ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన
ఖగోళ విజ్ఞానం యొక్క వేళ్లు పూర్వచారిత్రక యుగానికి న్
(pre-historic age) చెందినవని పురావస్తు పరిశోధకులు అంటారు. ఈజిప్ట్ లో నబ్టా ప్లాయా
(Nabta Playa) అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ప్రత్యేకమైన వలయాకారంలో ఏర్పరచబడ్డ రాళ్ల వరుసలు (stone circles) దొరికాయి. ఈ
రకమైన రాతి విన్యాసాల సహాయంతో సమయాన్ని నిర్ణయించే ఆచారం ఎన్నో ప్రాచీన సంస్కృతులలో ఉండడం కనిపిస్తుంది. కింద వివరించబడిన బ్రిటన్ కి చెందిన స్టోన్ హెంజ్
(Stonehenge) కూడా ఆ కోవకి
చెందినదే. ఇలాంటి రాతి వలయాలు మన దేశంలో కూడా దొరికాయి.
ఈజిప్షియన్ల కాలమానం ప్రకారం ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. అంటే ఆ కాలెండర్
లో ఏటేటా పావు రోజు తగ్గిపోతూ వస్తుంటుంది అన్నమాట. కాని ఆ దోషాన్ని వాళ్లు సవరించడానికి ప్రయత్నించినట్టు కనిపించలేదు. కాని వాళ్లు సిరియస్
(Sirius) తార ఆధారంగా మరో కాలెండర్ కూడా రూపొందించారు. ఆ కాలెండర్ లో మాత్రం ఏడాదికి 365 ¼ రోజులు ఉన్నాయి.
ఈజిప్షియన్ల కాలెండర్
ప్రాచీన భారత దేశంలో గంగ, సరస్వతి నదుల లాగా ఈజిప్షియన్ జీవితంలో నైలు నదికి చాలా కేంద్రమైన స్థానం ఉండేది. ఆ ప్రాంతంలో వ్యవసాయం నైలు నదీ జలాల మీద ఆధారపడి ఉండేది. అయితే నైలు నది ఏటేటా summer solstice సమయంలో (ఉత్తరాయణం
నడిమధ్యలో)
పొంగేది. నైలు నదిలో వరదలు ఎప్పుడు వస్తాయో ముందే నిర్ణయించగలిగితే ప్రాణాలని, పంటని రక్షించడానికి వీలవుతుంది. ఖగోళశాస్త్రం సహాయంతో అది సాధ్యమయ్యేది. ఆ రోజుల్లో ఖగోళ విజ్ఞానాన్ని అధ్యయనం చేసే పురోహితులు వరదల రాకని ముందే నిర్ణయించగలిగేవారు. కనుక వారికి ఆ రోజుల్లో గొప్ప ప్రాభవం, పరపతి ఉండేది.
ఈజిప్ట్ లోని పిరమిడ్ల నిర్మాణ విశేషాలని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు అందులో ఎంతో ఖగోళ విజ్ఞానం ఇమిడి వుందని గమనించారు. ఉదాహరణకి పిరమిడ్లలో ముఖ్యమైన ‘గ్రేట్ పిరమిడ్’ (The Great Pyramid) అంచులు
కచ్చితంగా ఉత్తర-దక్షిణ అక్షానికి, తూర్పు-పడమర అక్షానికి సమాంతరంగా వున్నాయి. ఉత్తర-దక్షిణ దిశలో వున్న గోడయొక్క దిశకి అసలైన ఉత్తర-దక్షిణ అక్షానికి మధ్య దోషం కేవలం ఒక డిగ్రీలో ఇరవయ్యవ వంతు ఉందని అని కొలతలలో తేలింది. అంటే భూమి ఉత్తర-దక్షిణ అక్షం గురించి పిరమిడ్ల నిర్మాతలకి అంత కచ్చితంగా తెలుసన్నమాట. దీనికి ప్రమాణంగా తీసుకోవాలంటే ఆధునిక యుగంలో నిర్మించబడ్డ గ్రీనిచ్ నక్షత్రశాలలో ఉత్తర-దక్షిణ గోడకి, అసలైన ఉత్తర-దక్షిణ అక్షానికి మధ్య డిగ్రీలో మూడో వంతు భేదం వుంది.
పిరమిడ్ల నిర్మాణంలో మరి కొన్ని ఖగోళ విశేషాలు కూడా వున్నాయి. గ్రేట్ పిరమిడ్ లో రాజమందిరం,
రాణి మందిరం అని రెండు గదులు వున్నాయి. ఈ గదులలో రాజు, రాణుల మృతదేహాలని మమ్మీకరించి భద్రపరిచారు. ఆ మందిరాల నుండి గోడల దిశగా విస్తరించిన దూలాలు ఉన్నాయి. రాజమందిరం నుండి రెండు దూలాలు, రాణి మందిరం నుండి రెండు దూలాలు ఉన్నాయి. ఈ దూలాలలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక,
ప్రముఖ నక్షత్రాన్ని సూచిస్తున్నట్టుగా అమర్చబడ్డాయి. రాజమందిరం నుండి ఉత్తర దిశగా విస్తరించిన దూలం ‘తుబన్’ (దీని ఆధునిక నామం ‘ఆల్ఫా డ్రాకోనిస్’ – Alpha Draconis) అనే తారని సూచిస్తోంది. ఈజిప్ట్
ని పాలించిన ఫారోల దృష్టిలో ఈ తార ‘గర్భధారణకి, పిండోత్పత్తికి’ చిహ్నం. దక్షిణ దిశగా తిరిగి వున్న దూలం ‘అల్ నిటక్’ (దీని ఆధునిక నామం ‘జీటా ఓరియోనిస్’ – Zeta Orionis) అనే తారని సూచిస్తోంది. ఈ తార ఓరియాన్ బెల్ట్ (Orion
Belt) లోని మూడు అత్యంత ప్రకాశవంతమైన తారలలో ఒకటి. ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతిలో ఈ తార ‘ఒసిరిస్’ (Osiris) దేవతకి ప్రతిరూపం. ఒసిరిస్ దేవత పునర్జన్మకి, పునరుజ్జీవనానికి చిహ్నం.
అలాగే రాణిమందిరం నుండి ఉత్తర దిశగా తిరిగి వున్న దూలం ‘కోకబ్’ (Kochab, దీని ఆధునిక నామం ‘బీటా అర్సా మైనర్’ – Beta Ursa Minor) అనే తారని సూచిస్తోంది. ఇది ‘విశ్వపునరుద్దీపనం’ కి చిహ్నం. ఇక దక్షిణంగా తిరిగి వున్న దూలం ‘సిరియస్’ (‘ఆల్ఫా కానిస్ మేజర్’ – Alpha Canis Major) తారని సూచిస్తోంది. ఈ తార ఈజిప్షియన్లు కొలిచే ఐసిస్
(Isis) దేవతకి ప్రతిరూపం. ఈజిప్షియన్ల సాంప్రదాయంలో ఐసిస్ ఈజిప్షియన్ రాజులకి దివ్యజనని. ఒక విధంగా
భారతీయ సంస్కృతిలో దేవమాత అదితిని పోలిన దేవత ఈమె. ఆ
విధంగా ఈజిప్షియన్ల కాలంలో తారలకి ఇవ్వబడ్డ అధ్యాత్మిక అన్వయాన్ని మనం స్వీకరించినా స్వీకరించకపోయినా ఆ రోజుల్లో అంత కచ్చితమైన ఖగోళ పరిజ్ఞానం ఉండడం విశేషం.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment