Themes from World History

Themes from World History

Tuesday, October 22, 2019

రెండవ ప్యూనిక్ యుద్ధం


స్పెయిన్ ని అటకాయించాలంటే ఒక పద్ధతి మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశలో ప్రయాణించడం. కాని సముద్రం మీద కార్తేజ్ కి ఇప్పుడు  పట్టు లేకపోవడం వల్ల ఇక నేల మార్గాన స్పెయిన్ ని చేరుకోవాలి. దానికి ఒక్కటే మార్గం. ఆఫ్రికా ఉత్తర తీరం వెంట పశ్చిమ దిశగా ప్రయాణించాలి. జిబ్రాల్టర్ జల సంధి (Strait of Gibraltar) వద్ద ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండానికి చాలా సన్నిహితంగా వస్తుంది. ఆ జలసంధి వెడల్పు 14.2 కిమీ లు మాత్రమే. ఓడల మీద సేనలని ఆ జలసంధిని దాటించాలి.

జిబ్రాల్టర్ జలసంధికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత వుంది. అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ జలసంధి ఒక ముఖ ద్వారంలా ఉంటుంది. జలసంధికి ఇరుపక్కలా రెండు ఎత్తయిన రాతి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి అనాదిగా ‘హెర్క్యులిస్ స్తంభాలు’ అని పేరు చలామణిలో ఉంది. గ్రీకు, రోమన్ పురాణాలలో కథానాయకులు చేసే సముద్ర యాత్రలలో ఈ ‘హెర్క్యులిస్ స్తంభాల’ ప్రస్తావన ఎన్నో సార్లు వస్తుంటుంది.

ఆ విధంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన యాత్ర మీద తన సేనలని తరలించడం కోసం హమిల్కార్ సన్నాలు మొదలెట్టాడు. అప్పటికే కుర్రవాడైన హానిబల్ తను కూడా తండ్రితో వస్తానన్నాడు. రోమ్
 మీద పగ తీర్చుకోవాలన్న తన చిన్ననాటి కోరిక తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా తోచింది తనకి. తండ్రి ఒప్పుకున్నాడు గాని ఒక షరతు పెట్టాడు. కొడుకుతో ఈ విధంగా ప్రమాణం చేయించుకున్నాడు.

“… అగ్గిని, ఉక్కును ఒక్కటి చేసి రోమ్ భవితవ్యాన్ని బుగ్గి చేస్తాను”

అని తండ్రికి వాగ్దానం చేశాడు కొడుకు.

స్పెయిన్ మీద కార్తేజ్ చేసిన జైత్రయాత్రలు ఎన్నోఏళ్లపాటు సాగాయి. ఆ యుద్ధాలలో సుమారు క్రీ.శ. 228 లో హమిల్కార్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత అతడి అల్లుడు సేనలకి సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. కాని క్రీపూ. 221 లో అతడు హతమార్చబడ్డాడు. ఈ సారి కార్తేజ్ సేనలకి అధిపతి అయ్యే అవకాశం హానిబల్  కి దక్కింది. స్పెయిన్ ని గెలిచే కార్యభారం ఇప్పుడు కుర్రసేనాని  భుజాల మీద పడింది. సేనాని అయిన ఎనిమిది నెలలలోనే ఇన్నేళ్లుగా సాగిన యుద్ధానికి ఒక ముగింపు కనిపించింది. స్పెయిన్ హానిబల్ వశం అయ్యింది.

స్పెయిన్ చేజిక్కగానే హానిబల్ రోమ్ ని అటకాయించే సుముహూర్తం కోసం తహతహలాడాడు. మధ్యధరా సముద్ర ఉత్తర తీరం వెంట సేనలని ఇటలీ దిశగా నడిపించాడు. ఎముకలు కొరికే చలిలో సేనలు హిమావృతమైన పిరినీస్ పర్వతాలు దాటాయి. పలు పెద్ద పెద్ద నదులు దాటాయి. దారిలో ఎదురైన చిన్న చితక కిరాత జాతులని జయించి వారి విధేయతను సాధించాడు హానిబల్. 38,000 వేల కాల్బలంతో, 8,000  అశ్వబలంతో, 37 ఏనుగుల గజబలంతో కూడుకున్న తన మహాసైన్యాన్ని రోమ్  యొక్క ఉత్తర సరిహదుల దిశగా నడిపించాడు.

రెండవ ప్యూనిక్ యుద్ధం

దారిలో సేనలు ఎత్తయిన ఆల్ప్స్ పర్వత శ్రేణులని దాటవలసి వచ్చింది. అష్టకష్టాలు పడి పర్వతాలు దాటి ఉత్తర ఇటలీలోకి ప్రవేశించేసరికి తన సేనలలో మూడవ వంతు హరించుకుపోయాయి. అశ్వాలలో చాలా మటుకు నాశనమయ్యాయి. ఒక్కటే ఏనుగు మిగిలింది. అయినా హానిబల్ నిరుత్సాహపడలేదు. యుద్ధం మానుకునే ఆలోచనలని దరిజేరనీయలేదు. పైగా స్పెయిన్ ని గెలిచాక కొంత స్పానిష్ సైన్యం కూడా ఇప్పుడు తన సైన్యంతో కలిసింది. అంతే కాకుండా  రోమ్  చిరకాల శత్రువులైన గాల్ ప్రాంతీయులని కూడా తనతో చేతులు కలపమని ప్రోత్సహించాడు. రోమ్ మీద చావుదెబ్బ కొట్టే అదను కోసం గాల్ ప్రాంతం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలా అత్యంత శక్తివంతమైన, మిశ్రమ సైన్యంతో హానిబల్ రోమన్ సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దుల మీదకి దాడి చేశాడు.
శత్ర్రువు సత్తా ఏపాటిదో రోమన్ సెనేట్ అప్పటికే గుర్తించింది. ఆరు లిజియన్లు అంటే 30,000 మంది సిపాయిలతో కూడిన అదనపు బలగాలని హానిబల్ సేనలని అడ్డుకోవడానికి పంపింది. హానిబల్ పక్షానికి, రోమ్ పక్షానికి మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. రోమన్ సేనానులు ప్రభుత్వం చేత నియామకం అయిన మామూలు ఉద్యోగులు. పెద్దగా యుద్ధానుభవం లేని వాళ్లు. కాని హానిబల్ చిన్నతనం నుండి యుద్ధం రుచి మరిగినవాడు. పోరాటమే జీవితం అన్నట్టు పెరిగినవాడు. యుద్ధ భూమిలో ఏర్పడే పరిస్థితులకి వేగంగా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నడంలో ఆరితేరిన వాడు. శత్రువు బలహీనత ఎక్కడుందో గుర్తించి, సకాలంలో చర్యతీసుకుని చావుదెబ్బ కొట్టగల సూక్ష్మబుద్ధి గలవాడు. 

(ఇంకా వుంది)

Friday, October 11, 2019

ప్రతీకారానికి పథకం వేస్తున్న కార్తేజ్



నౌకలు అయితే సిద్ధం అయ్యాయి గాని, నావిక యుద్ధం లో శతాబ్దల అనుభవం గల కార్తిజీనియన్లని గెలిచేదెలా? రోమన్లకి తెలిసిందల్లా నేల మీద సాము మాత్రమే. నేల యుద్ధంలో తమకి సాంప్రదాయకంగా ఉన్న సత్తాని తెలివిగా వాడుకుంటూ, నౌకాయుద్ధంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు రోమన్లు. శత్రునౌకకి అల్లంత దూరం నుండి బాణాలు, బల్లేలు విసరడం పాతపద్ధతి. అందుకు భిన్నంగా ఏకంగా శత్రునౌకకి ఆనుకునేటంత పక్కగా వెళ్లి, పొడవాటి పలకలని వంతెనలుగా పరిచి, తమ నౌక నుండి శత్రునౌక మీదకి నడిచి వెళ్లి, అక్కడ శత్రు నౌక లో ‘నేల మీద సాము’ చెయ్యడం కొత్త పద్ధతి. శత్రుసైనికుడికి ఎదురెళ్లి బారైన కత్తితో, నిలువెత్తు డాలుతో విరుచుకుపడే రోమన్ యోధుడికి ఎదురునిలువగల శత్రుసిపాయిలు అరుదు.

కార్తేజ్ మీద రోమ్ దండయాత్రలు మొదలయ్యాయి. ఇరవై మూడు ఏళ్ల పాటు సాగిన సంకుల సమరానికి అంతంలో, క్రీ.పూ. 241 లో రోమ్ కార్తేజ్ మీద మొట్టమొదటి విజయాన్ని సాధించింది. సిసిలీ, సార్డీనియా దీవులు రోమ్ హస్తగతం అయ్యాయి. ఆఫ్రికా తీరం ఇంకా అందిరాలేదు. కార్తేజ్ సామ్రాజ్యపు ఖజానా మొత్తం ఊడ్చి ఇమ్మని కార్తేజ్ సామ్రాట్టుతో బలవంతంగా ఒప్పందం రాయించుకున్నారు రోమన్లు. ఆ విధంగా మొదటి ప్యూనిక్ యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

రెండవ ప్యూనిక్ యుద్ధం

శతాబ్దాల వైభవం చూసిన కార్తేజ్ కి ఆ పరాభవం భరించరానిది అయ్యింది. కార్తేజ్ కి జరిగిన అవమానాన్ని, రోమ్ కార్తేజ్ ని కొల్లగొట్టిన తీరుని ఒక పిల్లవాడు చూశాడు. వాడి రక్తం ఉడికిపోయింది. ప్రతీకారపు రవ్వలు రాజుకున్నాయి. కార్తేజ్ కి చెందిన ఒక సేనాని కొడుకు ఆ పిల్లవాడు. వాడి పేరు హానిబల్ (Hannibal).

హానిబల్ తండ్రి పేరు హమిల్కార్.  మొదటి ప్యూనిక్ యుద్ధలో  అతగాడు కార్తేజ్ సేనలకి సర్వసేనానిగా ఉండేవాడు. కార్తేజ్ ఓటమికి తనదే బాధ్యత అన్న భావన అతణ్ణి దొలిచేయసాగింది. సిసిలీ, సార్డీనియా దీవులని కోల్పోయిన కార్తేజ్ కి మధ్యధరా సముద్ర ప్రాంతాలలో పట్టు సడలింది. ఆ సముద్ర ప్రాంతాల్లో రోమన్ నౌకా దళాలు గస్తీ తిరుగుతుంటాయి. వాటితో తలపడేటంత నౌకాబలం ఇప్పుడు కార్తేజ్ కి లేదు.

ఆఫ్రికా తీరం మీద మాత్రం కొంత భూభాగం మిగిలింది. ఎలాగైనా మళ్లీ సేనలని పోగుచేసి పోయిన భూభాగాలని మళ్లీ రోమ్ చేతుల నుండి వశం చేసుకోవాలి. ఇలా ఆలోచించిన హమిల్కార్ దృష్టి ఉత్తరాన ఉన్న హిస్పానియా (నేటి స్పెయిన్) మీద పడింది.

స్పెయిన్ కి రోమ్ కి మధ్య చిరకాల శత్రుత్వం వుంది. స్పెయిన్  ని గెలవడం అంత కష్టం కాదు. స్పెయిన్ కార్తేజ్ పక్కకి వస్తే, అలాగే కాస్త తూర్పుగా ఉన్న గాల్ ని కూడా తన పక్కకి తిప్పుకుంటే, రోమ్ మీద విజయావకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యూహంతో హమిల్కార్ స్పెయిన్ మీద దండయాత్రకి సేనలని సిద్ధం చేశాడు.

(ఇంకా వుంది)

Friday, October 4, 2019

ప్యూనిక్ యుద్ధాలు


2. ప్యూనిక్ యుద్ధాలు

క్రీ.పూ. 500 ప్రాంతాల్లో బయటప్రపంచానికి తెలియని ఓ చిన్న అనామక ప్రాంతం. కాని రెండు శతాబ్దాలు తిరిగేలోగా గొప్ప ప్రపంచబలంగా అవతరించింది రోమ్. సుశిక్షితులైన రోమన్ లిజియన్లు ఇరుగు పొరుగు రాజ్యాలని ఒక్కొటొక్కటిగా జయించి రోమన్ సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరింపజేశాయి. మొదట్లో రోమన్ ప్రభుత్వం తన సేనలని కేవలం ఆత్మరక్షణ కోసమే వాడుతున్నాం అని ప్రకటించుకునేది. ఆ ‘ఆత్మరక్షణవాదం’ వాదం కాస్తా నెమ్మదిగా రూపురేఖలు మార్చుకుంది. మొదట్లో ప్రత్యర్థి తమని అటకాయించినప్పుడే తమ సేనలని వాడుతాము అన్న ప్రభుత్వం, క్రమంగా ప్రత్యర్థికి తమని అటకాయించే ఉద్దేశం వుందని తెలిసినా తమ సేనలని వాడుతాము అనే ధోరణికి దిగింది. ఏ దేశానికి అయినా సరిహద్దులకి అవతల ఉండే పొరుగు రాజ్యాలు   ప్రబల రాజ్యాలు అయితే, అధికశాతం సందర్భాలలో వాటిని శత్రు రాజ్యాలుగానే పరిగణించవలసి ఉంటుంది. ఒకరిపట్ల ఒకరికి సహజంగా ఉండే అవిశ్వాసం వల్ల అదను చూసి ఒకరినొకరు అదుపుచేయాలనే అనుకుంటారు. అలాగని పొరుగురాజ్యాలని వరుసగా అటకాయిస్తూ పోవడాన్ని ఆత్మరక్షణ అనరు, దౌర్జన్యం అంటారు.

రోమ్ సేనల జైత్రయాత్ర అలా అప్రతిహతంగా కొనసాగింది. మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం ఇంచుమించు పూర్తిగా రోమన్ సేనల అదుపులోకి వచ్చాయి. రోమ్ సరిహద్దులు ఇప్పుడు ఓ ప్రబల రాజ్యానికి చేరువగా వచ్చాయి. అయితే ఆ సరిహద్దులు ఇప్పుడు నేల మీద లేవు. సాగరలలో ఉన్నాయి. రోమ్ కి దక్షిణ దిక్కున ఒక ప్రాచీన సామ్రాజ్యం ఉంది. దాని పేరు కార్తేజ్ (Carthage). దాని రాజధాని పేరు కూడా కార్తేజే. ఆ నగరం రోమ్ కి ముందే క్రీ.పూ. 814 లో స్థాపించబడింది. ఆ నగరం ఆఫ్రికా ఉత్తర తీరరేఖ వద్ద, ఆధునిక టునీశియా ప్రాంతంలో వుంది. దాని వైభవానికి చిహ్నంగా ఆ నగరానికి ‘మధ్యధరా సముద్ర చూడామణి’ అని పేరొచ్చింది.

క్రీపూ మూడవ శతబ్దంలో కార్తేజ్ మధ్యధరా సముద్ర ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం.  ఇటాలియన్ ద్వీకల్పపు పశ్చింమాన ఉండే సార్డీనియా ద్వీపం (ఇది మధ్యధరా సముద్రంలో అతి పెద్ద దీవి), దక్షిణ-పశ్చిమాన ఉన్న సిసిలీ దీవి, ఆఫ్రికా ఖండపు ఉత్తర సీమలు, స్పెయిన్ లో అధిక భాగం కార్తేజ్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. ఈ సామ్రాజ్యవాసులని కార్తజీనియన్లు అని, లేదా ప్యూనిక్ లు అని కూడా అంటారు. ప్రాచీన ఫోనీషియన్లు అనే గొప్ప నాగరిక జాతిలో వీరు ఒక శాఖ అని అంటారు.





మొదటి ప్యూనిక్ యుద్ధం
రోమ్ కన్ను ఇప్పుడు కార్తేజ్ మీద పడింది. కార్తేజ్ ముట్టడి కోసం వ్యూహాలు పన్నడం మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే ఓ పెద్ద సమస్య ఎదురయ్యింది. ఇంతవరకు రోమ్ పాల్గొన్న యుద్ధాలన్నీ నేల  మీద జరిగినవి. కాని కార్తేజ్ రాజ్యం సముద్రం మధ్యలో దీవుల మీద, సముద్రానికి ఆవలి తీరం మీద విస్తరించి వుంది. కార్తేజ్ ని చేరాలంటే రోమ్ కి నౌకాదళం కావాలి. నౌకలతో సముద్రాల మీద యుద్ధం రోమ్ కి తెలియని వ్యవహారం.  కార్తేజ్ కి అప్పటికే శక్తివంతమైన నౌకాదళం గల రాజ్యంగా మంచి పేరుంది.

ఇలా ఉండగా రోమ్ అదృష్టం కొద్దీ కార్తేజ్ కి చెందిన ఒక యుద్ధనౌక ఇటాలియన్ తీరం వద్దకి కొట్టుకొచ్చింది. నౌక తుఫానులో చిక్కుకున్న సమయంలో దాని సిబ్బంది దాన్ని వదిలిపోయారు. చేతికి చిక్కిన నౌక రూపురేఖలన్నీ రోమన్ ఇంజినీర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనతికాలంలోనే అలాంటి నౌకలని వందల కొద్దీ నిర్మించి యుద్ధానికి సిద్ధం అయ్యారు.

(ఇంకా వుంది)


రోమ్ కి మొదటి తాత్కాలిక నియంత - సిన్సినాటస్




రోమన్ సెనేట్ ఒక సామ్రాట్టుని, ఒక నియంత ని (dictator) ఎన్నుకోవడానికి సిద్ధమయ్యింది. నిస్వార్థ సేవాతత్పరుడు అని పేరు పొందిన సిన్సినాటస్ ని ఆరు నెలల పాటు నియంతగా పని చెయ్యమని ఎన్నుకున్నారు. దేశాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితులనుండి బయటికి ఈడ్చి, గండం గట్టెక్కించడం అతడు సాధించవలసిన కార్యం.

సిన్సినాటస్ వెంటనే కార్యాచరణలోకి దిగాడు. అంతో ఇంతో ఆరోగ్యం గల ప్రతీ రోమన్ యువకుణ్ణి రోజు తిరిగేలోగా సైనిక దళంలో చేరమని ఆజ్ఞ జారీ చేశాడు. మర్నాడే తన యువసేనతో ఎక్వీ సైన్యాన్ని రెండు పక్కల నుండి ఒకే సమయంలో ముట్టడించాడు. శత్రు సేనలని ఊచకోత కోయకుండా వారికి రెండు పక్కలా శూలాల వంటి రాటలతో తాత్కాలిక ప్రహరీ గోడ వంటిది నిర్మించి ఆ గోడల వద్ద శత్రు సేనని నిర్బంధించాడు. ఇక విముక్తి మార్గం కనిపించక శత్రువులు లొంగిపోయారు. ముఖ్యమైన సేనానులని మాత్రం పట్టి ఉరి తీయించి, సిపాయిలని మాత్రం వదిలిపెట్టాడు.
నాగలి వదిలి రోమ్ పగ్గాలు అందుకోడానికి సిద్ధమవుతున్న సిన్సినాటస్ (1806 నాటి తైలవర్ణ చిత్రం, చిత్రకారుడు యువాన్ ఆంటోనియో రిబేరా)

ఆ విధంగా రోమ్ కి పట్టిన గండాన్ని పదిహేను రోజుల్లోపే తొలగించాడు సిన్సినాటస్.  పదవీ వ్యామోహం కొద్దీ తన సింహాసనానికి అంటిపెట్టుకు కూర్చోకుండా వెంటనే పదవీ విరమణ చేసి, మళ్లీ తన పల్లెకి తరలి ఎప్పట్లాగే సేద్యం చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. పేరుకి నియంత అయినా దేశానికి సేవకుడిలాగే నడచుకున్నాడు. శౌర్యం, క్రమశిక్షణ, ఆత్మసమర్పణ అనే రోమన్ సైనిక విలువలకి నిదర్శనంగా నిలిచి రోమన్ చరిత్రలో చరిత్రలో చిరకీర్తిని సాధించాడు.

 (మొదటి అధ్యాయం సమాప్తం)