ఆ తరుణంలో రోమన్ చరిత్ర మరో గొప్ప
మలుపు తిరిగింది. రోమన్ ప్రజలు కేవలం ఎట్రుస్కన్లతోనే కాదు, అసలు రాజులతోను, రాజకుటుంబాలతోను
విసిగిపోయారు. ఆ గద్దెనెక్కిన ప్రతి ఒక్కడూ ఏదో సందర్భంలో మదమెక్కి అహంకరిస్తాడు. ప్రజలని
కాపాడవలసిన రాజు గజదొంగలా ప్రజలని దోచుకోవడం మొదలెడతాడు. రాజులు రాక్షసుల్లా ప్రవర్తించడం,
ప్రజలు తిరగబడి వాళ్లని రాజమందిరాల నుండి బయటికి ఈడ్చి బహిరంగంగా తలలు నరకడం – ఈ ఘట్టం
చక్రికంగా చరిత్రలో కనిపిస్తూనే ఉంటుంది. దాంతో రోమన్ ప్రజలలో రాజుల పట్ల, వారి పాలన
పట్ల గాఢమైన విముఖత పెరిగింది.
మరి రాజులు లేకుండా పాలన సాగెదెలా?
రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? దానికి రోమన్లు ఆలోచించిన పరిష్కారం రోమన్ చరిత్రని సమూలంగా
మార్చేసింది. ప్రజలే పాలన సాగిస్తారు. పాలన అనేది ‘ప్రజల వ్యవహారం’, res
publica. దీన్నే నేడు Republic
అంటున్నాం. ఈ విధానంలో ప్రజలు ఎన్నుకున్న
ప్రజాప్రతినిధులు పాలన సాగిస్తారు. వీళ్లని consuls (కాన్సళ్లు) అంటారు.
కొత్త విధానం అమలులోకి వచ్చాక్
రోమ్ ని ఇద్దరు కాన్సళ్లు పాలించారు. వారిలో ఒకడు ఎట్రుస్కన్ల మీద తిరుగుబాటు సాగించిన
బ్రూటస్. రెండవ వాడు మరణించిన లుక్రీషియా భర్త. ఒకరికి బదులు ఇద్దరు కాన్సళ్లని ఎంచుకోవడానికి
ఒక కారణం వుంది. ఏలిక ఒకడే అయితే ఒక్కడికే మితిమీరిన బలం చేతికి ఇచ్చినట్టు అవుతుంది.
పాలకులు ఇద్దరు ఉంటే అంతమేరకు సమస్య ఉండదు. పైగా ప్రతీ నిర్ణయంలోను కాన్సళ్లు ఇద్దరూ
ఏకీభవించాలి. అప్పుడే ఆ నిర్ణయం అమలు లోకి వస్తుంది. ఈ నియమం వల్ల ఎవడో ఒక్కడే ఇష్టానుసారం
నడచుకునే ఆస్కారం ఉండదు. క్రమంగా ఇద్దరు కాన్సళ్ల చుట్టూ ఒక ప్రజాప్రతినిధుల సదస్సు
ఏర్పడింది. దాని పేరే Senate. మన దేశంలో వాడుకలో ఉన్న లోక్ సభ, రాజ్య సభల వంటి సదస్సులకి
ఇది పూర్వరూపం అని చెప్పుకోవచ్చు. SPQR (Senatus Populusque Romanus) అంటే ‘సెనేట్
మరియు ప్రజలు’ అనేది రోమన్ పాలనావిధానాన్ని క్లుప్తంగా వ్యక్తం చేసే ధర్మసూత్రంగా స్వీకరించబడింది.
ఆధునిక ప్రాజాస్వామ్యాలకి ఆ విధంగా ప్రాచీన రోమ్ ఒక మాతృకలా రూపుదిద్దుకోసాగింది.
రోమ్ కి ఇప్పుడు ప్రజాహితవైన పాలనా
విధానం ఏర్పడింది. ఎన్నో సంస్థాగతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాని ప్రజా సంక్షేమం
కావాలంటే సమర్థవంతమైన పాలన మాత్రం ఉంటే సరిపోదు. శత్రువుల దాడుల నుండి ప్రజలని రక్షించగల
సమర్థవంతమైన సైనిక బలం కావాలి. రోమన్ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి సైన్యాన్ని తయారుచేసే
పనికి పూనుకున్నారు. పాలనా విధానాలలో తెచ్చిన క్రమబద్ధీకరణే సైనిక శిక్షణలో, నిర్వహణలో
తీసుకువచ్చారు. అనతి కాలంలోనే క్రమశిక్షణకి, మొక్కవోని పరాక్రమానికి పెట్టింది పేరు
అయిన రోమన్ సేనాదళం రూపుదిద్దుకుంది.
కొత్తగా ఏర్పడ్డ సైనిక బలాల బలాబలాలు
తేల్చుకోవడానికి ఇప్పుడు ఒక లక్ష్యం కావాలి. గతంలో రోమన్లు ఎట్రుస్కన్ పాలకులని తరమికొట్టినా
ఎట్రుస్కన్ల బెడద పూర్తిగా తొలగిపోలేదు. వారు ఇప్పుడు పొరుగు రాజ్యం వారు. రోమన్లకి
చిరకాల శత్రువులు. రోమన్లకి, ఎట్రుస్కన్లకి మధ్య పోరు మొదలయింది. అయితే ఆ పోరు రోజులు,
నెలలు కాదు, ఇంచుమించు ఒక శతాబ్ద కాలం పాటు సాగింది.
క్రీ.పూ. 392లో ఎట్రుస్కన్లకి,
రోమన్లకి మధ్య జరిగిన పోరు ఆ రెండు రాజ్యాల మధ్య ఆఖరు పోరాటం అవుతుంది. రోమన్ సేనలు
ఎట్రుస్కన్ల ప్రధాన నగరం అయిన వేయ్ (Veii) ని ముట్టడించాయి. టైబర్ నదికి ఒక పక్క ఎట్రుస్కన్లు,
మరో రోమన్ సేనలు మొహరించాయి. పదే పదే ఇరు సేనలు తలపడుతూ అధిపత్యం కోసం పెనుగులాడాయి.
అతిశయమైన క్రమశిక్షణతో, క్రమబద్ధంగా, కలిసికట్టుగా
ఒక మారణ యంత్రంలా పోరాడే రోమన్ సేనల ధాటికి చివరికి ఎట్రుస్కన్ సేనలు తలవంచవలసి వచ్చింది.
రోమన్ సేనలు వేయ్ నగరాన్ని సర్వనాశనం చేశాయి. పురుషులని హతమార్చి, స్త్రీలని చెరపట్టి బానిసలుగా చేసుకున్నారు.
ఎట్రుస్కంలపై విజయం రోమన్ సేనలకి
మొట్టమొదటి ప్రముఖ విజయం. ఆ విజయానికి జ్ఞాపకార్థం ఒక విజయతోరణాన్ని (Arc of
Triumph) నిర్మించారు.
పారిస్ లో ఆర్క్ ద త్రియోంఫ్
రానున్న మరెన్నో సైనిజ విజయాలకి ఇది ముక్తాయింపు అయ్యింది. ఏ
శత్రు రాజ్యాన్ని జయించినా ఆ విజయానికి జ్ఞాపకంగా ఒక విజయతోరణాన్ని నిర్మించడం ఒక ఆనవాయితీ
అయ్యింది. రోమ్ లో మొదలైన ఈ ఆచారపు ప్రభావం తదనంతరం ఆధునిక యూరప్ కి కూడా పాకింది.
నేడు పారిస్ నగరం నడిబొడ్డులో వెలసిన Arc de Triomphe అలాంటి ప్రభావానికి నిదర్శనం.
ఫ్రెంచ్ విప్లవానికి జ్ఞాపక చిహ్నంగా ఆ విజయతోరణాన్ని నిర్మించారు. అలాంటిదే మరో నిదర్శనం
మన దేశ రాజధానిలో వెలసిన ఇండియా గేట్. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలలో భాగంగా
పోరాడిన భారతీయ సిపాయిల జ్ఞాపకార్థం ఆ విజయతోరణాన్ని నిర్మించారు.
దిల్లీ లో ఇండియా గేట్
(ఇంకా వుంది)
No comments:
Post a Comment