ప్రాచీనులకి ఖగోళ విజ్ఞానం తెలుసనడానికి మరో ఆశ్చర్యకరమైన ఉదాహరణ పాలినేషియా. పసిఫిక్ మహాసముద్రంలో కేంద్ర-దక్షిణ ప్రాంతంలో ఆస్ట్రేలియా ఖండం కాకుండా ఎన్నో చిన్న చిన్న దీవులు ఉన్నాయి. ఈ దీవులని కలుపుకుని కొన్ని వేల మైళ్ల విస్తారం గల ప్రాంతాన్ని ఓషియానియా (Oceania) అంటారు. ఇందులో దక్షిణ ప్రాంతంలో వెయ్యికి పైగా దీవులు ఉన్న ప్రాంతాన్ని పాలినేషియా (Polynesia) అంటారు.
ఈ దీవులు కొన్ని వేల ఏళ్లుగా ఓ ప్రత్యేక నాగరికతకి ఆలవాలమై వున్నాయి. ఈ దీవులు ఖండాల నుండి బాగా దూరంగా ఉండడం వల్ల ఇక్కడ వికసించిన నాగరికత విలక్షణమై, ఎన్నెన్నో శతబ్దాలుగా దాని విలక్షణతని నిలుపుకుంటూ వచ్చింది. కచ్చితమైన ఖగోళ విజ్ఞానం ఆ నాగరికత మనుగడకి తప్పనిసరిగా అవసరమయ్యింది. నేల మీద అయితే కొండలు, గుట్టలు, దార్లు, ఏర్లు మొదలైన కొండగుర్తులు ఉంటాయి. దారి తెలుసుకోడానికి, గమ్యాన్ని చేరుకోడానికి ఉపకరిస్తాయి. కాని ఏ చిన్నెలూ లేని సమతలం మీద, సముద్రతలం మీద దారి కనిపెట్టాలంటే ఆకాశం తప్ప, ఖగోళంలోని ఆనవాళ్లు తప్ప మరో గత్యంతరం లేదు.
పాలినేషియా – పై మ్యాపులో త్రికోణాకార ప్రాంతంలో వున్న దీవుల సముదాయం
క్రీ.పూ. 3000 కాలంలో ఆధునిక టైవాన్ లో ఆవిర్భవించిన పాలినేషియన్ సంస్కృతి అక్కడి నుండి ఫిలిపీన్స్, ఇండొనేషియా, న్యూ గినియా ప్రాంతాల మీదుగా పాలినేషియా అంతటా విస్తరించి వుంటుందని చారిత్రకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాచీన భారతంలో గురువుల నుండి శిష్యులకి గీతాల, శ్లోకాల రూపంలో మౌఖికంగా జ్ఞానం సంక్రమించినట్టు, పాలినేషియన్లు కూడా అనాదిగా వాతావరణం గురించి, ఖగోళం గురించి ఎంతో పరిజ్ఞానాన్ని మౌఖికంగా కింది తరాల వారకి అందజేస్తూ వస్తున్నారనడానికి దాఖలాలు వున్నాయి. ఏ తారలు ఎప్పుడు ఉదయిస్తాయి, ఎప్పుడు అస్తమిస్తాయి? ఏ దీవుల మీద ఏఏ జంతు జాతులు ఉంటాయి? కెరటాలలో రకాలు ఏమిటి? వాటి రూపురేఖలు ఎలాంటివి? మేఘాలలో రకాలేమిటి? ఏ రేవుని ఎలా సమీపించాలి? మొదలైన ప్రశ్నలకి సమాధాలలో ఆ గీతాలలో పొందుపరచబడి వుండేవి.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment