Themes from World History

Themes from World History

Wednesday, November 6, 2019

అసువులు బాసిన హానిబల్ - మూడవ ప్యూనిక్ యుద్ధం


ఇరు పక్షాల మధ్య పోరు మొదలయ్యింది. ఆది నుండి సంగ్రామలక్ష్మి హానిబల్ పక్షాన్నే వరించింది. మొదట ట్రేబియా యుద్ధంలో, తరువాత ట్రాసిమీన్ చెరువు యుద్ధంలో, చివరిగా క్రీ.పూ. 216 లో కానై యుద్ధంలో రోమన్ లిజియన్లని మట్టి కరిపించాడు హానిబల్. రోమన్ సైన్యంలో 50,000 లో సిపాయిలు  మంది నేలరాలారు. హానిబల్ సైన్యం వల్ల రోమన్ సామ్యాజ్య అస్తిత్వానికే ముప్పని రోమ్ ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

ఇటాలియన్ ద్వీకలల్పం అంతటా ఎన్నో చోట్ల హానిబల్ సేనలు రోమన్ సేనలతో కత్తులు కలిపాయి. ఇంచుమించు ప్రతీ సారి గెలుపు హానిబల్ దే అయ్యింది. ఈ యుద్ధాలు పదిహేనేళ్ల పాటు కొనసాగాయి. ఇటాలియన్ ద్వీకల్పపు  దక్షిణ ప్రాంతంలో చాలా భాగం హానిబల్ చేతికిందికి వచ్చింది. కాని రోమన్ నగరం మాత్రం ఇంకా అతడి వశం కాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రోమ్ నగరాన్ని కాపాడే ప్రాకారాలు శత్రుదుర్భేధ్యమైన గోడలు. వాటిని భేదించడానికి కావలసిన ప్రత్యేక యంత్రాంగం హానిబల్ కి లేకపోయింది. పైగా దీర్ఘకాలపు పోరాటాల వల్ల ఒక పక్క అతడి సేనలు తరిగిపోతూ వస్తున్నాయు. దూరాభారం వల్ల స్వరాజ్యమైన కార్తేజ్ నుండి అదనపు బలగాలు రావడానికి కష్టమవుతోంది. సేనల పోషణకి కావలసిన ఆహారం కోసం ఇటలీలో రైతులని అటకాయించి, వారి పంటల మీదపడి దోచుకునేవారు హానిబల్ సైనికులు. కొంత ఆహారం ఆఫ్రీకా నుండి వచ్చేది. దూరం నుండి వచ్చా ఆహార సరఫరా మీద ఆధారపడే హానిబల్ సైనికుల బలహీనత రోమన్లకి అర్థమయ్యింది. ఆహారసరఫరా ఎక్కడి నుండి వస్తోందో ఆ మూలాల మీద దెబ్బ కొట్టాలి.

ఈ సందర్భంలో రోమన్  సెనేట్ ఓ ఉద్దండుడైన సేనానిని, హానిబల్ కి సమవుజ్జీ వంటి వాణ్ణి ఎంచుకుంది. అతడి పేరు పుబ్లియస్ కొర్నీలియస్ స్కిపియో. లోగడ కానై యుద్ధంలో హానిబల్ సేనలతో తలపడ్డ వాడు ఇతడు. హానిబల్ యుద్ధ వ్యూహాలు క్షుణ్ణంగా చదివినవాడు. ముప్పై నాలుగు వేల మంది సైన్యంతో ఆఫ్రికా పయనమయ్యాడు స్కిపియో. కార్తేజ్ రాజ్యానికి ఆయువుపట్టు అయిన కార్తేజ్ నగరాన్ని అటకాయించాడు. రాజధాని నాశనమవుతున్న తరుణంలో ఇక విధిలేక హానిబల్ కి ఇటలీలో పోరాటాలు నిలిపి స్వదేశానికి వెళ్లక తప్పలేదు. ఇరుసేనలు ఆధునిక టునీషియాలో జామా అనే ఊరి వద్ద యుద్ధానికి దిగాయి.  చివరికి క్రీ.పూ. 202 లో ఆ యుద్ధంలో రోమన్ సేనల చేతుల్లో హానిబల్ సేనలు ఘోరపరాజయాన్ని పొందాయి.

శాతాబ్దాల చరిత గల కార్తేజ్ సామ్యాజ్యం ఇప్పుడు నేలకి ఒరిగింది. హానిబల్ యుద్ధ భూమి నుండి పారిపోయి గ్రీస్ లో తలదాచుకున్నాడు. అప్పటికే వయసు పైబడ్డ ఆ మహాసేనాని ఎడతెగని  యుద్ధాలతో బాగా చితికిపోయాడు. పోయినవాణ్ణి పోనివ్వక రోమన్ సైనికులు అతణ్ణి గాలిస్తూ గ్రీస్ కి వెళ్లాయి. ప్రాణం పోయినా ఫరవాలేదు గాని రోమన్లకి చేతికి చిక్కకూడదని అనుకున్న హానిబల్ విషం మింగి ఆత్మత్యాగం చేసుకున్నాడు.




మూడవ ప్యూనిక్ యుద్ధం

రెండవ ప్యూనిక్ యుద్ధం తరువాత, హానిబల్ మరణం తరువాత కార్తేజ్ బాగా చితికిపోయింది. సైనిక బలం కూడా బాగా క్షీణించిపోయింది. కార్తేజ్ బలంగా ఉన్న రోజుల్లో కిక్కురు మనని ఇరుగుపొరుగు రాజ్యాలు ఇప్పుడు కార్తేజ్ బలహీనత చూసి  తోకజాడించడం మొదలెట్టాయి. పొరుగు రాజ్యమైన నుమీడియాకి, కార్తేజ్ కి మధ్య సరిహద్దుల్లో పదే పదే ఏదో చిచ్చు రేగుతూ ఉండేది. రోమ్ చేతి కింద సామంత రాజ్యంగా ఉండే నుమీడియా, రోమ్ అండ చూసుకుని పేట్రేగిపోయేది. ఇరు రాజ్యాల మధ్య వివాదం తలెత్తితే, తగుదునమ్మా రోమ్ అందులో తలదూర్చి తగవు తీర్చేది. తీర్పు ఎప్పుడూ నుమీడియాకే సానుకూలంగా ఉండేది.
ఉత్తర ఆఫ్రికాలో నుమీడియా


తమ పట్ల రోమ్ చూపిస్తున్న పక్షపాత వైఖరి  కార్తేజ్ ప్రజల్లో   రోమ్ పట్ల ద్వేషభావాన్ని పెంచింది. రెండవ ప్యూనిక్ యుద్ధం జరిగిన యాభై ఏళ్లకి కార్తిజీనియన్లు (కార్తేజ్ ప్రజలు) రోమ్ కి యుద్ధ పరిహారం కింద చెల్లించాల్సిన రుసుం పూర్తిగా చెల్లించేశారు. ఇక రోమ్ కి తమకి మధ్య లావాదేవీలేవీ లేవని, రోమ్ నుండి తమకి పూర్తిగా ఇన్నేళ్లకి స్వతంత్రం లభించిందని కార్తేజ్ వాసులు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు.

రోమ్ పీడ విరగడయ్యిందని తెలిశాక వాళ్లు మొట్టమొదట సాధించగోరినది నుమీడియా సమస్యని తేల్చుకోవడం. కార్తేజ్ నుమీడియా మీద దండయాత్ర చేసింది. కాని సైనిక బలం సరిపోక ఆ యుద్ధంలో ఓడిపోయింది. పైగా ఉన్న కాస్తంత సంపద కూడా యుద్ధం వల్ల తరిగిపోవడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

కార్తేజ్ కొత్తగా ప్రదర్శిస్తున్న ఈ యుద్ధోత్సాహం రోమన్ సెనేట్ లో కలకలం కలిగించింది. కార్తేజ్ మళ్లీ బలగాలని పోగు చేసుకోకుండా ఈ సారి సమూల నాశనం చెయ్యాలన్న కాంక్ష రోమన్ సెనేట్ లో బలవత్తరం కాసాగింది. కేర్తేజ్ ని ముగ్గులోకి దింపడానికి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయాత్నాలు మొదలెట్టింది రోమ్. కార్తేజ్ మీద సహించరాని అంక్షలు విధించే ప్రయత్నం చేసింది.  అలాంటి ఆంక్షల్లో ఒకటి కార్తేజ్ నగరాన్ని స్థానభ్రంశం చెయ్యడం. ఆ నగరం మొత్తం నేలమట్టం చేసి, ఆఫ్రికా తీరం నుండి దూరంగా మరో చోట నిర్మించాలన్నది రోమ్ కోరిక. కార్తేజ్ దాన్ని త్రోసిపుచ్చింది.

రోమ్ విన్నపాన్ని త్రోసిపుచ్చిందన్న నెపాన, క్రీ.పూ. 149 లో రోమ్ కార్తేజ్  మీద మరో సారి దాడి చేసింది. అదే మూడవ ప్యూనిక్ యుద్ధం అయ్యింది. కార్తేజ్ ఈ సారి ఆత్మరక్షణ కోసం కేవలం సైనిక బలగాల మీదే ఆధారపడితే సరిపోదని తెలుసుకుంది. నగరంలో సామాన్య పౌరులు కూడా అనేకరకాలుగా ఆ ఆఖరి పోరాటంలో పాల్గొన్నారు. వింటినారి కోసం నారీ శిరోజాలని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూడేళ్లపాటు జరిగిన ఆ కార్తేజ్ నగర ముట్టడికి అంతంలో క్రీ.పూ. 146లో కార్తేజ్ నగరం రోమన్ సేనల వశమయ్యింది. కార్తిజీనియన్ల మీద చిరకాల కక్ష తీర్చుకునే అదను దొరికింది. రోమన్ సేనలు ఆ మహానగరాన్ని ఇంచుమించు భూస్థాపితం చేశారు. నగర వాసులని ఊచకోత కోశారు. ఆ దారుణమారణ కాండలో సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అంచనా. బతికి బట్టకట్టిన 50,000 మంది బానిసత్వానికి బలయ్యారు. కార్తేజ్ రాజ్యం మొత్తం రోమన్ సామ్రాజ్యంలో విలీనమై ‘రోమన్ సామ్రాజ్యంలో ఆఫ్రికా భాగం’గా కొత్త పేరు తెచ్చుకుంది.

రోమన్ సామ్రాజ్యపు టెల్లలు ఇప్పుడు అమాంతంగా విస్తరించాయి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర తీర ప్రాంతాలెన్నో ఇప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలిశాయి. యూరప్ లోనే పశ్చిమాన ఆధునిక స్పెయిన్ లో ఒక భాగమైన ఐబీరియా కూడా కలిసింది. ఫ్రాన్స్ లో దక్షిణ భాగాలు కూడా రోమన్ ప్రాంతాలయ్యాయి. ఇక మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం మొత్తం ఎప్పుడో రోమన్ హయాం లోనికి వచ్చింది. రోమన్ ప్రభావం   తూర్పు దిశలో కూడా విస్తరించింది. మొత్తం రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత ఆ దశలో సుమారు 650,000 చదరపు కిమీలు ఉండేదని అని చారిత్రకుల అంచనా. అంటే ఇంచుమించు దక్షిణ భారత భూభగపు విస్తీరణతతో సమానం అన్నమాట.

అయితే రోమన్ సామ్రాజ్య విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు శాతాబ్దాల తరువాత, రోమన్ సామ్రాజ్యం మహర్దశను చేరుకున్న తరుణంలో, దాని విస్తీర్ణత ప్యూనిక్ యుద్ధాల అంతంలో ఉన్న విస్తీర్ణతతో పోల్చితే సుమారు పది రెట్లు పెరుగుతుంది. అయితే రాజ్యపు పొలిమేరలని అంత మేరకు విస్తరింపజేయాలంటే సైనిక నిర్వహణలో కొన్ని ముఖ్యమైన సంస్థాగత సంస్కరణలు జరగాలి.  ఆ సంస్కరణల వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పు వచ్చింది.

 (ఇంకా వుంది)







(ఇంకా వుంది)

No comments:

Post a Comment