ఇలా ఉండగా రోమ్ కి ఉత్తర సరిహద్దుల వద్ద హఠాత్తుగా ఓ కొత్త సమస్య వచ్చిపడింది.
కింబ్రీ, టాయ్టోన్ తెగలు రోమ్ ఉత్తర సరిహద్దుల మీద దాడి చేశాయి. ఈ సారి కేటలస్ అనే
కాన్సల్ సర్వసైన్యాధ్యక్షుడిగా సేనలని అదిలించాడు. ఆ యుద్ధంలో కూడా సల్లా పాల్గొని
ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి కూడా రోమ్ జయించింది.
ఈ సైనిక విజయపరంపరతో ఆత్మవిశ్వాసం పెరిగిన సల్లా రాజకీయంగా మరింత ఎత్తుకు వెళ్లాలని
అనుకున్నాడు. రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత
పదవి కాన్సల్ అయితే, దానికి ఒక మెట్టు కిందుగా ప్రేటర్ అనే ప్రధాన న్యాయవాది పదవి ఒకటి
ఉంది. తన సైనిక విజయాల గురించి ముమ్మరంగా ప్రచారం చేసి, సల్లా ఆ ప్రేటర్ పదవికి ఎన్నిక
అయ్యాడు.
పెరుగుతున్న సల్లా పరపతి చూసి మారియస్ కి కన్నుకుట్టింది. సల్లాని సకాలంలో అదుపు
చెయ్యకపోతే రోమ్ కే ముప్పు అని మారియస్ గుర్తించాడు. ఇద్దరి చుట్టూ ఎంతో మంది అనుయాయులు
చేరారు. ఇరు వర్గాల చుట్టూ అడపా దపా ఘర్షణ జరిగేది.
మారియస్ తో కలహాన్ని ఓ కొత్త ఎత్తుకు తీసుకువెళ్లాలని సంకల్పించాడు సల్లా.
అప్పుడే రోమన్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ దుడుకు చర్యకి ఒడిగట్టాడు సల్లా. తన కింద ఉన్న సైన్యాన్ని, కంచే చేను మేసిందనే నానుడిని
తలపించేలా, రోమ్ నగరం మీదకి ఉసికొల్పాడు. సైనిక బలంతో నగరాన్ని, సెనేట్ ని ఆక్రమిస్తే
ఇక తన అధికారాన్ని ధిక్కరించేవారు ఉండరు. ఆ దాడిని మారియస్ బలగం అడ్డుకోవాలని చూసింది
కాని విఫలమయ్యింది. మారియస్ రోమ్ నుండి పారిపోయి
ప్రాణాలు కాపాడుకున్నాడు.
సల్లా, మారియస్ మధ్య నడిచిన చిరకాల శత్రుత్వానికి క్రీ.పూ. 84 లో మారియస్ మరణంతో
తెరపడింది. ఇక తనకి ఎదురులేదని గుర్తించిన
సల్లా క్రీ.పూ. 83 లో రోమ్ మీద మరొక్కసారి దండయాత్ర ప్రకటించాడు. సెనేట్ సభ్యులు, తదితర
ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొరొక్కరే తనకి దాసోహం అన్నారు. కాదన్న వారి ప్రాణాలు తీశాడు.
సెనేట్ నిండా తన పక్షం వారినే స్థాపించాడు. తన కిరాతకాలు మరింత వికృత రూపాలు కూడా దాల్చాయి.
తనకి వ్యతిరేకంగా మొత్తం సామ్రాజ్యంలో ఎవరైనా మాట్లాడారని తెలిస్తే, వారిని సమాజ శత్రువులుగా
ముద్రవేయించేవాడు. వాడి తల తీసి తెస్తే పెద్ద బహుమానం ఉంటుందని ప్రకటించాడు. పౌరులకి
భయం పుట్టేలా క్షతగాత్రుల తలలని రోమ్ పురవీధుల్లో బహిరంగంగా వేలాడ దీయించేవాడు.
ఇలా క్రమంగా, అక్రమంగా సర్వాధికారాలు
తన గుప్పెట్లో పెట్టుకుని నియంతలా ప్రవర్తించాడు సల్లా. రోమన్ రాజ్యాంగంలో అత్యవసర
పరిస్థితుల్లో నియంతని ఎన్నుకునే వీలు ఉంది. (లోగడ సిన్సినాటీని ఎన్నుకున్న ఘట్టం గురించి
చెప్పుకున్నాం). కాని ఆ పదవి కేవలం ఆరునెలలకే
వర్తిస్తుంది. ఆ తరువాత అతడు గద్దె దిగి, మునుపటి గణతంత్ర యంత్రాంగానికి చోటివ్వాలి. కాని ఈ సారి సల్లా రోమన్ సామ్రాజ్యానికి నిరవధికంగా
తానే నియంతగా, సర్వసామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు.
రాజులకి సర్వాధికారాలు ఇస్తే పాలన ఎంత కిరాతకంగా ఉంటుందో ఏనాడో చవిచూసిన రోమన్
పౌరులు రాచరికానికి స్వస్తి చెప్పి, గణతంత్రాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని శతాబ్దాల
తరువాత వెనకటి పీడ మళ్లీ వాళ్ల తలకి చుట్టుకుంది. అధికార మదంతో విర్రవీగే ఓ దుష్టుడు
ఇప్పుడు వారి నెత్తిన కూర్చున్నాడు.
సల్లా ప్రభావం వల్ల రోమన్ పాలక వ్యవస్థ క్రమంగా గణతంత్రం నుండి నియంతృత్వం దిశగా
మళ్లింది. రోమన్ చారిత్రక పరిణామ పథంలో ఆ మలుపు
శాశ్వతంగా నిలిచిపోతుంది. అయితే నియంతలంతా
దుష్టులు కానక్కర్లేదు. ప్రజలంటే సహజమైన అభిమానం కలిగి, పాలనా వ్యవహారాలలో దక్షుడై,
సైనిక వ్యవహారాలలో అసమానశూరుడైన చక్రవర్తి రాజ్యం చేస్తే, ప్రజలు సుఖసంతోషాలతో జీవించే
అవకాశం లేకపోలేదు. అలాంటి చక్రవర్తుల పరంపర ఒకటి ఇప్పటి నుండి ఒకటి రెండు శతాబ్దాల
పాటు రోమన్ సామ్రాజ్యాన్ని పాలించనుంది. వారి
ఏలికలో రోమన్ సామ్రాజ్యం అసలు చరిత్రలోనే అసమానమైన, అపూర్వమైన ఉన్నతిని చేరుకుంటుంది.
అలాంటి చక్రవర్తులలో ప్రథముడు, రోమన్ చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందినవాడు, ఆ తరువాత
రెండు సహస్రాబ్దాల పాటు రాజులకి, రాజవంశాలకి స్ఫూర్తిగా నిలిచినవాడు ఒకడు ఉన్నాడు.
అతడి పేరు జూలియస్ సీజర్.
No comments:
Post a Comment