యూరప్ లో ఓ మారుమూల సారయేవో నగరంలో జరిగిన గొడవ అలా ప్రపంచం అంతటా ఎందుకు వ్యాపించింది?
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే అసలు 20 వ శతాబ్దపు తొలిదశలలో యూరప్ లోని రాజకీయ పరిస్థితుల గురించి విపులంగా చెప్పుకోవాలి. అంటే అప్పటికి కనీసం నాలుగు దశాబ్దాలు వెనక్కు వెళ్లి కథ మొదలెట్టాలి.
యూరొపియన్ రాజ్యాల మధ్య కొన్ని సహస్రాబ్దాల కలహపురాణం వుందన్నది వాస్తవం. కాని ప్రత్యేకంగా మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిన కారణాల గురించి చెప్పుకోవాలంటే, కొన్ని దశాబ్దాల క్రితమే జరిగిన ఓ యుద్ధం గురించి చారిత్రకులు ప్రస్తావిస్తూ ఉంటారు. 1870/1871 కాలంలో ఫ్రాన్స్ కి ప్రష్యా కి మధ్య ఓ యుద్ధం జరిగింది. (ఈ
ప్రష్యా ఆధునిక జర్మనీ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక రాజ్యం.) ఆ యుద్ధంలో ఫ్ర్రాన్స్ చిత్తుగా ఓడిపోయింది. ఆ యుద్ధంతో బలం పుంజుకున్న ప్రష్యా దాని పొరుగు ప్రాంతాలైన బవారియా, సాక్సనీ, వూర్టెంబర్గ్ లతో కలిసి విశాల జర్మనీ సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది. యుద్ధంలో ప్రష్యా ఫ్రాన్స్ నుండి కొల్లగొట్టిన రెండు ఫ్రెంచ్ ప్రాంతాలని (ఆల్సేస్, లొరేన్ లు) ఈ
కొత్త జర్మన్ సామ్రాజ్యంలో కలిపేసుకుంది. ఈ రాజకీయ మార్పులలో యూరప్ లో కొత్తగా ఏర్పడ్డ జర్మన్ సామ్రాజ్యం ఓ గణనీయమైన బలంగా ఆవిర్భవించింది.
అప్పటి నుండి ఓ ఇరవై ఏళ్లు యూరప్ లో రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఫ్రాన్స్ పరిస్థితి ఎప్పట్లాగే వుంది. అదను చూసి జర్మనీ మీద దెబ్బ తీసి తనకి చెందిన భూభాగాన్ని ఎలాగైనా వెనక్కు తెచ్చుకోవాలని ఫ్రెంచ్ వారికి
మనసులో బలంగా వుంది. ఇలా వుండగా 1890 లో జర్మనీని ఏలిన ఛాన్సెలర్ ఆటో ఫాన్ బిస్మార్క్ గద్దె దిగిపోయాడు. తను ఏలినంత కాలం చాకచక్యంగా రాజకీయం చేసి ఇరుగు పొరుగు రాజ్యాలతో పొత్తులు పెట్టుకుని ఫ్రెంచ్ వారిని మాత్రం పైకి రాకుండా అణిచి పెట్టి వుంచాడు ఫాన్ బిస్మార్క్. అతడు నిష్క్రమించిన తరువాత రాజకీయ పరిస్థితిలో మార్పులు తలెత్తాయి. తూర్పులో ప్రబల రాజ్యమైన రష్యాకి, జర్మనీకి మధ్య సంబంధాలలో బీటలు కనిపించాయి. ఇదే అదను అనుకుని ఫ్రెంచ్ వారు కాస్త రాజకీయం చేసి రష్యాతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. రష్యాకి, ఫ్రాన్స్ కి మధ్య బలపడుతున్న స్నేహం చూసి బెంబేలు పడ్డ జర్మనీ ఇక గత్యంతరం లేక ఆ ప్రాంతంలో మరో ప్రధాన శక్తి అయిన ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యంతో పొత్తు కలుపుకుంది.
ఒక పక్క యూరప్ ఖండంలో పరిణామాలు ఇలా ఉండగా, ఖండానికి బయట ద్వీప రాజ్యమైన బ్రిటన్ పరిస్థితి వేరుగా వుంది. భౌగోళికంగా తక్కిన యూరొపియన్ రాజ్యాల నుండి కాస్త వేరుగా, దీవి మీద జీవించడం వల్ల బ్రిటిష్ వారి పరిస్థితి మరింత సురక్షితంగా, సౌకర్యంగా ఉండేది. యూరొపియన్ గొడవలలో మరీ అవసరమైతే తప్ప జోక్యం చేసుకోకుండా వుండాలనే విధానాన్ని బ్రిటన్ అనుసరించేది. జోక్యం చేసుకోకపోయినా యూరప్ లో వస్తున్న రాజకీయ పరిణామాలు బ్రిటన్ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే వుంది. బ్రిటన్ యొక్క ప్రత్యేక శక్తి దాని నౌకాదళంలో వుంది. ఆ
నౌకాదళ సత్తాని వెనకేసుకునే బ్రిటన్ ప్రపంచం నలుమూలలకి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంది.
యూరొపియన్ రాజ్యాలలో, నౌకాదళ బలంలో బ్రిటన్ కి సాటి రాగల రాజ్యాలు
ఎంతో కాలంగా రెండే వుండేవి – అవి ఫ్రాన్స్, రష్యాలు. కనుక 1889లో బ్రిటన్ లో నౌకా విభాగం ఓ విధానాన్ని అవలంబించింది. ప్రపంచంలో ఏ రెండు రాజ్యాల/దేశాల సమిష్టి నౌకాదళ బలాల కన్నా కూడా బ్రిటిష్ నౌకాదళ బలం ఎప్పుడూ మిన్నగా ఉండాలి. ఈ విధానాన్ని ‘రెండు బలాల ప్రమాణం’ (Two power standard) అంటారు. ఈ ప్రమాణం బట్టి సముద్రం మీద బ్రిటన్ ని ఎదిరించే దేశం ఈ ప్రపంచంలో ఉండకూడదన్నమాట!
అంతే కాదు ఏ రెండు దేశాలు పొత్తు కలిపినా నౌకాదళంలో వారి సమిష్టి బలం కూడా బ్రిటిష్ బలాన్ని మించరాదన్నమాట!
అయితే సముద్రాల మీద బ్రిటన్ అధిపత్యం ఎంతో కాలం సాగలేదు. దానికి కారణం జర్మనీలో వేగంగా వస్తున్న పరిణామాలు. 1888లో కైసర్ విల్హెల్మ్ – II జర్మనీలో
సింహాసనం ఎక్కాడు. (కైసర్ అనేది ఒక సామ్రాట్టుగా తనకి గుర్తింపు నిచ్చే బిరుదు లాంటిది. ఈ పదం లాటిన్ పదమైన ‘సీజర్’ నుండి వచ్చింది. రోమన్ సామ్రాజ్యాన్నేలిన చక్రవర్తులలో సీజర్ వంశీయులు ముఖ్యులు. జర్మన్ రాజులకి, సీజర్ వంశానికి అసలు సంబంధం లేదు. కాని రోమన్ చక్రవర్తులతో పోల్చుకోవడం యూరప్ ఓ ప్రతిష్ఠాత్మక విషయంగా చలామణి అయ్యేది. జర్మన్ భాషలో ఆ సీజర్ కాస్తా కైసర్ గా మారింది. ఈ సీజర్ జాఢ్యం రష్యాకి కూడా పాకింది. అందుకే రష్యన్ రాజులని ట్సార్ లు అంటారు. ఈ ట్సార్ అనే పదం కూడా సీజర్ నుండి వచ్చిందే.) ఈ విల్హెల్మ్ – II లో
కాస్త బ్రిటిష్ రక్తం కూడా వుంది. ఎందుకంటే ఇతడి తండ్రి ఫ్రెడెరిక్ బ్రిటన్ కి రాణి అయిన విక్టోరియాకి స్వయానా అల్లుడు. యూరొపియన్ రాజ్యాలకి చెందిన రాచకుటుంబాల మధ్య వివాహాల ద్వార సంబంధాలు కలుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ విధంగా అయినా శత్రుత్వాలు శమించి శాంతి నెలకొంటుందని ఆశ. కాని ఈ కొత్త రాజు విల్హెల్మ్-II బ్రిటన్
ని ఓ స్నేహ రాజ్యం గా ఎప్పుడూ చూడలేదు. ఈ కొత్త రాజు పోటీ పడదలచుకున్నది కేవలం బ్రిటన్ తోనే కాదు, యావత్ ప్రపంచంతో. మొత్తం ప్రపంచంలోనే జర్మన్ సామ్రాజ్యం ఓ అసమాన శక్తిగా ఎదగాలని ఇతడి ఆకాంక్ష.
ప్రపంచం నలుమూలలకి ఉన్న చోటి నుండి బాగా దూరంగా ఓ రాజ్యం శక్తిని ప్రసరింపజేయాలంటే అది నౌకాదళ బలం వల్లనే అవుతుంది. ఆ విషయం బాగా గ్రహించిన విల్హెల్మ్ – II, జర్మన్ నౌకాదళ బలగాలని గణనీయంగా బలపరిచే ప్రయత్నంలో పడ్డాడు. ఆ విధంగా జర్మనీ కి, బ్రిటన్ కి మధ్య నౌకా దళాల వృద్ధిలో ఉధృతమైన పోటీ మొదలయ్యింది. రాబోయే ఇరవై ఏళ్లలో 38 యుద్ధనౌకలు నిర్మించాలని జర్మనీ ప్రకటించింది. 1900
-1905 కాలంలో క్రమంగా జర్మనీకి చెందిన యుద్ధనౌకల సంఖ్య పెరగసాగింది. జర్మనీ ఇస్తున్న పోటీకి స్పందించి బ్రిటన్ యుద్ధనౌకల నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన సాంకేతిక విప్లవాలు తెచ్చింది. ఆ ప్రయత్నాలకి పర్యవసానంగా సముద్ర వీరుల గుండెల్లో గుబులు పుట్టించగల హెచ్.ఎమ్.ఎస్. డ్రెడ్ నాట్ (HMS
Dreadnought) అనే
యుద్ధ నౌక ఆవిర్భవించింది. ఆవిరి యంత్రాల మీద పని చేసే ఆ యుద్ధనౌక ఆ రోజుల్లో యావత్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన నౌక అనిపించుకుంది. ఆ
రోజుల్లో బ్రిటన్ లో డ్రెడ్ నాట్ నౌక ఎంత కుతూహలం కలిగించిందంటే, అక్కడి స్కూలు పిల్లలు కూడా ఆ నౌక లక్షణాల గురించి, దాని వేగం, అందులోని శతఘ్నుల సంఖ్య మొదలైన వివరాల గురించి సరదాగా ముచ్చటించుకునేవాళ్లట.
బ్రిటన్ రూపొందించిన హెచ్.ఎమ్.ఎస్. డ్రెడ్ నాట్ నౌక
యూరప్ లోని అగ్రరాజ్యాలు ఇలా ఉధృతంగా బలగాలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్న పరిస్థితిలో ఇక యుద్ధం జరుగుతుందా జరగదా అన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఎప్పుడు జరుగుతుంది, ఎవరి మధ్య జరుగుతుంది అన్నదే ప్రశ్న. అంతమంది బలవంతులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తక్కిన అందరి మీదా విజయం సాధించగలిగేలా యుద్ధప్రయత్నాలు చేసుకోవడం అనవసరం, అసాధ్యం కూడా. ఆ బలాలలో ఎవరు మిత్రులో, నమ్మదగ్గవారో, ఎవరు శత్రువులో, నమ్మకానికి అనర్హులో తెలుసుకుని, తగిన వారితో పొత్తులు కుదుర్చుకుంటే సరిపోతుంది. అంతకి మించి పెద్దగా చెయ్యగలిగేది కూడా ఏమీ లేదు. ఆ కారణం చేత యూరప్ లో అగ్రరాజ్యాలు రెండు కూటములుగా ఏర్పడ్డాయి. వాటిలో బ్రిటన్-ఫ్రాన్స్-రష్యాలు ఒక కూటమి. ముగ్గురూ
విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని ఒక అనధికార ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే Triple Entente (మూడు రాజ్యాల మధ్య అనధికార ఒప్పందం) అంటారు. అలాగే జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యాలు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని ‘కేంద్ర బలాలు’ (Central Powers) అంటారు.
తీరా యుద్ధం మొదలయ్యాక మరిన్ని రాజ్యాలు ఈ రెండు కూటములతోను జట్టు కట్టాయి. ఆ సంగతి ముందు ముందు చూద్దాం.
యుద్ధం అంటూ మొదలైతే ఎవరెవరు ఎలా వ్యవహరించాలో అన్నీ ముందే విస్తారంగా పధకాలు వేసుకున్నారు. సంక్లిష్టమైన సేనా వ్యూహాలు రచించి రహస్యంగా దాచుకున్నారు. అంతా రేపో మాపో యుద్ధం మొదలౌతుంది అన్నట్టుగానే వ్యవహరించడం మొదలెట్టారు. డిసెంబర్ 8, 1912 నాడు, జర్మనీకి చెందిన కైసర్ విల్హెల్మ్ – II ఓ
యుద్ధ సదస్సుని నిర్వహించడం అలాంటి సన్నాహానికి చిహ్నం. ఆ సదస్సుకి వివిధ సైనిక సలహాదారులని, సేనాపతులని ఆహ్వానించి యుద్ధ వ్యూహాల గురించి విపులంగా చర్చించాడు.
ఆ విధంగా యూరప్ కి చెందిన అగ్రరాజ్యాలన్నీ పోరుకి సన్నాహాలు చేసుకున్నాయి.
ఆస్ట్రియా-హంగరీ యువరాజు హత్యతో ఎగసిన నిప్పు రవ్వ, కార్చిచ్చులా యూరప్ ఖండం అంతా వ్యాపించింది. ఆ మంటలు ఎంత దూరం వ్యాపించాయంటే పశ్చిమ కొసన అమెరికా నుండి, తూర్పు కొసన జపాన్ దాకా దారుణ రణ జ్వాలల తాపానికి గురికాక తప్పలేదు.
(ఇంకా
వుంది)
No comments:
Post a Comment