బ్లాగర్లకి వినాయ
చవితి శుభాకాంక్షలు!
ఈ సందర్భంలో
‘రోమన్ సామ్రాజ్యం, రోమన్ సంస్కృతి’ అన్న అంశం మీద ఒక కొత్త ధారావాహిక మొదలుపెడుతున్నాను.
(ఈ కథ విన్నవారికి , కన్న వారికి, సిరి సంపదలు
కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సర్ప రాక్షస …. వగైరాలు అనను గాని, సహస్రాబ్దాల రోమన్ చరిత్ర గురించి చదువుతుంటే
గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుందని మాత్రం చెప్పగలను!)
ప్రాచీన రోమన్
సామ్రాజ్యం
రోమన్ సామ్రాజ్యం
చరిత్రలో అత్యంత శక్తివంతమైన, సువిస్తారమైన సామ్రాజ్యాలలో ఒకటి. ఆ సామ్రాజ్యానికి కేంద్రం
ఆధునిక ఇటలీలో ఉండేది. ఆధునిక రోమ్ నగరం దానికి రాజధానిగా ఉండేది. మధ్యధరా సముద్ర తీర
రాజ్యాలెన్నో రోమన్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. పశ్చిమ, కేంద్ర యూరప్, ఇంగ్లీష్
దీవులలో దక్షిణ భాగం, గల్ఫ్, ఉత్తర ఆఫ్రికాల వరకు కూడా దాని ప్రభావం విస్తరించింది.
పాశ్చాత్య నాగరికతకి ప్రాచీన మూలాలుగా రెండు సంస్కృతులు ఉన్నాయని చెప్పుకుంటారు. తత్వచింతన,
విజ్ఞాన రంగాల్లో ఆ మూలాలు గ్రీకు సంస్కృతిలో ఉన్నాయి. అలాగే సామ్రాజ్య స్థాపనలో,
నగర నిర్మాణంలో, సమర్థవంతమైన ప్రజాపాలనలో, గొప్ప క్రమబద్ధీకరణతో కూడిన సామాజిక వ్యవస్థల
నిర్వహణలో పాశ్చాత్య సంస్కృతికి మూలాలు రోమన్ సంస్కృతిలో ఉన్నాయి.
క్రీపూ
8 వ శతాబ్దంలో స్థాపించబడ్డ రోమన్ సామ్రాజ్యం క్రీశ. 100-200 ప్రాంతాల్లో మహర్దశకి
చేరుకుంది. తరువాత ఆ సామ్రాజ్యం విపరీతంగా విస్తరించడంతో క్రీశ 5 వ శతాబ్దంలో అప్పటికే బలహీనమైన రోమన్ సామ్రాజ్యం
తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. పశ్చిమ భాగం జర్మన్ జాతుల దాడికి లొంగి పతనమైపోయింది.
కాని తూర్పు భాగం మరో వెయ్యేళ్ళు వర్ధిల్లి
క్రీ.శ. 15 వ శతాబ్దంలో ఒటోమాన్ టర్కుల చేతిలో ఓడిపోయింది.
ఎలాంటి శక్తుల
చర్య వల్ల ఒక మహాసామ్రాజ్యం వృద్ధి చెందుతుంది,
వర్ధిల్లుతుంది, ఎలాంటి శక్తుల వల్ల బలహీనమవుతుంది, పతనమవుతుంది అన్నది అర్థం చేసుకోవాలంటే
రోమన్ చరిత్ర చదవాలి.
1776 లో రోమన్
చరిత్ర మీద సాధికార రచనగా చెప్పుకునే The History of the Decline and Fall
of the Roman Empire అనే పుస్తకం
(నిజానికి అదొక గ్రంథమాల) వెలువడింది. దాని రచయిత ఇంగ్లండ్ కి చెందిన ఎడ్వర్డ్ గిబన్.
విశేషం ఏమిటంటే
సైన్స్ ఫిక్షన్ రచయిత ఐసాక్ అసిమోవ్ మొత్తం పాలపుంత గెలాక్సీ అంతా విస్తరించిన విశాల
అంతరిక్ష సామ్రాజ్య స్థాపన గురించి, దాని వృధ్ధి, స్థితి, లయల గురించి Foundation అనే
నవలామాలికలో అద్భుతంగా వర్ణించాడు. ఆ నవలా మాలికకి స్ఫూర్తి రోమన్ చరిత్రేనని, ముఖ్యంగా
గిబన్ రాసిన చరిత్ర గ్రంథాలేనని అంటారు.
రోమన్ చరిత్ర
గురించి ఇప్పటి నుండి ధారావాహికగా కొన్ని పోస్టులలో చర్చించుకుందాం…
(ఇంకా వుంది)
మంచి ప్రయత్నం.
ReplyDelete