని చేసిన గొప్ప నేతలను తయారుచేసింది.

ఆ కాలంలో ఆ విలువలు పుణికి పుచ్చుకున్న ఒక రోమన్ నేత పేరు లూసియస్ సిన్సినాటస్. ఇతడు క్రీ.పూ. 519 లో జన్మించాడని చరిత్ర చెప్తుంది. రోమ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులలో ఒకడిగా ఉండేవాడు. ఎంతో కాలంగా రోమ్ సామ్రాజ్యవాదానికి స్వస్తి చెప్పి ప్రజాప్రతినిధులు పాలన చేసే గణతంత్రంగా మారిందని చెప్పుకున్నాం. పేరుకి ప్రజాప్రతినిధులైనా, రోమన్ ఉన్నతోద్యోగులు చట్టంలోని సూక్ష్మాలు అర్థం చేసుకుని, ప్రజాధనాన్ని నెమ్మదిగా కైవసం చేసుకోవడం నేర్చారు. దాంతో క్రమంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. పేదరికం పెరిగింది. అలా ఏర్పడ్డ అణగదొక్క వర్గాన్ని ప్లేబియన్లు (plebians) అంటారు. అన్యాయాన్ని సహించలేక ప్లేబియన్లు సమాన హక్కుల కోసం పోరాటం సాగించారు.

సిన్సినాటస్ కి ఒక రౌడీ పుత్రరత్నం ఉన్నాడు. వాడి పేరు కేసో. వీడికి పేదలన్నా, హక్కుల కోసం వాళ్లు చేసే పోరాటాలన్నా గిట్టదు. రౌడీ ముఠాలని వెనకేసుకుని ప్లేబియన్ల సమావేశాలని భంగం చేసేవాడు. అడ్డొచ్చినవారి ప్రాణాలు తీయించేవాడు. కేసో ఆగడాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కేసోని పట్టి బంధించి తెమ్మని ఉత్తరువులు జారీ అయ్యాయి. విషయం తెలిసిన కేసో రోమ్ ప్రాంతం నుండి పొరుగు రాజ్యానికి పరిపోయాడు. కొడుకు చేసిన పాపానికి తండ్రి పరిహారం చెల్లించవలసి వచ్చింది. సిన్సినాటస్ కి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి వచ్చింది.
ఆస్తంతా హరించుకుపోయిన సిన్సినాటస్ రోమ్ నగరాన్ని వదిలి పల్లె ప్రాంతానికి తరలి, సేద్యం చేసుకుంటూ బతకడం ప్రారంభించాడు.

 ఇలా ఉండగా క్రీ.పూ. 458 లో రోమ్ కి తూర్పు వైపున ఉండే ఎక్వీ (Aequi) అనే తెగవారు రోమ్ కి చెందిన టస్కులమ్ అనే ప్రాంతాన్ని అటకాయించి ఆక్రమించాలని చూశారు. ఆ సమయంలో రోమ్ కి కాన్సళ్లు గా ఉన్న ఇద్దరిలో ఒకడు సేనలని తీసుకుపోయి టస్కులమ్ ఆక్రమణని అడ్డుకోవడానికి బయల్దేరాడు. కాని ఆ యుద్ధంలో ఎక్వీ సేనలు కాన్సల్ ని చంపి అతడి సేనలని సమూలనాశనం చేశాయి.
 
కాన్సళ్లలో ఒకరు లేకపోవడం అనేది సామ్రాజ్యవాదంలో రాజు లేని పరిస్థితిని పోలినది. పైగా తూర్పు సరిహద్దుల్లో పరిస్థితి చేజారిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి బలమైన నేతృత్వం కావాలి. రోమన్ చట్టం రాజ్యవాదానికి విరుద్ధమే అయినా కొన్ని అసాధారణ పరిస్థితులలో రాజు వంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి, అతడికి సర్వాధికారాలు కట్టబెట్టడానికి అనుమతిస్తుంది. అయితే ఆ పదవి శాశ్వత పదవి కాదు. గడువు పూర్తయ్యాక ఆ “రాజు” వంటి వ్యక్తి తన పదవికి స్వస్తి చెప్పాలి. గణతంత్ర పాలన ఎప్పట్లాగే కొనసాగాలి.

(ఇంకా వుంది)

Monday, September 23, 2019

గాలిక్ తెగలకి రోమన్ సేనలకి మధ్య ఘర్షణ


రోమ్ సామ్రాజ్య ప్రభ ఇటాలియన్ ద్వీకల్పపు కేంద్రం నుండి మొదలై పాదం ఆకారంలో ఉండే ఆ ద్వీపకల్పంలో ఉత్తర, దక్షిణ దిశలలో క్రమంగా వ్యాపించింది. ఇరుగు పొరుగు రాజ్యాలు ఒక్కొటొక్కటిగా రోమ్ కి పాదాక్రాంతం అయ్యాయి. యుద్ధక్రీడలో ఆరితేరిన రోమన్ సేనలకి ఇక తిరుగులేదన్నట్టుగా అయ్యింది.

కాని ఎంత గొప్ప శక్తికైనా విశ్వంలో దానికి దీటైన శక్తి ఎక్కడో ఉండి తీరుతుంది. ఏదో ఒక సమయంలో అది బహిర్గతం అవుతుంది. రెండు శక్తులూ బలాబలాలు తేల్చుకుంటాయి. అంతవరకు అప్రతిహతం అనుకున్న బలం అబలమని తేలిపోవచ్చు. రోమ్ విషయంలో అలాంటి పరిణామమే ఒకటి క్రీపూ. 386 లో జరిగింది.

రోమ్ కి ఉత్తర సరిహద్దుల్లో ఆల్ప్స్ పర్వతాలకి అవతల ఎన్నో తెగల వారు జీవించేవారు. రోమన్లు వారందరినీ తమ కన్నా తక్కువవారిగా తలచేవారు. అనాగరికులుగా పరిగణించేవారు. ఒక ఉన్నతమైన సంస్కృతి తాము కాక బయటవారు అంతా తమ కన్నా తక్కువవారు అనుకోవడం, సంస్కారహీనులుగా పరిగణించడం ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది. అలాంటి ఒరవడి భారత చరిత్రలో కూడా కనిపిస్తుంది. సంస్కృతంలో ‘మ్లేచ్ఛ’ అనే పదం వుంది. అంటే వైదిక ధర్మానికి బాహ్యంగా ఉండేవారని అర్థం. వ్యావహరికంగా ఆ పదానికి కిరాతులు, అనాగరికులు అన్న అర్థం ఏర్పడింది. ప్రాచీన గ్రీకులని మనం యవనులు అని పిలిచేవారం. మన దృష్టిలో వారు మ్లేచ్ఛులే! కాని ప్రాచీన గ్రీకులు మొత్తం పాశ్చాత్య ప్రపంచానికి నాగరికత నేర్పిన వారు.

క్రీ.పూ నాలుగవ శతాబ్దంలో రోమ్ ఉత్తర సరిహద్దుల్లో జీవించిన ఒక తెగ ‘కెల్ట్’ (Celts) తెగ. వీరు ‘గాల్’ (Gaul)  అనే ప్రాంతంలో జీవించేవారు. ఇదే నేటి ఫ్రాన్స్ దేశం. క్రీపూ. 386 లో అశ్వారూఢులైన గాల్ యోధులు ఆల్ప్స్ పర్వతాలు దాటి రోమన్ సామ్రాజ్యం దిశగా చొచ్చుకువచ్చారు. ఇరుగు పొరుగు తెగలతో యుద్ధాల వల్ల గాల్ తెగలవారు తమ సొంతూళ్లని కోల్పాయారు. నిలువనీడ కోసం వెతుక్కుంటూ ఇటాలియన్ ద్వీపకల్పంలోకి ప్రవేశించి తల దాచుకునేందుకు కాస్త చోటిమ్మని రోమన్ అధికారులతో మంతనాలకి దిగారు. ముక్కుమొహం తెలియని ఈ దెశదిమ్మరి తెగలు తమని గదమాయించడం ఏంటని రోమన్ దౌత్యకారులు మండిపడ్డారు. ఐదూళ్లు ఇమ్మని అలనాడు పాండవులు అడుగగా దుర్యోధనుడు స్పందించిన తీరులో స్పందించారు రోమన్ దూతలు. దాంతో ఒళ్లు మండిన గాల్ తెగలు యుద్ధ భేరి మోగించాయి.

ఈ అనాగరక, అనామక తెగలతో పోరు ఇట్టే తేలిపోతుందని ఊహించిన రోమన్ సేనానులకి గాల్ తెగలు మూడు చెరువుల నీళ్లు తాగించాయి. ఎందుకంటే అసలు యుద్ధం చేసే తీరులోనే రోమన్ సేనలకి, గాల్ సేనలకి మధ్య ఎంతో తేడా వుంది. అసలు ఆ తేడా రెండు వర్గాల సైనికుల ఆకారాలతోనే మొదలౌతుంది. గాల్ జాతి సైనికులు ఆజానుబాహులు. వారి కరవాలాలు కూడా రోమన్ కత్తుల కన్నా పొడవుగా ఉండేవి. ఉక్కులా ధృఢమైన దేహాలతో, కండలుతిరిగిన భుజాలతో భీకరంగా రంకెలు వేస్తూ గుర్రమెక్కి దూసుకొస్తుంటే యమకింకరులు దిగొచ్చినట్టు శత్రువుల గుండెల్లో బెదురుపుట్టేది.

అందుకు భిన్నంగా రోమన్ సేనల సత్తా అంతా వారి క్రమశిక్షణలోను, క్రమబద్ధతనోను ఉంది. సమిష్టిగా పని చేస్తున్నంత వరకే వారి సత్తా. వ్యక్తులుగా పోరాడాల్సి వచ్చినప్పుడు వారి బలహీనత బయటపడేది. అందుకు భిన్నంగా గాల్ సేనల విషయంలో, సమిష్టి వర్తనం మీద కాక, వ్యక్తిగత వర్తనానికి ప్రాధాన్యత ఉండేది. గాల్ సేనలలో ప్రతీ సిపాయి ఒక మహాయోధుడిగా పేరు తెచ్చుకోవాలని తహతహపడేవాడు. పక్కవాడి సంగతి ఆలోచించకుండా ఎవడికి వాడు చిచ్చరపిడుగులా శత్రుసేనల మీద విరుచుకుపడి దయ్యం పట్టినట్టు పోరాడేవాడు. ఇలాంటి విచిత్రమైన యుద్ధ విధానం రోమన్లని కలవరపెట్టింది.
యమకింకరుల్లా విరుచుకుపడుతున్న గాల్ వీరులు


(ఇంకా వుంది)

Tuesday, September 10, 2019

సామ్రాజ్య వాదానికి స్వస్తి చెప్పిన ప్రాచీన రోమ్


ఆ తరుణంలో రోమన్ చరిత్ర మరో గొప్ప మలుపు తిరిగింది. రోమన్ ప్రజలు కేవలం ఎట్రుస్కన్లతోనే కాదు, అసలు రాజులతోను, రాజకుటుంబాలతోను విసిగిపోయారు. ఆ గద్దెనెక్కిన ప్రతి ఒక్కడూ ఏదో సందర్భంలో మదమెక్కి అహంకరిస్తాడు. ప్రజలని కాపాడవలసిన రాజు గజదొంగలా ప్రజలని దోచుకోవడం మొదలెడతాడు. రాజులు రాక్షసుల్లా ప్రవర్తించడం, ప్రజలు తిరగబడి వాళ్లని రాజమందిరాల నుండి బయటికి ఈడ్చి బహిరంగంగా తలలు నరకడం – ఈ ఘట్టం చక్రికంగా చరిత్రలో కనిపిస్తూనే ఉంటుంది. దాంతో రోమన్ ప్రజలలో రాజుల పట్ల, వారి పాలన పట్ల గాఢమైన విముఖత పెరిగింది.

మరి రాజులు లేకుండా పాలన సాగెదెలా? రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? దానికి రోమన్లు ఆలోచించిన పరిష్కారం రోమన్ చరిత్రని సమూలంగా మార్చేసింది. ప్రజలే పాలన సాగిస్తారు. పాలన అనేది ‘ప్రజల వ్యవహారం’, res publica.  దీన్నే నేడు  Republic  అంటున్నాం.  ఈ విధానంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పాలన సాగిస్తారు. వీళ్లని consuls (కాన్సళ్లు) అంటారు.

కొత్త విధానం అమలులోకి వచ్చాక్ రోమ్ ని ఇద్దరు కాన్సళ్లు పాలించారు. వారిలో ఒకడు ఎట్రుస్కన్ల మీద తిరుగుబాటు సాగించిన బ్రూటస్. రెండవ వాడు మరణించిన లుక్రీషియా భర్త. ఒకరికి బదులు ఇద్దరు కాన్సళ్లని ఎంచుకోవడానికి ఒక కారణం వుంది. ఏలిక ఒకడే అయితే ఒక్కడికే మితిమీరిన బలం చేతికి ఇచ్చినట్టు అవుతుంది. పాలకులు ఇద్దరు ఉంటే అంతమేరకు సమస్య ఉండదు. పైగా ప్రతీ నిర్ణయంలోను కాన్సళ్లు ఇద్దరూ ఏకీభవించాలి. అప్పుడే ఆ నిర్ణయం అమలు లోకి వస్తుంది. ఈ నియమం వల్ల ఎవడో ఒక్కడే ఇష్టానుసారం నడచుకునే ఆస్కారం ఉండదు. క్రమంగా ఇద్దరు కాన్సళ్ల చుట్టూ ఒక ప్రజాప్రతినిధుల సదస్సు ఏర్పడింది. దాని పేరే Senate. మన దేశంలో వాడుకలో ఉన్న లోక్ సభ, రాజ్య సభల వంటి సదస్సులకి ఇది పూర్వరూపం అని చెప్పుకోవచ్చు. SPQR (Senatus Populusque Romanus) అంటే ‘సెనేట్ మరియు ప్రజలు’ అనేది రోమన్ పాలనావిధానాన్ని క్లుప్తంగా వ్యక్తం చేసే ధర్మసూత్రంగా స్వీకరించబడింది. ఆధునిక ప్రాజాస్వామ్యాలకి ఆ విధంగా ప్రాచీన రోమ్ ఒక మాతృకలా రూపుదిద్దుకోసాగింది.



రోమ్ కి ఇప్పుడు ప్రజాహితవైన పాలనా విధానం ఏర్పడింది. ఎన్నో సంస్థాగతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాని ప్రజా సంక్షేమం కావాలంటే సమర్థవంతమైన పాలన మాత్రం ఉంటే సరిపోదు. శత్రువుల దాడుల నుండి ప్రజలని రక్షించగల సమర్థవంతమైన సైనిక బలం కావాలి. రోమన్ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి సైన్యాన్ని తయారుచేసే పనికి పూనుకున్నారు. పాలనా విధానాలలో తెచ్చిన క్రమబద్ధీకరణే సైనిక శిక్షణలో, నిర్వహణలో తీసుకువచ్చారు. అనతి కాలంలోనే క్రమశిక్షణకి, మొక్కవోని పరాక్రమానికి పెట్టింది పేరు అయిన రోమన్ సేనాదళం రూపుదిద్దుకుంది.

కొత్తగా ఏర్పడ్డ సైనిక బలాల బలాబలాలు తేల్చుకోవడానికి ఇప్పుడు ఒక లక్ష్యం కావాలి. గతంలో రోమన్లు ఎట్రుస్కన్ పాలకులని తరమికొట్టినా ఎట్రుస్కన్ల బెడద పూర్తిగా తొలగిపోలేదు. వారు ఇప్పుడు పొరుగు రాజ్యం వారు. రోమన్లకి చిరకాల శత్రువులు. రోమన్లకి, ఎట్రుస్కన్లకి మధ్య పోరు మొదలయింది. అయితే ఆ పోరు రోజులు, నెలలు కాదు, ఇంచుమించు ఒక శతాబ్ద కాలం పాటు సాగింది.

క్రీ.పూ. 392లో ఎట్రుస్కన్లకి, రోమన్లకి మధ్య జరిగిన పోరు ఆ రెండు రాజ్యాల మధ్య ఆఖరు పోరాటం అవుతుంది. రోమన్ సేనలు ఎట్రుస్కన్ల ప్రధాన నగరం అయిన వేయ్ (Veii) ని ముట్టడించాయి. టైబర్ నదికి ఒక పక్క ఎట్రుస్కన్లు, మరో రోమన్ సేనలు మొహరించాయి. పదే పదే ఇరు సేనలు తలపడుతూ అధిపత్యం కోసం పెనుగులాడాయి.  అతిశయమైన క్రమశిక్షణతో, క్రమబద్ధంగా, కలిసికట్టుగా ఒక మారణ యంత్రంలా పోరాడే రోమన్ సేనల ధాటికి చివరికి ఎట్రుస్కన్ సేనలు తలవంచవలసి వచ్చింది. రోమన్ సేనలు వేయ్ నగరాన్ని సర్వనాశనం చేశాయి. పురుషులని హతమార్చి, స్త్రీలని  చెరపట్టి బానిసలుగా చేసుకున్నారు.
ఎట్రుస్కంలపై విజయం రోమన్ సేనలకి మొట్టమొదటి ప్రముఖ విజయం. ఆ విజయానికి జ్ఞాపకార్థం ఒక విజయతోరణాన్ని (Arc of Triumph) నిర్మించారు. 


పారిస్ లో ఆర్క్ ద త్రియోంఫ్

రానున్న మరెన్నో సైనిజ విజయాలకి ఇది ముక్తాయింపు అయ్యింది. ఏ శత్రు రాజ్యాన్ని జయించినా ఆ విజయానికి జ్ఞాపకంగా ఒక విజయతోరణాన్ని నిర్మించడం ఒక ఆనవాయితీ అయ్యింది. రోమ్ లో మొదలైన ఈ ఆచారపు ప్రభావం తదనంతరం ఆధునిక యూరప్ కి కూడా పాకింది. నేడు పారిస్ నగరం నడిబొడ్డులో వెలసిన Arc de Triomphe అలాంటి ప్రభావానికి నిదర్శనం. ఫ్రెంచ్ విప్లవానికి జ్ఞాపక చిహ్నంగా ఆ విజయతోరణాన్ని నిర్మించారు. అలాంటిదే మరో నిదర్శనం మన దేశ రాజధానిలో వెలసిన ఇండియా గేట్. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలలో భాగంగా పోరాడిన భారతీయ సిపాయిల జ్ఞాపకార్థం ఆ విజయతోరణాన్ని నిర్మించారు.
దిల్లీ లో ఇండియా గేట్

(ఇంకా వుంది)

Wednesday, September 4, 2019

ఎట్రుస్కన్ల నుండి విముక్తి పొందిన రోమన్లు



రోమన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా జనాభా గణన (population census) ప్రక్రియని అమలుజరిపాడు సర్వియస్ టలియస్. రోమ్ లోని జనాభా లెక్కలు సేకరించి, రోమన్ ఉపజాతులలో ఏఏ జాతులవారు ఎందరు ఉన్నారో లెక్కించి, వారి రాజకీయ విశ్వాసాలు ఎలాంటివో గుర్తించి, నమోదు చేసి, వివిధ వర్గాల మధ్య నిమ్నోన్నతలు బేరీజు వేయడం ఈ గణన ప్రక్రియ యొక్క లక్ష్యం. అలా జనాభా లెక్కల్లోకి ఎక్కిన ప్రతీ వ్యక్తి రోమన్ పౌరుడు అవుతాడు. రోమన్ పౌరులు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ ఆ వ్యక్తి నిర్వర్తించవలసి ఉంటుంది. పన్నులు కట్టడం, రోమన్ చట్టానికి ఒడంబడి జీవించడం, అవసరమైతే సైనిక సేవలు అందించడం మొదలైనవి. బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పౌరులకి హక్కులు కూడా సొంతం అవుతాయి. ఆ హక్కుల్లో ముఖ్యమైనది రోమ్ నగర పాలనలో వారికీ ఒక స్థానం కలిగి ఉండడం. పౌరులలో ప్రతీ వర్గానికి కొందరు ప్రతినిధులు ఉంటారు. ఆ ప్రతినిధులతో కూడుకున్న ఒక సదస్సు పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దానినే సెనేట్ (senate) అంటారు. అలాగే ప్రతీ పౌరవర్గం నుండి కొందరు యువకులు సైనిక సేవలు అందిస్తారు. అలా ఏర్పడ్డ సైనిక దళాలనే లిజియన్ లు (legions) అంటారు.

ఆ విధంగా సర్వియస్ టలియస్ ప్రవేశపెట్టిన జనాభా గణన ప్రక్రియ ఒక అధునాతమైన, అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యవస్థకి బీజాలు వేసింది. అది ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే అప్పటికీ రాజులే రాజ్యం చేసేవారు. అందులో పౌరులందరికీ సమానహక్కులు ఉండేవి కావు. ఉదాహరణకి స్త్రీల హక్కులు చాలా బలహీనంగా ఉండేవి. ఇక  బానిస జాతికి చెందిన వారికి అసలు ఏ హక్కులూ ఉండేవి కావు. అయినా  కూడా ఈ వ్యవస్థ వల్ల రోమన్ పౌరులకి తమ పాలన యొక్క తీరు తెన్నులని కొంత వరకు తామే నిర్దేశించుకునే వీలు ఏర్పడింది. ఆ పద్ధతిలో సామాజిక వ్యవహారాలన్నీ అధ్బుతమైన క్రమబద్ధతతో, నిర్వహణా కౌశలంతో నడిపించబడేవి. 

రోమన్ సంస్కృతి అంతటికీ సారం అని చెప్పుకోదగ్గ లక్షణం – నిర్వహణా కౌశలం – ఆ సంస్కృతిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో సహస్రాబ్దాల రోమన్ చరిత్రలో ఎన్నో సార్లు చూస్తాము. ఏనాడైతే ఆ నిర్వహణా కౌశలంలో బీటలు తలెత్తాయో, క్రమబద్ధతలో కల్లోలపు టలలు పైకెగశాయో ఆ నాడే రోమన్ సామ్రాజ్య పతనం మొదలయ్యింది అని కూడా గుర్తిస్తాము.

దురదృష్టవశాత్తు రోమన్ సంస్కృతికి అంత బలమైన పునాదులు వేసిన సర్వియస్ టలియస్ పట్ల కృతజ్ఞతాభావంతో నడచుకోలేదు రోమన్లు. అతడి దాయాదులే నయవంచనకి ఒడిగట్టారు. రాజుకి ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. ఇద్దరి పేళ్లూ టలియా నే. ఇద్దరు కూతుళ్లకి టార్కీనియస్  అనే రాజు కొడుకులైన లూసియస్ టార్కీనియస్, ఆరన్స్ టార్కీనియస్ అనే రాకుమారులకి ఇచ్చి కట్టబెట్టాడు. చిన్న కూతురు టలియా తన భర్త లూసియస్ టార్కీనియస్ తో కలిసి తండ్రిని హత్య చేసే పన్నాగం పన్నింది. ఒక రోజు సెనేట్ భవనంలోకి రాబోతున్న రాజుని లూసియస్ నడిరోడ్డు మీదే అటకాయిస్తాడు. వెనువెంటనే అతడి భార్య (రాజు చిన్న కూతురు) టలియా కింద పడ్డ తండ్రి మీదకి రథాన్ని పోనిస్తుంది.

రోమ్ కి అంత మేలు చేసిన రాజు ఆ విధంగా తన బంధువర్గం చేతనే దారుణంగా హత్య చెయ్యబడ్డాడు. రాజు మరణించాక రోమ్ లో అరాచకం మొదలయ్యింది. రాచవ్యవహారాలలో కల్లోలం నెలకొంది. సర్వియస్ మరణం రోమ్ చరిత్రలో ఓ చీకటి ఘట్టంగా చెప్పుకుంటారు. మామగార్ని హత్య చేసిన లూసియస్ గద్దెకెక్కాడు. కిరాతకులైన భార్య, భర్తలు ఇద్దరూ రాజసభలో తమకి శత్రు శేషం లేకుండా దివంగత రాజు పక్షాన ఉన్న రాజోద్యోగులని గుట్టు చప్పుకుడు కాకుండా హత్య చేయించడం మొదలెట్టారు. ప్రజాదరణ పొందిన రాజు చనిపోవడమే కాక అతడి అనుయూయులు కూడా ఈ విధంగా ఒక్కరొక్కరే మాయం కావడం ప్రజలలో కలకలం రేపింది. ఎట్రుస్కన్ పాలకుల పట్ల ప్రజలలో క్రమంగా ద్వేషం పెరగసాగింది.

ఇలా ఉండగా ప్రజలలో రాజుకుంటున్న క్రోధాగ్నిని ఓ కార్చిచ్చులా మార్చి విప్లవానికి దారితీసిన ఒక సంఘటన జరిగింది. దానికి కారణం లుక్రీషియా అనే ఒక రోమన్ స్త్రీ. లుక్రిషియా బాగా చదువుకున్నది. గొప్ప సౌందర్యవతి కూడా. రోమన్లు గౌరవించే మర్యాద, ఔన్నత్యం, ధైర్యం మొదలైన గుణాలు తనలో నిండుగా పోతపోసుకున్న వ్యక్తి.  ఒక సందర్భంలో ఓ దుష్టుడైన రాజకుమారుడి కన్ను ఆమె మీద పడింది. తన అనుచరులతో పాటు ఏకాంతంగా తన ఇంట్లో ఉన్న లుక్రీషియా మీద దాడి చేసి ఆమె మీద అఘాయిత్యం చేసి, జరిగిన విషయం ఎక్కడైనా పొక్కితే చంపుతానని బెదిరిస్తాడు. మానవతి అయిన లుక్రీషియా ఆ రాత్రే ఆత్మహత్య చేసుకుంటుంది.

(లుక్రీషియాని చిత్రీకరించే 1633 నాటి తైలవర్ణ చిత్రం. చిత్రకారుడు విల్లెమ్ ద పోర్టర్)


కోపం కట్టలుతెంచుకున్న రోమన్లు పాలకుల మీద తిరగబడ్డారు. రోమ్ వీధుల మీద వీరంగం చేస్తూ ఎట్రుస్కన్ జాతి వారిని ఊచకోత కోయడం మొదలెట్టారు. బ్రూటస్ అనే రోమన్ జాతి వాడు ఆ తిరుగుబాటుకు దిశానిర్దేశం చేశాడు. రోమన్ల దెబ్బకి ఎట్రుస్కన్లు తట్టుకోలేకపోయారు. రాజమందిరాన్ని వదిలి పలాయనం చిత్తగించారు. రెండు వందల ఏళ్లపాటు రోమ్ ని పాలించిన ఎట్రుస్కన్ల నుండి ఆ విధంగా క్రీ.పూ. 510 లో రోమన్లకి విముక్తి లభించింది.

(ఇంకా వుంది)

Monday, September 2, 2019

రోమన్ సామ్రాజ్య చరిత్రని మలుపు తిప్పిన ఒక సామాజిక ఆచారం

(బ్లాగర్లకి వినాయక చవితి శూభాకాంక్షలు. ఇంచుమించు మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ "ప్రపంచ చరిత్ర" బ్లాగ్ నిర్వహణలో సమయాభావం వల్ల అంతరాయం కలిగింది. మళ్లీ ఈ సీరియల్ ని కొనసాగించదలచుకున్నాను. శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లాగానే ఈ బ్లాగ్ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...)




ఓ దారుణ ఘాతుకంతో, భ్రాతృహత్యతో మొదలైన రోమన్ చరిత్రలో, కొన్ని సహస్రాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగిన రోమన్ చరిత్రలో, హింసా కాండ ఓ ముఖ్యభాగం అయిపోయింది. తొలిదశలలో ఓ కిరాత జాతిలా అడవులు పట్టి తిరిగిన రోమన్లు ఇరుగు పొరుగు కిరాత జాతులతో అనవరతం ఘర్షణ పడుతూ ఎంతో నెత్తురు చిందించారు. కొన్ని శతాబ్దాల పరిణామం తరువాత, ఓ అవిశేషమైన గూడెం ఓ విశాల సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత కూడా, సుశిక్షితులైన రోమన్ సేనలకి ఉత్తర సరిహద్దుల నుండి పదే పదే దాడులు చేసే జర్మన్ కిరాత జాతులకి మధ్య జరిగిన యుద్ధాలలో రక్తం వరదలై పారింది. స్థాయి పెరిగింది, తీరు పెరిగింది గాని, రక్త తర్పణం మాత్రం ఆగలేదు, హింసా ప్రవృత్తిలో మాత్రం మార్పు లేదు.


రోమన్ చరిత్ర తొలిదశలలో, ఇరుగు పొరుగు కిరాత జాతులని జయించి తమ చిన్న పాటి రాజ్యాన్ని వేగంగా విస్తరింపజేసుకోవాలని తహతహపడే రోమన్లకి ఓ విచిత్రమైన సమస్య ఎదురయ్యింది. వారిలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. మరి జాతి వర్ధిల్లాలంటే సంతానం కావాలి, అంటే స్త్రీలు కావాలి. తమలో స్త్రీల సంఖ్య పెంచడం ఎలా? ఆ సమస్యకి పరిష్కారంగా రోమ్యులస్ రాజు ఓ కపటమైన ఉపాయం తట్టింది.

తమ పొరుగు జాతి అయిన సేబైన్ (Sabines)  లని విందుకోసం ఆహ్వానించారు. ఆ వచ్చే టప్పుడు తమ భార్యలని, కూతుళ్లని విందుకు తీసుకు రావడం మరవొద్దని మరీ మరీ గుర్తుచేశారు రోమన్లు. ఆహ్వానాన్ని మన్నించి విందుకి విచ్చేశారు అతిథులు. సంబరాలు మిన్నంటాయి. మద్యం ఏరై పారింది. సేబైన్ అతిథులు మత్తులో మునిగితేలారు. అతిథులు ఉన్మత్తులై ఉన్న స్థితి గమనించి రోమ్యులస్ తన అనుచరులకి సంజ్ఞ చేశాడు. రోమన్లు సేబైన్ పురుషుల మీద పడి దొరికిన వారిని దొరికినట్టు అనాగరికంగా ఊచకోత కోశారు. సేబైన్  స్త్రీలని  తన సొంతం చేసుకున్నారు. ఆ విధంగా పరమ నీచమైన, అమానుష చర్యల పునాదిరాళ్ల మీద రోమన్ రాజ్యం నెమ్మదిగ ఎదిగింది.

క్రీపూ ఐదవ  శతాబ్దానికల్లా రోమ్ గణనీయంగా ఎదిగింది. రోమ్ ఇప్పుడు మట్టిగోడల పూరిపాకలతో కూడుకున్న అవిశేషమైన గూడెం కాదు. ఇటుక గోడలతో పెద్ద పెద్ద భవనాలతో కూడుకున్న నగరం. ఎట్రుస్కన్ సామ్యాజ్యంలో అంతో ఇంతో ప్రాభవం గల రాజ్యం రోమ్. ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి జనం రోమ్ నగరానికి వలస వెళ్లారు. రోమ్ జనాభా క్రమంగా పెరిగింది. ఎట్రుస్కన్ లు, ఫోనీషియన్లు వ్యాపారం కోసం రోమన్ విపణి వీధుల్లో సంచరించేవారు. వైన్, బంగారం, ఆలివ్ పళ్లతో వ్యాపారం ముమ్మరంగా సాగేది.

వాణిజ్యంలో, ఆర్థిక సత్తాలో, సాంకేతిక పరిజ్ఞానంలో రోమ్ కి ఏ విధంగానూ తీసిపోని నగరాలు మధ్యధరా ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. కాని ఈ నగరాలలో లేని ఓ ప్రత్యేక లక్షణం రోమ్ జీవన విధానంలో వుంది. అది నిర్వహణా కౌశలం. అధిక సంఖ్యలు మనుషులు, గొప్ప క్రమ శిక్షణతో, వ్యవహార శీలతతో, వ్యూహాత్మకంగా పని చేసి అసాధారణ ఫలితాలని సాధించడం. ఈ ఒక్క లక్షణం వల్ల రోమ్ నగరం తగ్గిక గ్రీకు నగర-రాష్ట్రాలకి (city states) మల్లె మిగిలిపోకుండా ఓ విశాల విశ్వసామ్యాజ్యం స్థాయికి ఎదిగింది. ఆ ఒక్క లక్షణం వల్లనే, రోమన్ సామ్రాజ్యం తనతో పాటే పుట్టి కొద్దిపాటి శతాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగి, ఆరిపోయే ఊళ్లలా కాక, సహస్రాబ్దాల పాటు చిరాయువై వర్ధిల్లింది.


రోమ్ లో మొట్టమొదట ఈ ప్రత్యేక లక్షణాన్ని చిగురింపజేసినవాడు రోమ్ కి చెందినవాడు కాడు. అతడొక ఎట్రుస్కన్ రాజు. అతడి పేరు సర్వియస్ టలియస్ (Servius Tullius). ఇతగాడు  క్రీపూ 575–535   రోమ్ ని ప్రాంతంలో రోమ్ ని పాలించాడు.  రోమ్ ని పాలించిన పాలకులలో సంస్థాపకుడైన రమ్యులస్ మొదటి వాడు అయితే, సర్వియస్ టలియస్ ఆరవవాడు. రోమన్ చక్రవర్తులలో చిరకీర్తి సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. రక్తతర్పణం చేసి శత్రు శేషం లేకుండా చేసిన వాళ్లు, అంతఃకలహాలని నిర్దయగా అణచివేసి తమ ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకున్నవారు, జైత్రయాత్రలు చేసి రోమన్ సామ్రాజ్య సరిహద్దులని అపారంగా విస్తరింపజేసినవారు – ఇలా బలోద్ధతి చేత పేరు మోసిన వాళ్లు ఎందరో ఉన్నారు.  సర్వియస్ టలియస్ ఇలాంటివి ఏవీ చెయ్యలేదు. కాని అతడు చేసిన మేలు రోమన్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది.

(ఇంకా వుంది)