Themes from World History

Themes from World History

Monday, November 14, 2016

ప్రాచీన లోకంలో ఖగోళశాస్త్రం





ఈ ఏడాది తొలి నెలలలో నేను రాసిన 'ఖగోళ శాస్త్ర చరిత్ర' అన్న పుస్తకం వెలువడింది. అందులో ప్రాచీన లోకంలో ఖగోళశాస్త్ర అనే అధ్యాయం గురించి ఎంతో సమాచారం సేకరించాను. (అసలు ఆ ప్రయత్నంలోనే ప్రపంచ చరిత్ర గురించి ఆసక్తి కలిగింది.) ఆ అధ్యాయాన్ని ఇక్కడ సీరియల్ గా ఇస్తున్నాను.
- శ్రీనివాస చక్రవర్తి



  ప్రాచీన లోకంలో ఖగోళశాస్త్రం


ఎన్నో ప్రాచీన సంస్కృతులలో కచ్చితమైన ఖగోళ విజ్ఞానం ఉండేదనడానికి దాఖలాలు ఉన్నాయి. ప్రాచీన భారతం లో, ప్రాచీన ఈజిప్ట్ లో, మధ్య అమెరికాలోని ప్రాచీన మాయన్ సంస్కృతిలో, సుమేరియా,  అరేబియా, చైనా మొదలైన ప్రాంతాలు అన్నిట్లోను ఎంతో ఖగోళ విజ్ఞానం సహస్రాబ్దాల క్రితమే వాడుకో ఉండేది.  (అయితే మన దేశంలో ప్రాచీన ఖగోళవిజ్ఞానం  ఉండేదన్న భావనవేదాల్లో అన్నీ ఉన్నాయిషఅనే జడమైన ఆత్మసమర్ధింపు కోసం తప్పుగా వాడుకోవడం తరచు జరుగుతుంది.  అలాంటి భావన వర్తమానంలో అభ్యుదయానికి అడ్డుపడుతూ ఉంటుంది.)

  ప్రాచీన లోకంలో ఎంతో ఖగోళవిజ్ఞనం ఉన్నప్పుడు మరి కేవలం కొన్ని శతాబ్దాల కాలం క్రితం యూరప్ లో కోపర్నికస్  తదితరులు కొత్తగా పునాదులు వేసిన ఖగోళ విజ్ఞానం ఏమిటి? ప్రాచీనులకి తెలిసిందీ, ఇటీవల కాలంలో మళ్లీ కొత్తగా పుట్టింది ఒకటేనా? అంటే సుదీర్ఘమైన మానవ చరిత్రలో ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ కనుక్కుంటూ, మళ్లీ మళ్లీ మర్చిపోతూ వస్తున్నామా? ఇదే నిజమైతే వైజ్ఞానిక చరిత్రకి ఒక దిశ, గమ్యం లేనట్టు కనిపిస్తుంది. అపరిచిత భూమికలో  గుడ్డివాడి నడకలా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. తన తోకను తాను కొరుక్కుంటున్న కుక్కలా గిరికీలు కొడుతున్నట్టు కనిపిస్తుంది.

ప్రాచీన ఖగోళవిజ్ఞానం అన్నప్పుడు దానికి, ఆధునిక ఖగోళ విజ్ఞానానికి మధ్య చాలా మౌలికమైన భేదం వుందని గుర్తుంచుకోవాలి. తేడా కేవలం వివరాలలో మాత్రమే లేదు. ఉదాహరణకి ప్రాచీనులకి కంటికి కనిపించే ఐదు గ్రహాలు మాత్రమే తెలుసు. ఆధునికులకి కంటికి కనిపించని మరి రెండు గ్రహాలు (యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు, ప్లూటోని మినహాయిస్తే), కోకొల్లలుగా లఘుగ్రహాలు (minor planets)  తెలుసు. ప్రాచీనులకి పట్టున వెయ్యి తారలకి మించి తెలియవు. ఆధునిక యుగంలో మనం 400 కోట్ల తారలని గుర్తించగలిగే స్థితిలో వున్నాం. ఇలాంటి సంఖ్యాత్మక భేదాలు మాత్రమే కాక మూలంలో, తాత్వికంగా కూడా విశ్వం పట్ల ఆధునిక అవగాహనకి, ప్రాచీనుల అవగాహనకి మధ్య చాలా లోతైన తేడా వుంది.

పందొమ్మిదవ శతాబ్దపు చివరి దశలో  ప్రాచీన ఖగోళ వైజ్ఞానిక వ్యవస్థలని, ముఖ్యంగా ఈజిప్ట్, యూరప్ ప్రాంతాలలో చలామణి అయిన ప్రాచీన ఖగోళ శాస్త్రాలని క్షుణ్ణంగా చదివిన సర్ నార్మన్ లోక్యర్ అనే బ్రిటిష్ ఖగోళవేత్త ఖగోళ శాస్త్ర చరిత్రలో ప్రాచీన ఖగోళశాస్త్ర పరిణామ క్రమాన్ని మూడు దశలుగా విభజిస్తాడు. Dawn of Astronomy  అనే పుస్తకంలో దశలని వివరంగా వర్ణిస్తాడు. వీటిలో మొదటిది   ఆరాధనా దశ. ఇందులో ఖగోళాన్ని ఏదో మానవాతీతమైన దివ్యధామంగా పరిగణించడం జరుగుతుంది. ఆకాశమంతటా దేవతలు కొలువై వున్నట్టు భావించడం జరుగుతుంది. ఖగోళంలో జరిగే సంచలనాత్మక సంఘటనలు దేవతల హెచ్చరికల గాను, దండన గాను అన్వయించుకోవడం జరుగుతుంది. ఖగోళంలో కనిపించే వస్తువులకి దేవతల పేర్లు పెట్టి వాటిని ఆరాధించడం జరుగుతుంది.

రెండవ దశ లో ఖగోళ విజ్ఞానాన్ని  సామాన్య జీవన ప్రయోజనాల కోసం వాడుకోవడం జరుగుతుంది. వ్యవసాయం, నౌకాయానం మొదలైన రంగాలలో ఖగోళ విజ్ఞానాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. విత్తులు ఎప్పుడు చల్లాలి, నాట్లు ఎప్పుడు పెట్టాలి మొదలైనవి తారాస్థానాల బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అలాగే తారా స్థానాల బట్టి గుర్తులు లేని ప్రదేశాల్లో, ఎడారుల్లో, సముద్రాలలో, చీకట్లో దారి తెలుసుకోవడం జరుగుతుంది.  (తారా స్థానాల బట్టి మనుషులే కాక వలసపోయే పక్షులు కూడా కొన్ని వందల, వేల మైళ్ల దూరాలు దారి తప్పికోకుండా వలస పోగలుగుతున్నాయని తెలిపే ప్రయోగాలు ఎన్నో జరిగాయి.) ఇక ఖగోళ విజ్ఞానం యొక్క మరో ముఖ్యమైన లౌకిక ప్రయోజనం కాలమానం. సూర్య, చంద్రుల, గ్రహాల, తారల చలనాల బట్టి కాలాన్ని క్షణాలు, ఘడియలు, దినాలు, వారాలు, పక్షాలు, ఏళ్లు, శతాబ్దాలు ఇలా విభజిస్తూ కాలాన్ని కొలిచే సాంప్రదాయం ఎన్నో ప్రాచీన సంస్కృతులలో కనిపిస్తుంది.

ప్రాచీన లోకంలో ఖగోళ విజ్ఞానం యొక్క సామాన్య లౌకిక ప్రయోజనాల గురించి చెప్పుకున్నప్పుడు   ప్రయోజనాలలో మరో విచిత్రమైన ప్రయోజనం కూడా కనిపిస్తుంది. ఇంచుమించుగా ప్రాచీన సంస్కృతులు  అన్నిట్లోను ఖగోళ వస్తువులకి మానవ జీవితం మీద ప్రభావం వుందన్న విచిత్రమైన విశ్వాసం కనిపిస్తుంది. ఆధునిక దృష్టిలో ఇది పూర్తిగా అశాస్త్రీయమైన భావన అని గుర్తుంచుకోవాలి.  భావన నుండి పుట్టిందే జ్యోతిష్యం (astrology). ఇంచుమించు ప్రపంచం అంతటా ఎన్నో రూపాల్లో, ఏదో ఒక రకమైన జ్యోతిష్యం  వాడుకలో వుంది. సహస్రాబ్దాల చరిత్ర గల ఖగోళ శాస్త్ర పరిణామంలో కొన్ని శతాబ్దాల క్రితం వరకు కూడా జ్యోతిష్యానికి, ఖగోళ శాస్త్రానికి తేడా లేదన్నట్టుగా మనుషులు వ్యవహరించేవారు. కాని ఆధునిక యుగంలో సమస్యలేదు. జ్యోతిష్యం శాస్త్రీయ ఆధారమూ లేని ఆచారం, కుహనా విజ్ఞానం (pseudoscience). ఖగోళశాస్త్రం (astronomy) ప్రయోగమనే గీటు రాయి మీద పదే పదే పరీక్షించబడి పరిపూర్ణం గావింపబడే వైజ్ఞానిక విభాగం. (మన సమాజంలో సామాన్యుల మనసుల్లో తేడా అంత స్పష్టంగా ఉన్నట్టు కనిపించదు. ఖగోళశాస్త్ర విషయాలని, జ్యోతిష్యానికి చెందిన విషయాలని కలగాపులగంగా కలిపి మీడియాలో వ్యక్తులు మాట్లాడడం తరచు కనిపిస్తుంది. శాస్త్రీయ దృష్టితో చూస్తే ఇవి అవాంఛనీయమైన ఒరవడులు.)

మూడవ దశలో లౌకిక ప్రయోజనాలతో సంబంధం లేకుండా, దేవతల, దెయ్యాల ప్రసక్తి లేకుండా, కేవలం జ్ఞానం పట్ల ఆసక్తితో, తెలుసుకోవాలన్న కుతూహలంతో ఖగోళ శోధనలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రాచీన సంస్కృతులలో ఖగోళవిజ్ఞానం మూడవ దశ ఆరంభంలో ఆగిపోయినట్టు కనిపిస్తుంది.
 

(ఇంకా వుంది)

No comments:

Post a Comment