Themes from World History

Themes from World History

Wednesday, November 20, 2019

3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి


3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి

ఎడతెరిపిలేని యుద్ధాలతో రోమన్ సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. ప్యూనిక్ యుద్ధాల తరువాత రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత 650,000 చదరపు కిమీలు ఉండేదని అంతకు ముందు చెప్పుకున్నాం. కాని ఆ విజయ పరంపర సాధించడం కోసం రోమన్ సమాజం పెద్ద జరిమానాయే చెల్లించింది. యుద్ధాలకి అయిన ఖర్చు వల్ల ఖజానా అడుగంటిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగానే కాక మానవ వనరుల దృష్ట్యా కూడా రోమ్ ఎంతో కోల్పోయింది. రోమ్ తలపెట్టిన యుద్ధాలు ఆరోగ్యవంతులైన రోమన్ యువకులని లక్షల సంఖ్యలో పొట్టన పెట్టుకుంది. ఏళ్ల తరబడి దూర ప్రాంతాలలో యుద్ధాలు చెయ్యవలసి రావడం వల్ల సిపాయిలకి వారి కుటుంబాలకి మధ్య బాంధవ్యం ఎన్నో సందర్భాలలో తెగతెంపులు అయ్యే పరిస్థితి వచ్చింది. యుద్ధాలతో బతికి బట్టకట్టిన వారిలో ఎంతో మంది చితికిన శరీరాలతో తమ స్వగ్రామాలని చేరుకుని దుర్భరమైన బతుకులు కొనసాగించారు.
ఇలాంటి సైన్యంతో నిరవధిక రోమన్ సామ్రాజ్య విస్తరణ  సాధ్యం కాదని, అందుకు తగురీతిలో సైనిక సంస్కరణలు చేపట్టవలసిన అవసరం వుందని గుర్తించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు గయస్ మారియస్. రోమన్ ప్రభుత్వంలో మారియస్ రకరకాల హోదాలలో పని చేశాడు. ఏడు సార్లు రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి అయిన కాన్సల్ పదవిని పోషించాడు. సేనాని గాను, రాజకీయ నాయకుడి గాను కూడా పని చేశాడు.

రోమన్ సైనిక వ్యవహారాలలో అతడు కొన్ని లోతైన లొసుగులు గమనించాడు. రోమన్ సైన్యంలో సైనికుల నియామకం అయ్యే తీరు ప్రత్యేకంగా ఉండేది. ఆధునిక దేశాలలో సైనిక ఉద్యోగం ఒక ప్రత్యేకమైన వృత్తి. అందుకు తగ్గ అర్హతలు గల యువతీ యువకులు ఆ ఉద్యోగంలో చేరి, ఆ వృత్తికి సంబంచిన బాధ్యతలనే అనితరంగా నిర్వర్తిస్తారు.

కాని రోమన్ సైన్యంలో పరిస్థితి వేరు. రోమన్ సమాజంలో పౌరులు వారి ఆదాయాన్ని బట్టి ఆరు తరగతులుగా వర్గీకరించబడేవారు. అధిక ఆదాయం గల వారు ఉన్నత తరగతులలోను, తక్కువ ఆదాయం గల వారు కింది తరగతులలోను ఉండేవారు. అన్నిటికన్నా తక్కువ తరగతికి, అంటే ఆరవ తరగతికి, చెందిన వారు సొంతభూములు లేని నిరుపేదలు. వీరిని ప్రోలిటరీ (proliterii) అంటారు. వీరికి పెద్దగా హక్కులు ఉండవు.

సైన్యంలో చేరాలంటే పై ఐదు తరగతులకి చెందిన వారు అయ్యుండాలి. పైగా వారి ఆయుధాలు వారు తెచ్చుకోవాలి. యుద్ధ కాలానికి కొంచెం ముందుగా సేనలని పోగు చేసి ఆదరాబాదరాగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యుద్ధ కాలంలో మాత్రం, సైనిక సిబిరాలలో వారి దైనిక జమఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. యుద్ధం ముగిశాక వారి వారి మునుపటి వృత్తులలో తిరిగి చేరిపోతారు. ఇలాంటి ఏర్పాటులో సైనికుల అసలు వృత్తి పోరాటం కాదు. సైనిక వృత్తి అనేది సామాన్య పౌరులు ఆపత్సమయంలో చేపట్టే ఒక వ్యాపకం మాత్రమే.

సైనిక వృత్తిని తాత్కాలికంగా, ఒక వ్యాపకంలా చేపడితే అలాంటి సైనికుల సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటుందని మారియస్ త్వరలోనే గుర్తించాడు. ఇక్కడే అతడు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. సొంత భూములు లేక, రోజు కూలి కోసం ఇబ్బంది పడే నిరుపేద వర్గమైన ప్రోలిటరీని చేరదీసి వారిని సైన్యంలో తీసుకుంటే, వారి నిరుద్యోగ సమస్యని తీర్చినట్టు అవుతుంది. అంతేకాక కచ్చితమైన ఉద్యోగం లేని ఆ వర్గపు మనుషులని, అనితరంగా సైనిక శిక్షణ నిస్తే వారింత మరింత సమర్థులైన  యోధులుగా తీర్చిదిద్దొచ్చు. అలాంటి ఆలోచనతో గ్రామాలని గాలించి పెద్ద ఎత్తున గ్రామస్థులని, పేదలని సైన్యంలో చేర్చుకోవడం మొదలెట్టాడు.

“చూడు తమ్ముడూ! నీ పేరేంటి?”
“లోరెన్జో దొరా!”
“ఏం పని చేస్తావు?”
“ద్రాక్షతోటల్లో పని చేస్తా దొరా.”
“సైన్యంలో చేరతావా?”
“చదువు రానోణ్ణి. అవన్నీ నాకేటి తెలుస్తాయి దొరా?”
“చదువు అక్కర్లేదు. కండబలం, గుండె ధైర్యం ఉంటే చాలు. కావలసిన చదువు నేను చెప్పిస్తాగా.  ఏదీ ఈ శూలం ఓ సారి విసిరి చూపించు.”

(ఇంక వుంది)


No comments:

Post a Comment