Themes from World History

Themes from World History

Tuesday, December 3, 2019

గణతంత్రం నుండి మళ్లీ నియంతృత్వం దిశగా...



ఇలా ఉండగా రోమ్ కి ఉత్తర సరిహద్దుల వద్ద హఠాత్తుగా ఓ కొత్త సమస్య వచ్చిపడింది. కింబ్రీ, టాయ్టోన్ తెగలు రోమ్ ఉత్తర సరిహద్దుల మీద దాడి చేశాయి. ఈ సారి కేటలస్ అనే కాన్సల్ సర్వసైన్యాధ్యక్షుడిగా సేనలని అదిలించాడు. ఆ యుద్ధంలో కూడా సల్లా పాల్గొని ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి కూడా రోమ్ జయించింది.

ఈ సైనిక విజయపరంపరతో ఆత్మవిశ్వాసం పెరిగిన సల్లా రాజకీయంగా మరింత ఎత్తుకు వెళ్లాలని అనుకున్నాడు.  రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి కాన్సల్ అయితే, దానికి ఒక మెట్టు కిందుగా ప్రేటర్ అనే ప్రధాన న్యాయవాది పదవి ఒకటి ఉంది. తన సైనిక విజయాల గురించి ముమ్మరంగా ప్రచారం చేసి, సల్లా ఆ ప్రేటర్ పదవికి ఎన్నిక అయ్యాడు.

పెరుగుతున్న సల్లా పరపతి చూసి మారియస్ కి కన్నుకుట్టింది. సల్లాని సకాలంలో అదుపు చెయ్యకపోతే రోమ్ కే ముప్పు అని మారియస్ గుర్తించాడు. ఇద్దరి చుట్టూ ఎంతో మంది అనుయాయులు చేరారు. ఇరు వర్గాల చుట్టూ అడపా దపా ఘర్షణ జరిగేది.
మారియస్ తో కలహాన్ని ఓ కొత్త ఎత్తుకు తీసుకువెళ్లాలని సంకల్పించాడు సల్లా.

అప్పుడే రోమన్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ దుడుకు చర్యకి ఒడిగట్టాడు సల్లా.  తన కింద ఉన్న సైన్యాన్ని, కంచే చేను మేసిందనే నానుడిని తలపించేలా, రోమ్ నగరం మీదకి ఉసికొల్పాడు. సైనిక బలంతో నగరాన్ని, సెనేట్ ని ఆక్రమిస్తే ఇక తన అధికారాన్ని ధిక్కరించేవారు ఉండరు. ఆ దాడిని మారియస్ బలగం అడ్డుకోవాలని చూసింది కాని విఫలమయ్యింది. మారియస్  రోమ్ నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.

సల్లా, మారియస్ మధ్య నడిచిన చిరకాల శత్రుత్వానికి క్రీ.పూ. 84 లో మారియస్ మరణంతో తెరపడింది.  ఇక తనకి ఎదురులేదని గుర్తించిన సల్లా క్రీ.పూ. 83 లో రోమ్ మీద మరొక్కసారి దండయాత్ర ప్రకటించాడు. సెనేట్ సభ్యులు, తదితర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొరొక్కరే తనకి దాసోహం అన్నారు. కాదన్న వారి ప్రాణాలు తీశాడు. సెనేట్ నిండా తన పక్షం వారినే స్థాపించాడు. తన కిరాతకాలు మరింత వికృత రూపాలు కూడా దాల్చాయి. తనకి వ్యతిరేకంగా మొత్తం సామ్రాజ్యంలో ఎవరైనా మాట్లాడారని తెలిస్తే, వారిని సమాజ శత్రువులుగా ముద్రవేయించేవాడు. వాడి తల తీసి తెస్తే పెద్ద బహుమానం ఉంటుందని ప్రకటించాడు. పౌరులకి భయం పుట్టేలా క్షతగాత్రుల తలలని రోమ్ పురవీధుల్లో బహిరంగంగా వేలాడ దీయించేవాడు.

 ఇలా క్రమంగా, అక్రమంగా సర్వాధికారాలు తన గుప్పెట్లో పెట్టుకుని నియంతలా ప్రవర్తించాడు సల్లా. రోమన్ రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితుల్లో నియంతని ఎన్నుకునే వీలు ఉంది. (లోగడ సిన్సినాటీని ఎన్నుకున్న ఘట్టం గురించి చెప్పుకున్నాం).  కాని ఆ పదవి కేవలం ఆరునెలలకే వర్తిస్తుంది. ఆ తరువాత అతడు గద్దె దిగి, మునుపటి గణతంత్ర యంత్రాంగానికి చోటివ్వాలి.  కాని ఈ సారి సల్లా రోమన్ సామ్రాజ్యానికి నిరవధికంగా తానే నియంతగా, సర్వసామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు.

రాజులకి సర్వాధికారాలు ఇస్తే పాలన ఎంత కిరాతకంగా ఉంటుందో ఏనాడో చవిచూసిన రోమన్ పౌరులు రాచరికానికి స్వస్తి చెప్పి, గణతంత్రాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని శతాబ్దాల తరువాత వెనకటి పీడ మళ్లీ వాళ్ల తలకి చుట్టుకుంది. అధికార మదంతో విర్రవీగే ఓ దుష్టుడు ఇప్పుడు వారి నెత్తిన కూర్చున్నాడు.

సల్లా ప్రభావం వల్ల రోమన్ పాలక వ్యవస్థ క్రమంగా గణతంత్రం నుండి నియంతృత్వం దిశగా మళ్లింది. రోమన్  చారిత్రక పరిణామ పథంలో ఆ మలుపు శాశ్వతంగా  నిలిచిపోతుంది. అయితే నియంతలంతా దుష్టులు కానక్కర్లేదు. ప్రజలంటే సహజమైన అభిమానం కలిగి, పాలనా వ్యవహారాలలో దక్షుడై, సైనిక వ్యవహారాలలో అసమానశూరుడైన చక్రవర్తి రాజ్యం చేస్తే, ప్రజలు సుఖసంతోషాలతో జీవించే అవకాశం లేకపోలేదు. అలాంటి చక్రవర్తుల పరంపర ఒకటి ఇప్పటి నుండి ఒకటి రెండు శతాబ్దాల పాటు రోమన్  సామ్రాజ్యాన్ని పాలించనుంది. వారి ఏలికలో రోమన్ సామ్రాజ్యం అసలు చరిత్రలోనే అసమానమైన, అపూర్వమైన ఉన్నతిని చేరుకుంటుంది. అలాంటి చక్రవర్తులలో ప్రథముడు, రోమన్ చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందినవాడు, ఆ తరువాత రెండు సహస్రాబ్దాల పాటు రాజులకి, రాజవంశాలకి స్ఫూర్తిగా నిలిచినవాడు ఒకడు ఉన్నాడు. అతడి పేరు జూలియస్ సీజర్.

 (ఇంకా వుంది)

Sunday, November 24, 2019

సైనిక సంస్కరణలు చేపట్టిన మారియస్



మారియస్ కృషి వల్ల రోమన్ సైన్యం మళ్లీ పెరిగింది. అట్టడుగు వర్గాలకి చెందిన వారిని సైన్యంలో చేర్చుకోవడమే కాక,  వారికి సొంత భూములు ముట్టజెప్పే ఏర్పాట్లు కూడా చేశాడు. సేనలు  ఓ కొత్త రాజ్యాన్ని జయించినప్పుడు ఆ రాజ్యంలో కొంత భూమిని దాన్ని జయించిన సిపాయిలకి అందేలా విధివిధానాలు రూపొందించాడు. “ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి?” అని సిపాయిలు తమని తాము వేసుకునే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది. భూమితో పాటు అంతో ఇంతో పారితోషకం కూడా దక్కేది. సకాలంలో జీతభత్యాలు అందజేయడమే కాకుండా, ఉద్యోగ విరమణ చేశాక పింఛను వచ్చే ఏర్పాట్లు కూడా చేశాడు. ఇలాంటి సంస్కరణల వల్ల సైనిక వృత్తి ఒక ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వృత్తిగా ఎదిగింది.

మారియస్ చేపట్టిన ఈ సైనిక సంస్కరణల పర్యవసానం కేవలం పేదవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో ఆగిపోలేదు. దాని వల్ల అసలు రోమన్ సమాజంలోనే ప్రగాఢమైన విప్లవం బయల్దేరింది.
గయస్ మారియస్ (తైలవర్ణ చిత్రం - కళాకారుడు జాన్ వాండర్లిన్)









ఈ కొత్త సైనిక వ్యవస్థలో, సిపాయిలకి కొత్త వరాలన్నీ ప్రసాదించేవాడు సేనాపతి. జీతాలు ఇచ్చేవాడు, కూడు, గుడ్డ, నీడ ప్రసాదించేవాడు, పింఛను మంజూరు చేసేవాడు అయిన సేనాపతి ఈ కొత్త పద్ధతిలో సైనికుల పాటి దైవంగా చలామణి అయ్యాడు. వెనకటి వ్యవస్థలో బలం అంతా సెనేట్ చేతుల్లో ఉండేది. ఈ కొత్త వ్యవస్థలో ఆ బలం యొక్క కేంద్ర స్థానం సైన్యం వైపుగా, సేనాపతుల వైపుగా మళ్లింది. ఒకప్పుడు సెనేట్ మీద సేనాపతులు ఆధారపడేవారు. ఇప్పుడు మొత్తం సైనిక బలాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సేనాపతుల మీదే సెనేట్ సభ్యులు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బలాల సమతూనికలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

రోమన్ పాలనా వ్యవస్థ యొక్క బలకేంద్రాన్ని సెనేట్ నుండి సైనిక దళాల వైపుగా మళ్లించే ఒరవడికి నాంది పాడినవాడు సేనాపతి గయస్ మారియస్ అయితే, ఆ ఒరవడికి ఎంత భయంకరమైన పర్యవసానాలు ఉంటాయో ప్రదర్శించి చూపించిన మరో సేనాపతి ఉన్నాడు. అతడి పేరు లూసియస్ కోర్నీలియస్ సల్లా.

క్రీ.పూ. 138 లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సల్లా, యవ్వనంలో సైనిక దళంలో చేరాడు. ధైర్యపరాక్రమాలు గలవాడు కావడంతో వేగంగా సైనికదళంలో ఎదిగి మారియస్ యొక్క ఉపసేనాపతులలో ఒకడయ్యాడు.

క్రీ.పూ. 112–106  దరిదాపుల్లో రోమ్ కి ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతమైన నుమీడియా రాజ్యాన్ని పాలించే జుగర్తా అనే రాజుతో వైరం ఉండేది.  ఆ కాలంలో సేనాపతిగా ఉన్న గయస్ మారియస్ కి జుగర్తాకి మధ్య జరిగిన యుద్ధాలలో సల్లా ముఖ్యపాత్ర పోషించాడు. నుమీడియా కి పొరుగురాజ్యమైన మారిటానియా ని ఆ కాలంలో బోకస్ అనే రాజు పాలించేవాడు. బోకస్ సహాయపడితో జుగర్తాని వశం చేసుకోవడం సులభం అని సల్లా గుర్తించాడు. ఒడుపుగా దౌత్యం నడిపి రోమ్ పట్ల కొద్దోగొప్పో సుముఖత గల బోకస్ రాజుని తమ వైపుకి తిప్పుకున్నాడు. బోకస్ ప్రమేయం వల్ల జుగర్తాని వశం చేసుకోవడానికి వీలయ్యింది. ఆ విధంగా జుగర్తా మీద యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

యుద్ధం గెలిచిన ఘనత అంతా తనదేనని సల్లా రోమ్ లో చాటుకోవడం మొదలెట్టాడు. దాంతో ఒళ్లు మండిన మారియస్ తన ప్రియతమ ఉపసేనాపతికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఆ అదను కోసం ఎదురుచూడసాగాడు.


(ఇంకా వుంది)

Wednesday, November 20, 2019

3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి


3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి

ఎడతెరిపిలేని యుద్ధాలతో రోమన్ సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. ప్యూనిక్ యుద్ధాల తరువాత రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత 650,000 చదరపు కిమీలు ఉండేదని అంతకు ముందు చెప్పుకున్నాం. కాని ఆ విజయ పరంపర సాధించడం కోసం రోమన్ సమాజం పెద్ద జరిమానాయే చెల్లించింది. యుద్ధాలకి అయిన ఖర్చు వల్ల ఖజానా అడుగంటిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగానే కాక మానవ వనరుల దృష్ట్యా కూడా రోమ్ ఎంతో కోల్పోయింది. రోమ్ తలపెట్టిన యుద్ధాలు ఆరోగ్యవంతులైన రోమన్ యువకులని లక్షల సంఖ్యలో పొట్టన పెట్టుకుంది. ఏళ్ల తరబడి దూర ప్రాంతాలలో యుద్ధాలు చెయ్యవలసి రావడం వల్ల సిపాయిలకి వారి కుటుంబాలకి మధ్య బాంధవ్యం ఎన్నో సందర్భాలలో తెగతెంపులు అయ్యే పరిస్థితి వచ్చింది. యుద్ధాలతో బతికి బట్టకట్టిన వారిలో ఎంతో మంది చితికిన శరీరాలతో తమ స్వగ్రామాలని చేరుకుని దుర్భరమైన బతుకులు కొనసాగించారు.
ఇలాంటి సైన్యంతో నిరవధిక రోమన్ సామ్రాజ్య విస్తరణ  సాధ్యం కాదని, అందుకు తగురీతిలో సైనిక సంస్కరణలు చేపట్టవలసిన అవసరం వుందని గుర్తించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు గయస్ మారియస్. రోమన్ ప్రభుత్వంలో మారియస్ రకరకాల హోదాలలో పని చేశాడు. ఏడు సార్లు రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి అయిన కాన్సల్ పదవిని పోషించాడు. సేనాని గాను, రాజకీయ నాయకుడి గాను కూడా పని చేశాడు.

రోమన్ సైనిక వ్యవహారాలలో అతడు కొన్ని లోతైన లొసుగులు గమనించాడు. రోమన్ సైన్యంలో సైనికుల నియామకం అయ్యే తీరు ప్రత్యేకంగా ఉండేది. ఆధునిక దేశాలలో సైనిక ఉద్యోగం ఒక ప్రత్యేకమైన వృత్తి. అందుకు తగ్గ అర్హతలు గల యువతీ యువకులు ఆ ఉద్యోగంలో చేరి, ఆ వృత్తికి సంబంచిన బాధ్యతలనే అనితరంగా నిర్వర్తిస్తారు.

కాని రోమన్ సైన్యంలో పరిస్థితి వేరు. రోమన్ సమాజంలో పౌరులు వారి ఆదాయాన్ని బట్టి ఆరు తరగతులుగా వర్గీకరించబడేవారు. అధిక ఆదాయం గల వారు ఉన్నత తరగతులలోను, తక్కువ ఆదాయం గల వారు కింది తరగతులలోను ఉండేవారు. అన్నిటికన్నా తక్కువ తరగతికి, అంటే ఆరవ తరగతికి, చెందిన వారు సొంతభూములు లేని నిరుపేదలు. వీరిని ప్రోలిటరీ (proliterii) అంటారు. వీరికి పెద్దగా హక్కులు ఉండవు.

సైన్యంలో చేరాలంటే పై ఐదు తరగతులకి చెందిన వారు అయ్యుండాలి. పైగా వారి ఆయుధాలు వారు తెచ్చుకోవాలి. యుద్ధ కాలానికి కొంచెం ముందుగా సేనలని పోగు చేసి ఆదరాబాదరాగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యుద్ధ కాలంలో మాత్రం, సైనిక సిబిరాలలో వారి దైనిక జమఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. యుద్ధం ముగిశాక వారి వారి మునుపటి వృత్తులలో తిరిగి చేరిపోతారు. ఇలాంటి ఏర్పాటులో సైనికుల అసలు వృత్తి పోరాటం కాదు. సైనిక వృత్తి అనేది సామాన్య పౌరులు ఆపత్సమయంలో చేపట్టే ఒక వ్యాపకం మాత్రమే.

సైనిక వృత్తిని తాత్కాలికంగా, ఒక వ్యాపకంలా చేపడితే అలాంటి సైనికుల సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటుందని మారియస్ త్వరలోనే గుర్తించాడు. ఇక్కడే అతడు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. సొంత భూములు లేక, రోజు కూలి కోసం ఇబ్బంది పడే నిరుపేద వర్గమైన ప్రోలిటరీని చేరదీసి వారిని సైన్యంలో తీసుకుంటే, వారి నిరుద్యోగ సమస్యని తీర్చినట్టు అవుతుంది. అంతేకాక కచ్చితమైన ఉద్యోగం లేని ఆ వర్గపు మనుషులని, అనితరంగా సైనిక శిక్షణ నిస్తే వారింత మరింత సమర్థులైన  యోధులుగా తీర్చిదిద్దొచ్చు. అలాంటి ఆలోచనతో గ్రామాలని గాలించి పెద్ద ఎత్తున గ్రామస్థులని, పేదలని సైన్యంలో చేర్చుకోవడం మొదలెట్టాడు.

“చూడు తమ్ముడూ! నీ పేరేంటి?”
“లోరెన్జో దొరా!”
“ఏం పని చేస్తావు?”
“ద్రాక్షతోటల్లో పని చేస్తా దొరా.”
“సైన్యంలో చేరతావా?”
“చదువు రానోణ్ణి. అవన్నీ నాకేటి తెలుస్తాయి దొరా?”
“చదువు అక్కర్లేదు. కండబలం, గుండె ధైర్యం ఉంటే చాలు. కావలసిన చదువు నేను చెప్పిస్తాగా.  ఏదీ ఈ శూలం ఓ సారి విసిరి చూపించు.”

(ఇంక వుంది)


Wednesday, November 6, 2019

అసువులు బాసిన హానిబల్ - మూడవ ప్యూనిక్ యుద్ధం


ఇరు పక్షాల మధ్య పోరు మొదలయ్యింది. ఆది నుండి సంగ్రామలక్ష్మి హానిబల్ పక్షాన్నే వరించింది. మొదట ట్రేబియా యుద్ధంలో, తరువాత ట్రాసిమీన్ చెరువు యుద్ధంలో, చివరిగా క్రీ.పూ. 216 లో కానై యుద్ధంలో రోమన్ లిజియన్లని మట్టి కరిపించాడు హానిబల్. రోమన్ సైన్యంలో 50,000 లో సిపాయిలు  మంది నేలరాలారు. హానిబల్ సైన్యం వల్ల రోమన్ సామ్యాజ్య అస్తిత్వానికే ముప్పని రోమ్ ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

ఇటాలియన్ ద్వీకలల్పం అంతటా ఎన్నో చోట్ల హానిబల్ సేనలు రోమన్ సేనలతో కత్తులు కలిపాయి. ఇంచుమించు ప్రతీ సారి గెలుపు హానిబల్ దే అయ్యింది. ఈ యుద్ధాలు పదిహేనేళ్ల పాటు కొనసాగాయి. ఇటాలియన్ ద్వీకల్పపు  దక్షిణ ప్రాంతంలో చాలా భాగం హానిబల్ చేతికిందికి వచ్చింది. కాని రోమన్ నగరం మాత్రం ఇంకా అతడి వశం కాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రోమ్ నగరాన్ని కాపాడే ప్రాకారాలు శత్రుదుర్భేధ్యమైన గోడలు. వాటిని భేదించడానికి కావలసిన ప్రత్యేక యంత్రాంగం హానిబల్ కి లేకపోయింది. పైగా దీర్ఘకాలపు పోరాటాల వల్ల ఒక పక్క అతడి సేనలు తరిగిపోతూ వస్తున్నాయు. దూరాభారం వల్ల స్వరాజ్యమైన కార్తేజ్ నుండి అదనపు బలగాలు రావడానికి కష్టమవుతోంది. సేనల పోషణకి కావలసిన ఆహారం కోసం ఇటలీలో రైతులని అటకాయించి, వారి పంటల మీదపడి దోచుకునేవారు హానిబల్ సైనికులు. కొంత ఆహారం ఆఫ్రీకా నుండి వచ్చేది. దూరం నుండి వచ్చా ఆహార సరఫరా మీద ఆధారపడే హానిబల్ సైనికుల బలహీనత రోమన్లకి అర్థమయ్యింది. ఆహారసరఫరా ఎక్కడి నుండి వస్తోందో ఆ మూలాల మీద దెబ్బ కొట్టాలి.

ఈ సందర్భంలో రోమన్  సెనేట్ ఓ ఉద్దండుడైన సేనానిని, హానిబల్ కి సమవుజ్జీ వంటి వాణ్ణి ఎంచుకుంది. అతడి పేరు పుబ్లియస్ కొర్నీలియస్ స్కిపియో. లోగడ కానై యుద్ధంలో హానిబల్ సేనలతో తలపడ్డ వాడు ఇతడు. హానిబల్ యుద్ధ వ్యూహాలు క్షుణ్ణంగా చదివినవాడు. ముప్పై నాలుగు వేల మంది సైన్యంతో ఆఫ్రికా పయనమయ్యాడు స్కిపియో. కార్తేజ్ రాజ్యానికి ఆయువుపట్టు అయిన కార్తేజ్ నగరాన్ని అటకాయించాడు. రాజధాని నాశనమవుతున్న తరుణంలో ఇక విధిలేక హానిబల్ కి ఇటలీలో పోరాటాలు నిలిపి స్వదేశానికి వెళ్లక తప్పలేదు. ఇరుసేనలు ఆధునిక టునీషియాలో జామా అనే ఊరి వద్ద యుద్ధానికి దిగాయి.  చివరికి క్రీ.పూ. 202 లో ఆ యుద్ధంలో రోమన్ సేనల చేతుల్లో హానిబల్ సేనలు ఘోరపరాజయాన్ని పొందాయి.

శాతాబ్దాల చరిత గల కార్తేజ్ సామ్యాజ్యం ఇప్పుడు నేలకి ఒరిగింది. హానిబల్ యుద్ధ భూమి నుండి పారిపోయి గ్రీస్ లో తలదాచుకున్నాడు. అప్పటికే వయసు పైబడ్డ ఆ మహాసేనాని ఎడతెగని  యుద్ధాలతో బాగా చితికిపోయాడు. పోయినవాణ్ణి పోనివ్వక రోమన్ సైనికులు అతణ్ణి గాలిస్తూ గ్రీస్ కి వెళ్లాయి. ప్రాణం పోయినా ఫరవాలేదు గాని రోమన్లకి చేతికి చిక్కకూడదని అనుకున్న హానిబల్ విషం మింగి ఆత్మత్యాగం చేసుకున్నాడు.




మూడవ ప్యూనిక్ యుద్ధం

రెండవ ప్యూనిక్ యుద్ధం తరువాత, హానిబల్ మరణం తరువాత కార్తేజ్ బాగా చితికిపోయింది. సైనిక బలం కూడా బాగా క్షీణించిపోయింది. కార్తేజ్ బలంగా ఉన్న రోజుల్లో కిక్కురు మనని ఇరుగుపొరుగు రాజ్యాలు ఇప్పుడు కార్తేజ్ బలహీనత చూసి  తోకజాడించడం మొదలెట్టాయి. పొరుగు రాజ్యమైన నుమీడియాకి, కార్తేజ్ కి మధ్య సరిహద్దుల్లో పదే పదే ఏదో చిచ్చు రేగుతూ ఉండేది. రోమ్ చేతి కింద సామంత రాజ్యంగా ఉండే నుమీడియా, రోమ్ అండ చూసుకుని పేట్రేగిపోయేది. ఇరు రాజ్యాల మధ్య వివాదం తలెత్తితే, తగుదునమ్మా రోమ్ అందులో తలదూర్చి తగవు తీర్చేది. తీర్పు ఎప్పుడూ నుమీడియాకే సానుకూలంగా ఉండేది.
ఉత్తర ఆఫ్రికాలో నుమీడియా


తమ పట్ల రోమ్ చూపిస్తున్న పక్షపాత వైఖరి  కార్తేజ్ ప్రజల్లో   రోమ్ పట్ల ద్వేషభావాన్ని పెంచింది. రెండవ ప్యూనిక్ యుద్ధం జరిగిన యాభై ఏళ్లకి కార్తిజీనియన్లు (కార్తేజ్ ప్రజలు) రోమ్ కి యుద్ధ పరిహారం కింద చెల్లించాల్సిన రుసుం పూర్తిగా చెల్లించేశారు. ఇక రోమ్ కి తమకి మధ్య లావాదేవీలేవీ లేవని, రోమ్ నుండి తమకి పూర్తిగా ఇన్నేళ్లకి స్వతంత్రం లభించిందని కార్తేజ్ వాసులు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు.

రోమ్ పీడ విరగడయ్యిందని తెలిశాక వాళ్లు మొట్టమొదట సాధించగోరినది నుమీడియా సమస్యని తేల్చుకోవడం. కార్తేజ్ నుమీడియా మీద దండయాత్ర చేసింది. కాని సైనిక బలం సరిపోక ఆ యుద్ధంలో ఓడిపోయింది. పైగా ఉన్న కాస్తంత సంపద కూడా యుద్ధం వల్ల తరిగిపోవడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

కార్తేజ్ కొత్తగా ప్రదర్శిస్తున్న ఈ యుద్ధోత్సాహం రోమన్ సెనేట్ లో కలకలం కలిగించింది. కార్తేజ్ మళ్లీ బలగాలని పోగు చేసుకోకుండా ఈ సారి సమూల నాశనం చెయ్యాలన్న కాంక్ష రోమన్ సెనేట్ లో బలవత్తరం కాసాగింది. కేర్తేజ్ ని ముగ్గులోకి దింపడానికి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయాత్నాలు మొదలెట్టింది రోమ్. కార్తేజ్ మీద సహించరాని అంక్షలు విధించే ప్రయత్నం చేసింది.  అలాంటి ఆంక్షల్లో ఒకటి కార్తేజ్ నగరాన్ని స్థానభ్రంశం చెయ్యడం. ఆ నగరం మొత్తం నేలమట్టం చేసి, ఆఫ్రికా తీరం నుండి దూరంగా మరో చోట నిర్మించాలన్నది రోమ్ కోరిక. కార్తేజ్ దాన్ని త్రోసిపుచ్చింది.

రోమ్ విన్నపాన్ని త్రోసిపుచ్చిందన్న నెపాన, క్రీ.పూ. 149 లో రోమ్ కార్తేజ్  మీద మరో సారి దాడి చేసింది. అదే మూడవ ప్యూనిక్ యుద్ధం అయ్యింది. కార్తేజ్ ఈ సారి ఆత్మరక్షణ కోసం కేవలం సైనిక బలగాల మీదే ఆధారపడితే సరిపోదని తెలుసుకుంది. నగరంలో సామాన్య పౌరులు కూడా అనేకరకాలుగా ఆ ఆఖరి పోరాటంలో పాల్గొన్నారు. వింటినారి కోసం నారీ శిరోజాలని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూడేళ్లపాటు జరిగిన ఆ కార్తేజ్ నగర ముట్టడికి అంతంలో క్రీ.పూ. 146లో కార్తేజ్ నగరం రోమన్ సేనల వశమయ్యింది. కార్తిజీనియన్ల మీద చిరకాల కక్ష తీర్చుకునే అదను దొరికింది. రోమన్ సేనలు ఆ మహానగరాన్ని ఇంచుమించు భూస్థాపితం చేశారు. నగర వాసులని ఊచకోత కోశారు. ఆ దారుణమారణ కాండలో సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అంచనా. బతికి బట్టకట్టిన 50,000 మంది బానిసత్వానికి బలయ్యారు. కార్తేజ్ రాజ్యం మొత్తం రోమన్ సామ్రాజ్యంలో విలీనమై ‘రోమన్ సామ్రాజ్యంలో ఆఫ్రికా భాగం’గా కొత్త పేరు తెచ్చుకుంది.

రోమన్ సామ్రాజ్యపు టెల్లలు ఇప్పుడు అమాంతంగా విస్తరించాయి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర తీర ప్రాంతాలెన్నో ఇప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలిశాయి. యూరప్ లోనే పశ్చిమాన ఆధునిక స్పెయిన్ లో ఒక భాగమైన ఐబీరియా కూడా కలిసింది. ఫ్రాన్స్ లో దక్షిణ భాగాలు కూడా రోమన్ ప్రాంతాలయ్యాయి. ఇక మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం మొత్తం ఎప్పుడో రోమన్ హయాం లోనికి వచ్చింది. రోమన్ ప్రభావం   తూర్పు దిశలో కూడా విస్తరించింది. మొత్తం రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత ఆ దశలో సుమారు 650,000 చదరపు కిమీలు ఉండేదని అని చారిత్రకుల అంచనా. అంటే ఇంచుమించు దక్షిణ భారత భూభగపు విస్తీరణతతో సమానం అన్నమాట.

అయితే రోమన్ సామ్రాజ్య విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు శాతాబ్దాల తరువాత, రోమన్ సామ్రాజ్యం మహర్దశను చేరుకున్న తరుణంలో, దాని విస్తీర్ణత ప్యూనిక్ యుద్ధాల అంతంలో ఉన్న విస్తీర్ణతతో పోల్చితే సుమారు పది రెట్లు పెరుగుతుంది. అయితే రాజ్యపు పొలిమేరలని అంత మేరకు విస్తరింపజేయాలంటే సైనిక నిర్వహణలో కొన్ని ముఖ్యమైన సంస్థాగత సంస్కరణలు జరగాలి.  ఆ సంస్కరణల వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పు వచ్చింది.

 (ఇంకా వుంది)







(ఇంకా వుంది)

Tuesday, October 22, 2019

రెండవ ప్యూనిక్ యుద్ధం


స్పెయిన్ ని అటకాయించాలంటే ఒక పద్ధతి మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశలో ప్రయాణించడం. కాని సముద్రం మీద కార్తేజ్ కి ఇప్పుడు  పట్టు లేకపోవడం వల్ల ఇక నేల మార్గాన స్పెయిన్ ని చేరుకోవాలి. దానికి ఒక్కటే మార్గం. ఆఫ్రికా ఉత్తర తీరం వెంట పశ్చిమ దిశగా ప్రయాణించాలి. జిబ్రాల్టర్ జల సంధి (Strait of Gibraltar) వద్ద ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండానికి చాలా సన్నిహితంగా వస్తుంది. ఆ జలసంధి వెడల్పు 14.2 కిమీ లు మాత్రమే. ఓడల మీద సేనలని ఆ జలసంధిని దాటించాలి.

జిబ్రాల్టర్ జలసంధికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత వుంది. అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ జలసంధి ఒక ముఖ ద్వారంలా ఉంటుంది. జలసంధికి ఇరుపక్కలా రెండు ఎత్తయిన రాతి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి అనాదిగా ‘హెర్క్యులిస్ స్తంభాలు’ అని పేరు చలామణిలో ఉంది. గ్రీకు, రోమన్ పురాణాలలో కథానాయకులు చేసే సముద్ర యాత్రలలో ఈ ‘హెర్క్యులిస్ స్తంభాల’ ప్రస్తావన ఎన్నో సార్లు వస్తుంటుంది.

ఆ విధంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన యాత్ర మీద తన సేనలని తరలించడం కోసం హమిల్కార్ సన్నాలు మొదలెట్టాడు. అప్పటికే కుర్రవాడైన హానిబల్ తను కూడా తండ్రితో వస్తానన్నాడు. రోమ్
 మీద పగ తీర్చుకోవాలన్న తన చిన్ననాటి కోరిక తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా తోచింది తనకి. తండ్రి ఒప్పుకున్నాడు గాని ఒక షరతు పెట్టాడు. కొడుకుతో ఈ విధంగా ప్రమాణం చేయించుకున్నాడు.

“… అగ్గిని, ఉక్కును ఒక్కటి చేసి రోమ్ భవితవ్యాన్ని బుగ్గి చేస్తాను”

అని తండ్రికి వాగ్దానం చేశాడు కొడుకు.

స్పెయిన్ మీద కార్తేజ్ చేసిన జైత్రయాత్రలు ఎన్నోఏళ్లపాటు సాగాయి. ఆ యుద్ధాలలో సుమారు క్రీ.శ. 228 లో హమిల్కార్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత అతడి అల్లుడు సేనలకి సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. కాని క్రీపూ. 221 లో అతడు హతమార్చబడ్డాడు. ఈ సారి కార్తేజ్ సేనలకి అధిపతి అయ్యే అవకాశం హానిబల్  కి దక్కింది. స్పెయిన్ ని గెలిచే కార్యభారం ఇప్పుడు కుర్రసేనాని  భుజాల మీద పడింది. సేనాని అయిన ఎనిమిది నెలలలోనే ఇన్నేళ్లుగా సాగిన యుద్ధానికి ఒక ముగింపు కనిపించింది. స్పెయిన్ హానిబల్ వశం అయ్యింది.

స్పెయిన్ చేజిక్కగానే హానిబల్ రోమ్ ని అటకాయించే సుముహూర్తం కోసం తహతహలాడాడు. మధ్యధరా సముద్ర ఉత్తర తీరం వెంట సేనలని ఇటలీ దిశగా నడిపించాడు. ఎముకలు కొరికే చలిలో సేనలు హిమావృతమైన పిరినీస్ పర్వతాలు దాటాయి. పలు పెద్ద పెద్ద నదులు దాటాయి. దారిలో ఎదురైన చిన్న చితక కిరాత జాతులని జయించి వారి విధేయతను సాధించాడు హానిబల్. 38,000 వేల కాల్బలంతో, 8,000  అశ్వబలంతో, 37 ఏనుగుల గజబలంతో కూడుకున్న తన మహాసైన్యాన్ని రోమ్  యొక్క ఉత్తర సరిహదుల దిశగా నడిపించాడు.

రెండవ ప్యూనిక్ యుద్ధం

దారిలో సేనలు ఎత్తయిన ఆల్ప్స్ పర్వత శ్రేణులని దాటవలసి వచ్చింది. అష్టకష్టాలు పడి పర్వతాలు దాటి ఉత్తర ఇటలీలోకి ప్రవేశించేసరికి తన సేనలలో మూడవ వంతు హరించుకుపోయాయి. అశ్వాలలో చాలా మటుకు నాశనమయ్యాయి. ఒక్కటే ఏనుగు మిగిలింది. అయినా హానిబల్ నిరుత్సాహపడలేదు. యుద్ధం మానుకునే ఆలోచనలని దరిజేరనీయలేదు. పైగా స్పెయిన్ ని గెలిచాక కొంత స్పానిష్ సైన్యం కూడా ఇప్పుడు తన సైన్యంతో కలిసింది. అంతే కాకుండా  రోమ్  చిరకాల శత్రువులైన గాల్ ప్రాంతీయులని కూడా తనతో చేతులు కలపమని ప్రోత్సహించాడు. రోమ్ మీద చావుదెబ్బ కొట్టే అదను కోసం గాల్ ప్రాంతం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలా అత్యంత శక్తివంతమైన, మిశ్రమ సైన్యంతో హానిబల్ రోమన్ సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దుల మీదకి దాడి చేశాడు.
శత్ర్రువు సత్తా ఏపాటిదో రోమన్ సెనేట్ అప్పటికే గుర్తించింది. ఆరు లిజియన్లు అంటే 30,000 మంది సిపాయిలతో కూడిన అదనపు బలగాలని హానిబల్ సేనలని అడ్డుకోవడానికి పంపింది. హానిబల్ పక్షానికి, రోమ్ పక్షానికి మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. రోమన్ సేనానులు ప్రభుత్వం చేత నియామకం అయిన మామూలు ఉద్యోగులు. పెద్దగా యుద్ధానుభవం లేని వాళ్లు. కాని హానిబల్ చిన్నతనం నుండి యుద్ధం రుచి మరిగినవాడు. పోరాటమే జీవితం అన్నట్టు పెరిగినవాడు. యుద్ధ భూమిలో ఏర్పడే పరిస్థితులకి వేగంగా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నడంలో ఆరితేరిన వాడు. శత్రువు బలహీనత ఎక్కడుందో గుర్తించి, సకాలంలో చర్యతీసుకుని చావుదెబ్బ కొట్టగల సూక్ష్మబుద్ధి గలవాడు. 

(ఇంకా వుంది)

Friday, October 11, 2019

ప్రతీకారానికి పథకం వేస్తున్న కార్తేజ్



నౌకలు అయితే సిద్ధం అయ్యాయి గాని, నావిక యుద్ధం లో శతాబ్దల అనుభవం గల కార్తిజీనియన్లని గెలిచేదెలా? రోమన్లకి తెలిసిందల్లా నేల మీద సాము మాత్రమే. నేల యుద్ధంలో తమకి సాంప్రదాయకంగా ఉన్న సత్తాని తెలివిగా వాడుకుంటూ, నౌకాయుద్ధంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు రోమన్లు. శత్రునౌకకి అల్లంత దూరం నుండి బాణాలు, బల్లేలు విసరడం పాతపద్ధతి. అందుకు భిన్నంగా ఏకంగా శత్రునౌకకి ఆనుకునేటంత పక్కగా వెళ్లి, పొడవాటి పలకలని వంతెనలుగా పరిచి, తమ నౌక నుండి శత్రునౌక మీదకి నడిచి వెళ్లి, అక్కడ శత్రు నౌక లో ‘నేల మీద సాము’ చెయ్యడం కొత్త పద్ధతి. శత్రుసైనికుడికి ఎదురెళ్లి బారైన కత్తితో, నిలువెత్తు డాలుతో విరుచుకుపడే రోమన్ యోధుడికి ఎదురునిలువగల శత్రుసిపాయిలు అరుదు.

కార్తేజ్ మీద రోమ్ దండయాత్రలు మొదలయ్యాయి. ఇరవై మూడు ఏళ్ల పాటు సాగిన సంకుల సమరానికి అంతంలో, క్రీ.పూ. 241 లో రోమ్ కార్తేజ్ మీద మొట్టమొదటి విజయాన్ని సాధించింది. సిసిలీ, సార్డీనియా దీవులు రోమ్ హస్తగతం అయ్యాయి. ఆఫ్రికా తీరం ఇంకా అందిరాలేదు. కార్తేజ్ సామ్రాజ్యపు ఖజానా మొత్తం ఊడ్చి ఇమ్మని కార్తేజ్ సామ్రాట్టుతో బలవంతంగా ఒప్పందం రాయించుకున్నారు రోమన్లు. ఆ విధంగా మొదటి ప్యూనిక్ యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

రెండవ ప్యూనిక్ యుద్ధం

శతాబ్దాల వైభవం చూసిన కార్తేజ్ కి ఆ పరాభవం భరించరానిది అయ్యింది. కార్తేజ్ కి జరిగిన అవమానాన్ని, రోమ్ కార్తేజ్ ని కొల్లగొట్టిన తీరుని ఒక పిల్లవాడు చూశాడు. వాడి రక్తం ఉడికిపోయింది. ప్రతీకారపు రవ్వలు రాజుకున్నాయి. కార్తేజ్ కి చెందిన ఒక సేనాని కొడుకు ఆ పిల్లవాడు. వాడి పేరు హానిబల్ (Hannibal).

హానిబల్ తండ్రి పేరు హమిల్కార్.  మొదటి ప్యూనిక్ యుద్ధలో  అతగాడు కార్తేజ్ సేనలకి సర్వసేనానిగా ఉండేవాడు. కార్తేజ్ ఓటమికి తనదే బాధ్యత అన్న భావన అతణ్ణి దొలిచేయసాగింది. సిసిలీ, సార్డీనియా దీవులని కోల్పోయిన కార్తేజ్ కి మధ్యధరా సముద్ర ప్రాంతాలలో పట్టు సడలింది. ఆ సముద్ర ప్రాంతాల్లో రోమన్ నౌకా దళాలు గస్తీ తిరుగుతుంటాయి. వాటితో తలపడేటంత నౌకాబలం ఇప్పుడు కార్తేజ్ కి లేదు.

ఆఫ్రికా తీరం మీద మాత్రం కొంత భూభాగం మిగిలింది. ఎలాగైనా మళ్లీ సేనలని పోగుచేసి పోయిన భూభాగాలని మళ్లీ రోమ్ చేతుల నుండి వశం చేసుకోవాలి. ఇలా ఆలోచించిన హమిల్కార్ దృష్టి ఉత్తరాన ఉన్న హిస్పానియా (నేటి స్పెయిన్) మీద పడింది.

స్పెయిన్ కి రోమ్ కి మధ్య చిరకాల శత్రుత్వం వుంది. స్పెయిన్  ని గెలవడం అంత కష్టం కాదు. స్పెయిన్ కార్తేజ్ పక్కకి వస్తే, అలాగే కాస్త తూర్పుగా ఉన్న గాల్ ని కూడా తన పక్కకి తిప్పుకుంటే, రోమ్ మీద విజయావకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యూహంతో హమిల్కార్ స్పెయిన్ మీద దండయాత్రకి సేనలని సిద్ధం చేశాడు.

(ఇంకా వుంది)