Themes from World History

Themes from World History

Sunday, September 18, 2016

రోమన్ సామ్రాజ్యానికి మూలాలు

 
“రోమ్ కథ, ప్రపంచం కథ.” – నెపోలియన్ బోనాపార్టే

అది మూడు వేల ఏళ్ల క్రితం నాటి కథ. అప్పటికి మధ్యధరా సముద్ర పరిసరాలలో ప్రబల నాగరికత గ్రీకు నాగరికత.
క్రీ.పూ. 3000 నుండి కూడా గ్రీకు సంస్కృతి  గురించి, అందులో వచ్చిన ఆటుపోట్ల వివరాల గురించి చెప్పే  అవిచ్ఛిన్న చరిత్ర వుంది. క్రీ.పూ. 1600-క్రీ.పూ 1100 మధ్య కాలంలో  గ్రీకు ప్రాంతం ఓ గొప్ప నాగరికతకి ఆలవాలం అయ్యింది. మైసినే అనే ప్రాంతం కేంద్రంగా గల నాగరికత గనుక దాన్ని మైసినేయన్ నాగరికత అంటారు. క్రీపూ 1100 దరిదాపుల్లో ఆ నాగరికత పతనం కావడంతో గ్రీస్ లో చీకటి యుగం మొదలయ్యింది.

 క్రీ.పూ. 800 దరిదాపుల్లో మళ్లీ గ్రీకు సంస్కృతి ఆ చీకటి యుగం నుండి నెమ్మదిగా మేలుకోవడం మొదలుపెట్టింది. విద్య, కళా రంగాల్లో కొత్త చిగుళ్లు చిగురించాయి. వాణిజ్యం పుంజుకుంది. వర్తకులు వ్యాపార అవకాశాల కోసం వెతుక్కుంటూ పొరుగున ఉన్న ఏజియన్ సముద్రాన్ని దాటి ఇంకా దూరాలు ప్రయాణించారు. ఆ యాత్రలలో కొన్ని వారిని మునుపు పెద్దగా తెలియని పశ్చిమ ప్రాంతాలకి తీసుకుపోయాయి.


 

అలా గ్రీకులు కనుక్కున్న కొత్త ప్రాంతాల్లో ఇటలీ ద్వీపకల్పం (peninsula)  ఒకటి. మనిషి పాదం ఆకారంలో ఉండే ఆ ద్వీపకల్పం మీద గ్రీకులకి ఒక కొత్త జాతి తారసపడింది. సాంస్కృతిక ఉన్నతిలో తమని మించిన వారు లేరని అనుకునే గ్రీకులకి అప్పటికే బాగా అధునాతనమైన సంస్కృతి అక్కడ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడ వారికి కోట బురుజులు కనిపించాయి. ప్రహరీ గోడలు ఉన్న నగరాలు కనిపించాయి. అక్కడి ప్రజలని పాలించే రాజులు కనిపించారు. ప్రజలకి మంచి చెడ్డలు చెప్పే అర్చకులు కనిపించారు. గొప్ప సునిశితత్వంతో, సౌందర్యంతో వెలిగే కళా విశేషాలు కనిపించాయి. కాంతులు చిమ్మే బంగరు ఆభరణాలని, ఇనుప పనిముట్లని అమ్మే గడసరి వర్తకులు కనిపించారు.
ఇటలీలో టస్కనీ (Tuscany) ప్రాంతంలో స్థిరపడ్డ ఈ కొత్త జాతిని ఎట్రస్కన్లు (Etruscans)  అంటారు. 

లోహ  విజ్ఞానంలో ఎట్రస్కన్లు గొప్ప కౌశలాన్ని ప్రదర్శించారు. విస్తృత సొరంగాల నిర్మాణంలో, భూగర్భ మందిరాల నిర్మాణంలో వాళ్లు వాడిన లోహం ఎంత ఎత్తున ఉండేదంటే రెండున్నర వేల ఏళ్ల తరువాత ఇటాలియన్ నియంత ముస్సోలినీ (Mussolini) ఆ లోహపు వస్తువులని తవ్వి పైకి తీయించి, కరిగించి, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయుధాల నిర్మాణంలో వినియోగింపజేశాడు.

ఒక పక్క ఎట్రుస్కన్ రాజ్యం అలా వర్ధిల్లుతుండగా ఇటలీ ద్వీపకల్పం లోనే మరో చోట  మరో కొత్త రాజ్యం ఊపిరిపోసుకుంది. దానికి శంఖుస్థాపన చేసినవాళ్లు ఇద్దరు అన్నదమ్ములు. కవలలు. వాళ్ల పేర్లు రోములస్, రేమస్. ఆ శంఖుస్థాపన జరిగిన సంవత్సరం క్రీపూ 753 అని ఓ రోమన్ గాధ చెప్తుంది. 

ఈ సోదరులు అసలు ఎవరు అన్న విషయం మీద ఓ విచిత్రమైన కథ  ప్రచారంలో వుంది. అవాస్తవికంగా, అలౌకికంగా తోచే ఆ వృత్తాంతాన్ని ఒక చారిత్రక కథ కన్నా, ఒక పౌరాణిక గాధ అనుకోవాలేమో. గొప్ప గొప్ప రాజవంశాలు వారి ఆరంభాలు అనుమానాస్పదంగా, అవమానాస్పదంగా ఉంటే, దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఏవేవో కథలు అల్లుతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే అనిపిస్తుంది. 

ఆ ప్రాంతంలోనే కొన్ని తరాల క్రితం నుమిటార్ అనే రాజు ఉండేవాడు.   తమ్ముడు అమూలియస్ అన్నయ్య నుమిటార్ ఆక్రమించిన  సింహాసనాన్ని కాజేసి, అన్నని రాజ్యం నుండి వెళ్లగొడతాడు. అక్కడితో ఆగక అన్నకి పుట్టిన కొడుకుల్ని హత్య చేయిస్తాడు. నుమిటార్ కి ఓ కూతురు కూడా వుంది. ఆమె పేరు రియా సిల్వియా. ఆడకూతుర్ని చంపకుండా ‘అవివాహిత పూజారిణి’గా (vestal virgin) ఉండమని శాసిస్తాడు. అలాంటి వాళ్లు 6 ఏళ్ల నుండి 36 ఏళ్ల వరకు వెస్టా అనే దేవతకి చెందిన ఆలయంలో పూజారిణులుగా ఊడిగం చెయ్యాలి.  అలా పూజారిణిగా వున్న సిల్వియా మీద మార్స్ దేవత కన్నేస్తాడు. మార్స్ దేవత కృపాకటాక్షాల వల్ల సిల్వియా ఇద్దరు కవలల్ని కంటుంది.

ఉగ్రుడైన అమూలియస్ రాజు భటుల్ని పంపించి సిల్వియాని టైబర్ (Tiber) నదిలోకి విసిరేయమంటాడు. పసికందులు ఇద్దర్నీ ఓ బుట్టలో పెట్టి నదిలో వదిలేయమంటాడు. (కర్ణుణ్ణి కుంతీదేవి నదికి అర్పించిన వృత్తాంతం గుర్తొస్తుంది. గ్రీకు పురాణంలో పెర్సియస్ కథలో కూడా ఇలాంటి వృత్తాంతం ఒకటి ఎదురవుతుంది.)  అలా నదిలో కొట్టుకు వచ్చిన పసికందుల్ని ఓ ఆడతోడేలు ఆదుకుని పెంచుతుంది. మానవ శిశువుల్ని ఆడతోడేలు పెంచడవేంటని అడగొచ్చు. లాటిన్ లో లూపస్ అనే పదానికి ‘ఆడ తోడేలు’ అని, ‘వేశ్య’ అని కూడా అర్థం వుంది. కాబట్టి ఏ అర్థం తీసుకోవాలో పాఠకులే నిర్ణయించుకోవాలి.

 
ఆడ తోడేలు కవల పిల్లలకి స్తన్యమిస్తున్న దృశ్యం – ఎట్రస్కన్ నాగరికతకి చెందిన 5 వ శతాబ్దం నాటి కంచు విగ్రహం.

పిల్లలు ఇద్దరూ ఏపుగా పెరుగుతారు. యవ్వనవంతులు అయ్యాక తమ జన్మవృత్తాంతం తెలుసుకుంటారు. అంతో ఇంతో సేనని పోగుచేసి అమూలియస్ మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో అమూలియస్ ని చంపి, తాతగారైన నుమిటార్ ని మళ్లీ సింహాసనం మీద కూర్చోబెడతారు.

నుమిటార్ తరువాత మనవలు ఇద్దర్లో ఎవరు రాజు కావాలి అన్న సమస్య వస్తుంది. అన్నదమ్ములు రాజ్య స్థాపన చెయ్యడం అనగానే మనకి విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు, బుక్కరాయలు గుర్తుకురాక మానరు. అయితే విజయనగర సామ్రాజ్య స్థాపకులంత సంస్కారవంతంగా ప్రవర్తించలేదు మన రోములస్, రేమస్ సోదరులు.
ఇద్దరిలో మొదట ఎవరు రాజు కావాలనే సమస్యని తేల్చడానికి జోస్యులు ముందుకు వచ్చారు. వీళ్లని ఆగర్ (augurs) అంటారు. ప్రకృతిలో వచ్చే పరిణామాల బట్టి చిత్ర విచిత్ర రీతుల్లో వీళ్లు జరగబోయేది చెప్తుంటారు. కొన్ని సార్లు ఓ గొర్రెని బలి ఇచ్చి, దాని అంతరంగ అవయవాల రూపురేఖల బట్టి కూడా జోస్యం చెప్తుంటారు. అన్నదమ్ములు ఇద్దరినీ పక్కపక్కగా ఉన్న రెండు పొట్టి కొండల మీదకి ఎక్కమన్నారు జోస్యులు. సోదరులు అలాగే చేశారు. కాసేపు అయ్యాక ఒక పక్షుల గుంపు రోములస్ ఉన్న కొండ మీదుగా ఎగురుతూ ముందుకు పోయింది. రోములస్సే సింహాసనానికి తగిన వాడు అని జోస్యులు తీర్మానించారు. అది విన్న రేమస్ ఉగ్రుడయ్యాడు. అన్నతో కయ్యానికి దిగాడు. ఇద్దరూ కత్తులు దూశారు. ఆ కయ్యంలో రోములస్ రేమస్ ని చంపేశాడు. కొత్తగా పుట్టిన ప్రాంతానికి రోములస్ రాజు అయ్యాడు. అతడి పేరు మీదే ఆ ప్రాంతానికి తదనంతరం రోమ్ అని పేరు వచ్చింది.

(ఇంకా వుంది)








Monday, September 5, 2016

ప్రాచీన రోమన్ సామ్రాజ్యం - కొత్త ధారావాహిక



బ్లాగర్లకి వినాయ చవితి శుభాకాంక్షలు!

ఈ సందర్భంలో ‘రోమన్ సామ్రాజ్యం, రోమన్ సంస్కృతి’ అన్న అంశం మీద ఒక కొత్త ధారావాహిక మొదలుపెడుతున్నాను. (ఈ  కథ విన్నవారికి , కన్న వారికి, సిరి సంపదలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సర్ప రాక్షస …. వగైరాలు  అనను గాని, సహస్రాబ్దాల రోమన్ చరిత్ర గురించి చదువుతుంటే గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుందని మాత్రం చెప్పగలను!)


ప్రాచీన రోమన్ సామ్రాజ్యం

రోమన్ సామ్రాజ్యం చరిత్రలో అత్యంత శక్తివంతమైన, సువిస్తారమైన సామ్రాజ్యాలలో ఒకటి. ఆ సామ్రాజ్యానికి కేంద్రం ఆధునిక ఇటలీలో ఉండేది. ఆధునిక రోమ్ నగరం దానికి రాజధానిగా ఉండేది. మధ్యధరా సముద్ర తీర రాజ్యాలెన్నో రోమన్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. పశ్చిమ, కేంద్ర యూరప్, ఇంగ్లీష్ దీవులలో దక్షిణ భాగం, గల్ఫ్, ఉత్తర ఆఫ్రికాల వరకు కూడా దాని ప్రభావం విస్తరించింది. పాశ్చాత్య నాగరికతకి ప్రాచీన మూలాలుగా రెండు సంస్కృతులు ఉన్నాయని చెప్పుకుంటారు. తత్వచింతన,  విజ్ఞాన రంగాల్లో ఆ మూలాలు  గ్రీకు సంస్కృతిలో ఉన్నాయి. అలాగే సామ్రాజ్య స్థాపనలో, నగర నిర్మాణంలో, సమర్థవంతమైన ప్రజాపాలనలో, గొప్ప క్రమబద్ధీకరణతో కూడిన సామాజిక వ్యవస్థల నిర్వహణలో పాశ్చాత్య సంస్కృతికి మూలాలు రోమన్ సంస్కృతిలో ఉన్నాయి.

    క్రీపూ 8 వ శతాబ్దంలో స్థాపించబడ్డ రోమన్ సామ్రాజ్యం క్రీశ. 100-200 ప్రాంతాల్లో మహర్దశకి చేరుకుంది. తరువాత ఆ సామ్రాజ్యం విపరీతంగా విస్తరించడంతో క్రీశ 5  వ శతాబ్దంలో అప్పటికే బలహీనమైన రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. పశ్చిమ భాగం జర్మన్ జాతుల దాడికి లొంగి పతనమైపోయింది.  కాని తూర్పు భాగం మరో వెయ్యేళ్ళు వర్ధిల్లి క్రీ.శ. 15 వ శతాబ్దంలో ఒటోమాన్ టర్కుల చేతిలో ఓడిపోయింది.

 

ఎలాంటి శక్తుల చర్య వల్ల ఒక మహాసామ్రాజ్యం  వృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతుంది, ఎలాంటి శక్తుల వల్ల బలహీనమవుతుంది, పతనమవుతుంది అన్నది అర్థం చేసుకోవాలంటే రోమన్ చరిత్ర చదవాలి.
1776 లో రోమన్ చరిత్ర మీద సాధికార రచనగా చెప్పుకునే The History of the Decline and Fall of the Roman Empire అనే పుస్తకం (నిజానికి అదొక గ్రంథమాల) వెలువడింది. దాని రచయిత ఇంగ్లండ్ కి చెందిన ఎడ్వర్డ్ గిబన్.

విశేషం ఏమిటంటే సైన్స్ ఫిక్షన్ రచయిత ఐసాక్ అసిమోవ్ మొత్తం పాలపుంత గెలాక్సీ అంతా విస్తరించిన విశాల అంతరిక్ష సామ్రాజ్య స్థాపన గురించి, దాని వృధ్ధి, స్థితి, లయల గురించి Foundation అనే నవలామాలికలో అద్భుతంగా వర్ణించాడు. ఆ నవలా మాలికకి స్ఫూర్తి రోమన్ చరిత్రేనని, ముఖ్యంగా గిబన్ రాసిన చరిత్ర గ్రంథాలేనని అంటారు.

రోమన్ చరిత్ర గురించి ఇప్పటి నుండి ధారావాహికగా కొన్ని పోస్టులలో చర్చించుకుందాం…

 (ఇంకా వుంది)