“రోమ్ కథ, ప్రపంచం కథ.” – నెపోలియన్
బోనాపార్టే
అది మూడు వేల ఏళ్ల క్రితం నాటి
కథ. అప్పటికి మధ్యధరా సముద్ర పరిసరాలలో ప్రబల నాగరికత గ్రీకు నాగరికత.
క్రీ.పూ. 3000 నుండి కూడా గ్రీకు
సంస్కృతి గురించి, అందులో వచ్చిన ఆటుపోట్ల
వివరాల గురించి చెప్పే అవిచ్ఛిన్న చరిత్ర వుంది.
క్రీ.పూ. 1600-క్రీ.పూ 1100 మధ్య కాలంలో గ్రీకు
ప్రాంతం ఓ గొప్ప నాగరికతకి ఆలవాలం అయ్యింది. మైసినే అనే ప్రాంతం కేంద్రంగా గల నాగరికత
గనుక దాన్ని మైసినేయన్ నాగరికత అంటారు. క్రీపూ 1100 దరిదాపుల్లో ఆ నాగరికత పతనం కావడంతో
గ్రీస్ లో చీకటి యుగం మొదలయ్యింది.
క్రీ.పూ. 800 దరిదాపుల్లో మళ్లీ గ్రీకు సంస్కృతి
ఆ చీకటి యుగం నుండి నెమ్మదిగా మేలుకోవడం మొదలుపెట్టింది. విద్య, కళా రంగాల్లో కొత్త
చిగుళ్లు చిగురించాయి. వాణిజ్యం పుంజుకుంది. వర్తకులు వ్యాపార అవకాశాల కోసం వెతుక్కుంటూ
పొరుగున ఉన్న ఏజియన్ సముద్రాన్ని దాటి ఇంకా దూరాలు ప్రయాణించారు. ఆ యాత్రలలో కొన్ని
వారిని మునుపు పెద్దగా తెలియని పశ్చిమ ప్రాంతాలకి తీసుకుపోయాయి.
అలా గ్రీకులు కనుక్కున్న కొత్త
ప్రాంతాల్లో ఇటలీ ద్వీపకల్పం (peninsula) ఒకటి.
మనిషి పాదం ఆకారంలో ఉండే ఆ ద్వీపకల్పం మీద గ్రీకులకి ఒక కొత్త జాతి తారసపడింది. సాంస్కృతిక
ఉన్నతిలో తమని మించిన వారు లేరని అనుకునే గ్రీకులకి అప్పటికే బాగా అధునాతనమైన సంస్కృతి
అక్కడ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడ వారికి కోట బురుజులు కనిపించాయి. ప్రహరీ
గోడలు ఉన్న నగరాలు కనిపించాయి. అక్కడి ప్రజలని పాలించే రాజులు కనిపించారు. ప్రజలకి
మంచి చెడ్డలు చెప్పే అర్చకులు కనిపించారు. గొప్ప సునిశితత్వంతో, సౌందర్యంతో వెలిగే
కళా విశేషాలు కనిపించాయి. కాంతులు చిమ్మే బంగరు ఆభరణాలని, ఇనుప పనిముట్లని అమ్మే గడసరి
వర్తకులు కనిపించారు.
ఇటలీలో టస్కనీ (Tuscany) ప్రాంతంలో
స్థిరపడ్డ ఈ కొత్త జాతిని ఎట్రస్కన్లు (Etruscans) అంటారు.
లోహ విజ్ఞానంలో ఎట్రస్కన్లు గొప్ప కౌశలాన్ని ప్రదర్శించారు.
విస్తృత సొరంగాల నిర్మాణంలో, భూగర్భ మందిరాల నిర్మాణంలో వాళ్లు వాడిన లోహం ఎంత ఎత్తున
ఉండేదంటే రెండున్నర వేల ఏళ్ల తరువాత ఇటాలియన్ నియంత ముస్సోలినీ (Mussolini) ఆ లోహపు
వస్తువులని తవ్వి పైకి తీయించి, కరిగించి, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయుధాల నిర్మాణంలో
వినియోగింపజేశాడు.
ఒక పక్క ఎట్రుస్కన్ రాజ్యం అలా
వర్ధిల్లుతుండగా ఇటలీ ద్వీపకల్పం లోనే మరో చోట మరో కొత్త రాజ్యం ఊపిరిపోసుకుంది. దానికి శంఖుస్థాపన
చేసినవాళ్లు ఇద్దరు అన్నదమ్ములు. కవలలు. వాళ్ల పేర్లు రోములస్, రేమస్. ఆ శంఖుస్థాపన
జరిగిన సంవత్సరం క్రీపూ 753 అని ఓ రోమన్ గాధ చెప్తుంది.
ఈ సోదరులు అసలు ఎవరు అన్న విషయం
మీద ఓ విచిత్రమైన కథ ప్రచారంలో వుంది. అవాస్తవికంగా,
అలౌకికంగా తోచే ఆ వృత్తాంతాన్ని ఒక చారిత్రక కథ కన్నా, ఒక పౌరాణిక గాధ అనుకోవాలేమో.
గొప్ప గొప్ప రాజవంశాలు వారి ఆరంభాలు అనుమానాస్పదంగా, అవమానాస్పదంగా ఉంటే, దాన్ని కప్పిపుచ్చుకోడానికి
ఏవేవో కథలు అల్లుతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే అనిపిస్తుంది.
ఆ ప్రాంతంలోనే కొన్ని తరాల క్రితం
నుమిటార్ అనే రాజు ఉండేవాడు. తమ్ముడు అమూలియస్ అన్నయ్య నుమిటార్ ఆక్రమించిన సింహాసనాన్ని కాజేసి, అన్నని రాజ్యం నుండి వెళ్లగొడతాడు.
అక్కడితో ఆగక అన్నకి పుట్టిన కొడుకుల్ని హత్య చేయిస్తాడు. నుమిటార్ కి ఓ కూతురు కూడా
వుంది. ఆమె పేరు రియా సిల్వియా. ఆడకూతుర్ని చంపకుండా ‘అవివాహిత పూజారిణి’గా (vestal
virgin) ఉండమని శాసిస్తాడు. అలాంటి వాళ్లు 6 ఏళ్ల నుండి 36 ఏళ్ల వరకు వెస్టా అనే దేవతకి
చెందిన ఆలయంలో పూజారిణులుగా ఊడిగం చెయ్యాలి. అలా పూజారిణిగా వున్న సిల్వియా మీద మార్స్ దేవత కన్నేస్తాడు.
మార్స్ దేవత కృపాకటాక్షాల వల్ల సిల్వియా ఇద్దరు కవలల్ని కంటుంది.
ఉగ్రుడైన అమూలియస్ రాజు భటుల్ని
పంపించి సిల్వియాని టైబర్ (Tiber) నదిలోకి విసిరేయమంటాడు. పసికందులు ఇద్దర్నీ ఓ బుట్టలో
పెట్టి నదిలో వదిలేయమంటాడు. (కర్ణుణ్ణి కుంతీదేవి నదికి అర్పించిన వృత్తాంతం గుర్తొస్తుంది.
గ్రీకు పురాణంలో పెర్సియస్ కథలో కూడా ఇలాంటి వృత్తాంతం ఒకటి ఎదురవుతుంది.) అలా నదిలో కొట్టుకు వచ్చిన పసికందుల్ని ఓ ఆడతోడేలు
ఆదుకుని పెంచుతుంది. మానవ శిశువుల్ని ఆడతోడేలు పెంచడవేంటని అడగొచ్చు. లాటిన్ లో లూపస్
అనే పదానికి ‘ఆడ తోడేలు’ అని, ‘వేశ్య’ అని కూడా అర్థం వుంది. కాబట్టి ఏ అర్థం తీసుకోవాలో
పాఠకులే నిర్ణయించుకోవాలి.
ఆడ తోడేలు కవల పిల్లలకి స్తన్యమిస్తున్న
దృశ్యం – ఎట్రస్కన్ నాగరికతకి చెందిన 5 వ శతాబ్దం నాటి కంచు విగ్రహం.
పిల్లలు ఇద్దరూ ఏపుగా పెరుగుతారు.
యవ్వనవంతులు అయ్యాక తమ జన్మవృత్తాంతం తెలుసుకుంటారు. అంతో ఇంతో సేనని పోగుచేసి అమూలియస్
మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో అమూలియస్ ని చంపి, తాతగారైన నుమిటార్ ని మళ్లీ
సింహాసనం మీద కూర్చోబెడతారు.
నుమిటార్ తరువాత మనవలు ఇద్దర్లో
ఎవరు రాజు కావాలి అన్న సమస్య వస్తుంది. అన్నదమ్ములు రాజ్య స్థాపన చెయ్యడం అనగానే మనకి
విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు, బుక్కరాయలు గుర్తుకురాక మానరు. అయితే విజయనగర
సామ్రాజ్య స్థాపకులంత సంస్కారవంతంగా ప్రవర్తించలేదు మన రోములస్, రేమస్ సోదరులు.
ఇద్దరిలో మొదట ఎవరు రాజు కావాలనే
సమస్యని తేల్చడానికి జోస్యులు ముందుకు వచ్చారు. వీళ్లని ఆగర్ (augurs) అంటారు. ప్రకృతిలో
వచ్చే పరిణామాల బట్టి చిత్ర విచిత్ర రీతుల్లో వీళ్లు జరగబోయేది చెప్తుంటారు. కొన్ని
సార్లు ఓ గొర్రెని బలి ఇచ్చి, దాని అంతరంగ అవయవాల రూపురేఖల బట్టి కూడా జోస్యం చెప్తుంటారు.
అన్నదమ్ములు ఇద్దరినీ పక్కపక్కగా ఉన్న రెండు పొట్టి కొండల మీదకి ఎక్కమన్నారు జోస్యులు.
సోదరులు అలాగే చేశారు. కాసేపు అయ్యాక ఒక పక్షుల గుంపు రోములస్ ఉన్న కొండ మీదుగా ఎగురుతూ
ముందుకు పోయింది. రోములస్సే సింహాసనానికి తగిన వాడు అని జోస్యులు తీర్మానించారు. అది
విన్న రేమస్ ఉగ్రుడయ్యాడు. అన్నతో కయ్యానికి దిగాడు. ఇద్దరూ కత్తులు దూశారు. ఆ కయ్యంలో
రోములస్ రేమస్ ని చంపేశాడు. కొత్తగా పుట్టిన ప్రాంతానికి రోములస్ రాజు అయ్యాడు. అతడి
పేరు మీదే ఆ ప్రాంతానికి తదనంతరం రోమ్ అని పేరు వచ్చింది.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment