(బ్లాగర్లకి వినాయక చవితి శూభాకాంక్షలు. ఇంచుమించు మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ "ప్రపంచ చరిత్ర" బ్లాగ్ నిర్వహణలో సమయాభావం వల్ల అంతరాయం కలిగింది. మళ్లీ ఈ సీరియల్ ని కొనసాగించదలచుకున్నాను. శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లాగానే ఈ బ్లాగ్ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...)
ఓ దారుణ ఘాతుకంతో, భ్రాతృహత్యతో మొదలైన రోమన్ చరిత్రలో, కొన్ని
సహస్రాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగిన రోమన్ చరిత్రలో, హింసా కాండ ఓ ముఖ్యభాగం అయిపోయింది.
తొలిదశలలో ఓ కిరాత జాతిలా అడవులు పట్టి తిరిగిన రోమన్లు ఇరుగు పొరుగు కిరాత జాతులతో
అనవరతం ఘర్షణ పడుతూ ఎంతో నెత్తురు చిందించారు. కొన్ని శతాబ్దాల పరిణామం తరువాత, ఓ అవిశేషమైన
గూడెం ఓ విశాల సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత కూడా, సుశిక్షితులైన రోమన్ సేనలకి ఉత్తర
సరిహద్దుల నుండి పదే పదే దాడులు చేసే జర్మన్ కిరాత జాతులకి మధ్య జరిగిన యుద్ధాలలో రక్తం
వరదలై పారింది. స్థాయి పెరిగింది, తీరు పెరిగింది గాని, రక్త తర్పణం మాత్రం ఆగలేదు,
హింసా ప్రవృత్తిలో మాత్రం మార్పు లేదు.
రోమన్ చరిత్ర తొలిదశలలో, ఇరుగు పొరుగు కిరాత జాతులని జయించి
తమ చిన్న పాటి రాజ్యాన్ని వేగంగా విస్తరింపజేసుకోవాలని తహతహపడే రోమన్లకి ఓ విచిత్రమైన
సమస్య ఎదురయ్యింది. వారిలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. మరి జాతి వర్ధిల్లాలంటే
సంతానం కావాలి, అంటే స్త్రీలు కావాలి. తమలో స్త్రీల సంఖ్య పెంచడం ఎలా? ఆ సమస్యకి పరిష్కారంగా
రోమ్యులస్ రాజు ఓ కపటమైన ఉపాయం తట్టింది.
తమ పొరుగు జాతి అయిన సేబైన్ (Sabines) లని విందుకోసం ఆహ్వానించారు. ఆ వచ్చే టప్పుడు తమ
భార్యలని, కూతుళ్లని విందుకు తీసుకు రావడం మరవొద్దని మరీ మరీ గుర్తుచేశారు రోమన్లు.
ఆహ్వానాన్ని మన్నించి విందుకి విచ్చేశారు అతిథులు. సంబరాలు మిన్నంటాయి. మద్యం ఏరై పారింది.
సేబైన్ అతిథులు మత్తులో మునిగితేలారు. అతిథులు ఉన్మత్తులై ఉన్న స్థితి గమనించి రోమ్యులస్
తన అనుచరులకి సంజ్ఞ చేశాడు. రోమన్లు సేబైన్ పురుషుల మీద పడి దొరికిన వారిని దొరికినట్టు
అనాగరికంగా ఊచకోత కోశారు. సేబైన్ స్త్రీలని తన సొంతం చేసుకున్నారు. ఆ విధంగా పరమ నీచమైన, అమానుష
చర్యల పునాదిరాళ్ల మీద రోమన్ రాజ్యం నెమ్మదిగ ఎదిగింది.
క్రీపూ ఐదవ శతాబ్దానికల్లా
రోమ్ గణనీయంగా ఎదిగింది. రోమ్ ఇప్పుడు మట్టిగోడల పూరిపాకలతో కూడుకున్న అవిశేషమైన గూడెం
కాదు. ఇటుక గోడలతో పెద్ద పెద్ద భవనాలతో కూడుకున్న నగరం. ఎట్రుస్కన్ సామ్యాజ్యంలో అంతో
ఇంతో ప్రాభవం గల రాజ్యం రోమ్. ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి జనం రోమ్ నగరానికి వలస వెళ్లారు.
రోమ్ జనాభా క్రమంగా పెరిగింది. ఎట్రుస్కన్ లు, ఫోనీషియన్లు వ్యాపారం కోసం రోమన్ విపణి
వీధుల్లో సంచరించేవారు. వైన్, బంగారం, ఆలివ్ పళ్లతో వ్యాపారం ముమ్మరంగా సాగేది.
వాణిజ్యంలో, ఆర్థిక సత్తాలో, సాంకేతిక పరిజ్ఞానంలో రోమ్ కి ఏ
విధంగానూ తీసిపోని నగరాలు మధ్యధరా ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. కాని ఈ నగరాలలో లేని ఓ
ప్రత్యేక లక్షణం రోమ్ జీవన విధానంలో వుంది. అది నిర్వహణా కౌశలం. అధిక సంఖ్యలు మనుషులు,
గొప్ప క్రమ శిక్షణతో, వ్యవహార శీలతతో, వ్యూహాత్మకంగా పని చేసి అసాధారణ ఫలితాలని సాధించడం.
ఈ ఒక్క లక్షణం వల్ల రోమ్ నగరం తగ్గిక గ్రీకు నగర-రాష్ట్రాలకి (city states) మల్లె మిగిలిపోకుండా
ఓ విశాల విశ్వసామ్యాజ్యం స్థాయికి ఎదిగింది. ఆ ఒక్క లక్షణం వల్లనే, రోమన్ సామ్రాజ్యం
తనతో పాటే పుట్టి కొద్దిపాటి శతాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగి, ఆరిపోయే ఊళ్లలా కాక, సహస్రాబ్దాల
పాటు చిరాయువై వర్ధిల్లింది.
రోమ్ లో మొట్టమొదట ఈ ప్రత్యేక లక్షణాన్ని చిగురింపజేసినవాడు
రోమ్ కి చెందినవాడు కాడు. అతడొక ఎట్రుస్కన్ రాజు. అతడి పేరు సర్వియస్ టలియస్
(Servius Tullius). ఇతగాడు క్రీపూ 575–535 రోమ్
ని ప్రాంతంలో రోమ్ ని పాలించాడు. రోమ్ ని పాలించిన
పాలకులలో సంస్థాపకుడైన రమ్యులస్ మొదటి వాడు అయితే, సర్వియస్ టలియస్ ఆరవవాడు. రోమన్
చక్రవర్తులలో చిరకీర్తి సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. రక్తతర్పణం చేసి శత్రు శేషం
లేకుండా చేసిన వాళ్లు, అంతఃకలహాలని నిర్దయగా అణచివేసి తమ ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకున్నవారు,
జైత్రయాత్రలు చేసి రోమన్ సామ్రాజ్య సరిహద్దులని అపారంగా విస్తరింపజేసినవారు – ఇలా బలోద్ధతి
చేత పేరు మోసిన వాళ్లు ఎందరో ఉన్నారు. సర్వియస్ టలియస్ ఇలాంటివి ఏవీ చెయ్యలేదు.
కాని అతడు చేసిన మేలు రోమన్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది.
(ఇంకా వుంది)
(ఇంకా వుంది)
Thank you for restarting this series. It helps me a lot to understand world history to explain to my kids
ReplyDeleteప్రసాద్ గారు! ఈ సీరీస్ మీకు నచ్చినందుకు సంతోషం. పిల్లలకి ప్రపంచ చరిత్ర గురించి సరైన అవగాహన ఉండడం చాలా ముఖ్యం. మన సమాజంలో "పెద్దలు" చరిత్రకి, పురాణానికి కూడా తేడా తెలియకుండా చిత్రవిచిత్రంగా మాట్లాడుతుంటారు.
ReplyDelete