యూరప్ లో మధ్య
యుగం నడుస్తున్న కాలంలో (క్రీ.శ. 700-1200)
అరేబియా లో వైజ్ఞానిక చింతన బాగా వేళ్లూనింది. ప్రాచీన భారతీయులు, ప్రాచీన గ్రీకులు పోషించిన విజ్ఞానం అరబిక్ భాషలోకి తర్జుమా చెయ్యబడి అక్కడ గొప్ప వైజ్ఞానిక పునరుద్ధరణకి స్ఫూర్తి నిచ్చింది. వైజ్ఞానిక పరిజ్ఞానం కలిగి ఉండడం ఒక విధమైన ఉన్నతమైన వ్యక్తిగత సంస్కారానికి చిహ్నం అన్నట్టు అయ్యింది.
పందొమ్మిదవ శతాబ్దంలో అరేబియాలో అల్-ఖ్వరిజ్మీ అనే ఓ గొప్ప
ఖగోళ వేత్త ఉండేవాడు. ఆల్జీబ్రా కి ఇతడే మూలకర్త అంటారు. ఆధునిక కంప్యూటర్ విజ్ఞానంలో algorithm (అల్గారిథమ్) అనే పదం కూడా ఈ ‘అల్-ఖ్వరిజ్మీ’ అనే పదం నుండే వచ్చింది అంటారు. ప్రాచీన భారతం నుండి స్వీకరించిన సంఖ్యా వ్యవస్థ ఆధారంగా ఇతడు ఓ అరబిక్ సంఖ్యా వ్యవస్థని రూపొందించాడు. ఆ తరువాత కొన్ని శతాబ్దాల తరువాత ఇతడి రచనలు లాటిన్ లో అనువదించబడ్డాయి. ఆ విధంగా భారతీయ సంఖ్యా మానం యూరప్ కి పాకింది.
ఖగోళ వస్తువుల స్థానాల బట్టి ఇతడు వివిధ నగరాల వద్ద అక్షాంశ (latitude), రేఖాంశ (longitude) స్థానాలు నిర్ణయించగలిగేవాడు.
ఆ విధంగా రెండు వేలకి పైగా నగరాల వద్ద అక్షాంశ, రేఖాంశ స్థానాలు నిర్ణయించి ఆ కాలంలో ఎంతో కచ్చితమైన ప్రపంచపటం తయారుచేశాడు.
ప్రఖ్యాత ప్రాచీన అరబిక్ ఖగోళశాస్త్రవేత్త అల్ బిరూనీ రచనలలో
చంద్రపక్షాలని వర్ణించే ఒక పుట
అరేబియాకి చెందిన గొప్ప కవిగా ఉమర్ ఖయ్యాం (క్రీ.శ. 1048-1131) పేరు మన దేశంలో కూడా చాలా మందికి సుపరిచితమే. కాని ఉమర్ ఖయ్యామ్ కవి మాత్రమే కాక గొప్ప గణితవేత్త, ఖగోళ వేత్త కూడా. ఏడాదిలో రోజుల సంఖ్యని ఇతడు చాలా కచ్చితంగా నిర్ణయించాడు. ఇతడి అంచనా ప్రకారం ఆ సంఖ్య విలువ = 365.24219858156. ఇది ఆధునిక విలువతో ఆరవ దశాంశ స్థానం (6th decimal) వరకు సరిపోతోంది.
ఆసక్తికరమైన వ్యాసం శ్రీనివాస్ చక్రవర్తి గారు.
ReplyDeleteఒక సందేహం - "పందొమ్మిదవ శతాబ్దంలో అరేబియాలో అల్-ఖ్వరిజ్మీ అనే ఓ గొప్ప ఖగోళ వేత్త ఉండేవాడు. ఆల్జీబ్రా కి ఇతడే మూలకర్త అంటారు " అన్నారు మీరు. ఈ శాస్త్రవేత్త జీవితకాలం పందొమ్మిదవ శతాబ్దం కన్నా ఇంకా బాగా ముందరేనేమోననిపిస్తోంది నాకు. ఏమంటారు?
నరసింహారావు గారు, నిజమే పొరపాటు అయ్యింది. తొమ్మిదవ శతాబ్దం అని ఉండాలి.
ReplyDeletehttps://en.wikipedia.org/wiki/Muhammad_ibn_Musa_al-Khwarizmi
థాంక్స్ శ్రీనివాస చక్రవర్తి గారు. నాకు సందేహం కలగడానికి ముఖ్య కారణం "కన్యాశుల్కం" నాటకంలో గిరీశం అగ్నిహోత్రావధానులతో తెల్లవాళ్ళ స్కూళ్ళ గురించి గొప్పలు చెబుతూ "యంతసేపూ జాగర్ఫీ గీగర్ఫీ, అర్ధమెటిక్, ఆల్జీబ్రా, మాధమాటిక్స్ యివన్నీ హడలేసి చెప్తారండి" అనే మాట గుర్తొచ్చింది. అలాగే కొనవలసినవని శష్యుడు వెంకటేశాన్ని వ్రాసుకోమనే పుస్తకాల జాబితాలో ఆల్జీబ్రా కూడా ఉంటుంది. ఈ నాటకం పందొమ్మిదో శతాబ్దంలోనే రచించారు గురజాడ అప్పారావు గారు. కాబట్టి అప్పటికే ఆల్జీబ్రా ఉన్నదని తెలుస్తోంది.
ReplyDeleteమీరు నాతో ఏకీభవించిన తర్వాత కూడా ఇదంతా ఎందుకంటే నాకు జ్ఞాపకం ఉన్నదానికి ఆధారంగా అని సరదాగా చెప్పుకోవడానికి మాత్రమే. ఏమనుకోకండి.
గురజాడ వారి కన్యాశుల్కం విడుదల నాటికే ఇరవయ్యవ శతాబ్ది గుమ్మం లోనికి వచ్చేసింది.
Deleteనరసింహారావు గారు, శ్యామలీయం గారు, చర్చ ఆసక్తికరంగా వుంది. (అనుకునే ప్రసక్తే లేదు :-)
ReplyDeleteఅవును కన్యాశుల్కంలో ఆ సన్నివేశం గుర్తుంది. అప్పుడేనా "భోజనాల దగ్గర కూడా ఆ ముక్కలే వల్లిస్తారు, అదేదో దేవభాషలాగ" అను విసుక్కుంటాడు అగ్నిహోత్రావధానులు?