జోసెఫ్ బజాల్గెట్
లండన్ లో సూయేజి సమస్యని పరిష్కరించడమే తన జీవనధ్యేయం అన్నట్టుగా జోసెఫ్ బజాల్గెట్ పని లోకి దిగాడు. అతడి బృందం ఓ బృహత్తరమైన సూయేజి వ్యవస్థని నిర్మించింది. ఆ రోజుల్లో మొత్తం ప్రపంచంలోనే అదొక ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకుంటారు. 4.3 మిలియన్ పౌండ్ల ఖర్చుతో నిర్మించబడ్డ ఆ సూయేజి వ్యవస్థ ఆ కాలంతో అత్యంత ఖరీదైన ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ అన్న పేరు తెచ్చుకుంది. లండన్ సూయేజి వ్యవస్థలో మొత్తం 318 మిలియన్ల ఇటుకలు వాడారట. 2.5 మిలియన్ ఘనపు మీటర్ల మట్టిని తవ్వి తీశారట. 650,000
ఘనమీటర్ల కాంక్రీట్ వాడారట. బజాల్గెట్ నిర్మించిన సూయేజి వ్యవస్థలో
మొత్తం 100 మైళ్ల పొడవు ఉన్న పెద్ద కాలువలు (intercepting sewers) ఉన్నాయి. ఇవి థేమ్స్ నదికి ఇంచుమించు సమాంతరంగా నడుస్తాయి. 450 మైళ్లు పొడవున్న ప్రధాన కాలువలు ఉన్నాయి. ఇవి గాక రోడ్ల వెంబడి సాగే, మొత్తం 13,000
మైళ్ల పొడవున్న చిన్న సూయేజి కాలువలు కూడా ఉన్నాయి. 1859 లో మొదలైన ఈ మెగా ప్రాజెక్ట్ 1868 కల్లా అధికశాతం పూర్తయ్యింది. ఇంచుమించు అదే కాలంలో లండన్ లో మెట్రో రైలు వ్యవస్థ కూడా రూపుదిద్దుకోవడంతో ఎదురుచూడని సాంకేతిక సమస్యలు ఊడిపడ్డాయి. సూయేజి వ్యవస్థ లాగానే, మెట్రో మార్గాలు కూడా భూగర్భం లోంచి విస్తరించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ బృహత్ యత్నంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా బజాల్గెట్ దాన్ని తన భుజాల మీద వేసుకుని ప్రాజెక్ట్ ని విజయవంతంగా పూర్తిచేశాడు.
గురుత్వ ప్రభావం వ్యర్థాలన్నీ తూర్పు దిశలో ప్రవహిస్తాయి. అయితే చెల్సీ, డెప్ట్ ఫోర్డ్, అబ్బీ బిల్స్ మొదలైన చోట్ల ఎత్తు సరిపోక, వ్యర్థాల ఎత్తు పెంచడం కోసం పంపింగ్ కేంద్రాలు నిర్మించారు. థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న వ్యర్థ పదార్థం అంతా Northern Outfall Sewer లో చేరుకుంటుంది. అక్కడ బెక్టన్ అనే ప్రాంతంలో ఆ పదార్థం అంతా ఓ sewage treatment plant లో శుద్ధి చెయ్యబడుతుంది. అలాగే థేమ్స్ కి దక్షిణాన వ్యర్థాలన్నీ Southern Outfall Sewer లో చేరి అక్కడ మరో treatment plant లో శుద్ధి చెయ్యబడతాయి.
Crossness అనే ప్రాంతంలో ఉన్న sewage
treatment plant
ఆధునిక లండన్ లో సూయేజి వ్యవస్థ
అంత దూరదృష్టితో నిర్మించబడ్డ వ్యవస్థ కనుకనే అది ఇప్పటికీ లండన్ నగర అవసరాలని అద్భుతంగా తీర్చగలుగుతోంది. కాని తుఫాను సమయంలో, వర్షాపాతం ఎక్కువై థేమ్స్ పొంగినప్పుడు సూయేజి వ్యవస్థ మీద భారం ఎక్కువై అంత విస్తృతమైన వ్యవస్థ కూడా తట్టుకోలేక విఫలమవుతుంది. అలాంటి సమయంలో సూయేజిని నిర్వహించే ‘Thames Water’ కంపెనీకి గొప్ప సవాళ్లే ఎదురవుతాయి.
ఉదాహరణకి 2004 ఆగస్టు నెలలో లండన్ లో విపరీతంగా వర్షాలు పడినప్పుడు అదే జరిగింది. ఆ సమయంలో
600,000 టన్నుల సూయేజి పదార్థాన్ని విధిలేక థేమ్స్ నదిలోకి మళ్లించవలసి వచ్చింది. లేకుంటే లండన్ రోడ్లన్నీ సూయేజి మయమై ఉండేవి.
ఆ సందర్భంలో లండన్ సూయేజి వ్యవస్థని సందర్శించిన ఓ బీబీసి రిపోర్టర్ అక్కడి పరిస్థితులని వర్ణిస్తూ ఓ వ్యాసం రాసింది.
Thames Water కి పని చేసే రాబ్ స్మిత్ అనే ఇంజినీరు
బృందంతో పాటు ఆ బీబీసి రిపోర్టర్ సూయేజి సొరంగాల తనిఖీలో పాల్గొంది. మెట్రో రైలు సొరంగాల అంత పెద్దవైన ఆ కాలువలలో మనుషులు సునాయాసంగా నడవొచ్చు.
సూయేజి ఇంజినీర్ల తో పాటు సూయేజి సొరంగంలో
నడుస్తున్న బీబీసి రిపోర్టర్
మామూలుగా అయితే వ్యర్థాల ప్రవాహంతో సొరంగం ఇంచుమించి నిండిపోయి వుంటుంది. ఇంజినీర్ల బృందం తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో వ్యర్థాలని దారి మళ్లిస్తారు. కాబట్టి ఆ సమయంలో సొరంగంలో ఆ ప్రాంతంలో మాత్రం నీటి మట్టం తక్కువగా ఉంటుంది.
సొరంగాలలో ఒక పెద్ద సమస్య గోడల మీద గట్టిపడి పేరుకున్న కొవ్వు పదార్థం. సామాన్యంగా సూయేజి లోకి మనకి అక్కర్లేని నానా రకాల పదార్థాలని పారబోసి చేతులు కడిగేసుకుంటాం. లోపల దాని గతి ఏమవుతుందని, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని ఆలోచించం. కొవ్వు పదార్థం గోడల మీద అట్టలు కట్టడం వల్ల సొరంగం వ్యాసం తగ్గే ప్రమాదం వుంది. ఒకసారి అదే జరిగితే 150 అడుగుల మందం గల గట్టిపడ్డ కొవ్వు పదార్థాన్ని గడ్డపారలతో తవ్వి తొలగించవలసి వచ్చిందట. అదంతా చెయ్యడానికి ఎనిమిది వారాలు పట్టిందట.
అలాగే మరో సందర్భంలో సూయేజి కాలువలో ఓ గ్రెనేడు దొరికిందని, దాన్ని వదిలించుకోడానికి గగనమయ్యిందని అంటాడు ఇంజినీరు రాబ్ స్మిత్. కొన్ని సార్లు కళేబరాల భాగాలు దొరుకుతాయని
వాటిని విశ్లేషించమని పోలీసుల నుండి విన్నపాలు వస్తుంటాయని కూడా అంటాడు ఆ ఇంజినీరు.
సూయేజిలో అలా కొట్టుకొచ్చే చిత్రవిచిత్రమైన
వస్తువులన్నిటినీ తొలగించి ఆ వ్యర్ధ ద్రవాన్ని treatment plant లలో శుద్ధి చేసి, మంచి
నీటిగా మార్చడమో, లేక థేమ్స్ నదిలో కలపడమో చేస్తారు. ఇంత అధునాతమైన సూయేజి వ్యవస్థని
నిర్వహించడానికి గొప్ప సాంకేతిక నైపుణ్యం అవసరమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి
సమర్థవంతమైన వ్యవస్థ ఉంది గనుకనే లండన్ వంటి అధిక జనసమ్మర్దం తో కూడిన ప్రపంచ నగరం
అంత శుభ్రంగా, సుందరంగా వర్ధిల్లుతోంది.
ఉపసంహారం
స్వచ్చ్ భారత్ మిషన్ వల్లనైతేనేమి, మరే ఇతర
కారణం చేత నైతేనేమి మన దేశంలో పరిశుభ్రత అనేది ఇటీవలి కాలంలో ప్రత్యేకమైన చర్చాంశం
అయ్యింది. ఎన్నో ప్రపంచ నగరాల్లో ఈ రోజుల్లో గొప్ప సౌందర్యంతో కూడుకున్న పరిసరాలు మనకి
దర్శనమిస్తాయి. కాని అలాంటి భాగ్యానికి నోచుకున్న నగరాలు మన దేశంలో బహు తక్కువ. నేడు
అతి సుందర నగరాలుగా పేరొందిన ప్రపంచ నగరాలు కూడా ఒకప్పుడు ఎంతో మురికిగా ఉండేవని, అయితే
కొందరు వ్యక్తుల దూరదృష్టి వల్ల, సృజనాత్మక కృషి వల్ల పరిస్థితులు మారాయని తెలిసినప్పుడు
మన నగరాలకి విమోచనామార్గం ఏ దిశలో వుందో స్పష్టమవుతుంది.
References:
https://en.wikipedia.org/wiki/London_sewerage_system
https://en.wikipedia.org/wiki/Joseph_Bazalgette
శ్రీనివాస్ గారు, లండన్ మహానగర సూఏజ్ వ్యవస్త నిర్మాణం గురించి చాలా చక్కగా రాశారు. ఇటువంటివే బ్రిటెన్ మరియు యూరోప్'లో ఇతర టెక్నాలజీ పరిణామాలను చూపించే ఈ సీరీస్'ను చూశారా?
ReplyDeleteIndustrial Revelations - Series -1
https://www.amazon.co.uk/Industrial-Revelations-Complete-1-DVD/dp/B000SKKCLE/ref=sr_1_1?dchild=1&keywords=Industrial+Revelations+dvd&qid=1598190766&sr=8-1
More Industrial Revelations
https://www.amazon.co.uk/More-Industrial-Revelations-Europe-DVD/dp/B004JESO1U/ref=rtpb_1/258-2624333-3695167?_encoding=UTF8&pd_rd_i=B004JESO1U&pd_rd_r=c00528f1-117c-425d-965e-71d9b6d259b8&pd_rd_w=LMtbo&pd_rd_wg=n3X5N&pf_rd_p=21393542-ca06-4f9b-b1e2-0c64b58b74e7&pf_rd_r=RXN1YY6VMX5YAYRQP6BY&psc=1&refRID=RXN1YY6VMX5YAYRQP6BY
- గోపాల్