Themes from World History

Themes from World History

Sunday, November 24, 2019

సైనిక సంస్కరణలు చేపట్టిన మారియస్



మారియస్ కృషి వల్ల రోమన్ సైన్యం మళ్లీ పెరిగింది. అట్టడుగు వర్గాలకి చెందిన వారిని సైన్యంలో చేర్చుకోవడమే కాక,  వారికి సొంత భూములు ముట్టజెప్పే ఏర్పాట్లు కూడా చేశాడు. సేనలు  ఓ కొత్త రాజ్యాన్ని జయించినప్పుడు ఆ రాజ్యంలో కొంత భూమిని దాన్ని జయించిన సిపాయిలకి అందేలా విధివిధానాలు రూపొందించాడు. “ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి?” అని సిపాయిలు తమని తాము వేసుకునే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది. భూమితో పాటు అంతో ఇంతో పారితోషకం కూడా దక్కేది. సకాలంలో జీతభత్యాలు అందజేయడమే కాకుండా, ఉద్యోగ విరమణ చేశాక పింఛను వచ్చే ఏర్పాట్లు కూడా చేశాడు. ఇలాంటి సంస్కరణల వల్ల సైనిక వృత్తి ఒక ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వృత్తిగా ఎదిగింది.

మారియస్ చేపట్టిన ఈ సైనిక సంస్కరణల పర్యవసానం కేవలం పేదవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో ఆగిపోలేదు. దాని వల్ల అసలు రోమన్ సమాజంలోనే ప్రగాఢమైన విప్లవం బయల్దేరింది.
గయస్ మారియస్ (తైలవర్ణ చిత్రం - కళాకారుడు జాన్ వాండర్లిన్)









ఈ కొత్త సైనిక వ్యవస్థలో, సిపాయిలకి కొత్త వరాలన్నీ ప్రసాదించేవాడు సేనాపతి. జీతాలు ఇచ్చేవాడు, కూడు, గుడ్డ, నీడ ప్రసాదించేవాడు, పింఛను మంజూరు చేసేవాడు అయిన సేనాపతి ఈ కొత్త పద్ధతిలో సైనికుల పాటి దైవంగా చలామణి అయ్యాడు. వెనకటి వ్యవస్థలో బలం అంతా సెనేట్ చేతుల్లో ఉండేది. ఈ కొత్త వ్యవస్థలో ఆ బలం యొక్క కేంద్ర స్థానం సైన్యం వైపుగా, సేనాపతుల వైపుగా మళ్లింది. ఒకప్పుడు సెనేట్ మీద సేనాపతులు ఆధారపడేవారు. ఇప్పుడు మొత్తం సైనిక బలాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సేనాపతుల మీదే సెనేట్ సభ్యులు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బలాల సమతూనికలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

రోమన్ పాలనా వ్యవస్థ యొక్క బలకేంద్రాన్ని సెనేట్ నుండి సైనిక దళాల వైపుగా మళ్లించే ఒరవడికి నాంది పాడినవాడు సేనాపతి గయస్ మారియస్ అయితే, ఆ ఒరవడికి ఎంత భయంకరమైన పర్యవసానాలు ఉంటాయో ప్రదర్శించి చూపించిన మరో సేనాపతి ఉన్నాడు. అతడి పేరు లూసియస్ కోర్నీలియస్ సల్లా.

క్రీ.పూ. 138 లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సల్లా, యవ్వనంలో సైనిక దళంలో చేరాడు. ధైర్యపరాక్రమాలు గలవాడు కావడంతో వేగంగా సైనికదళంలో ఎదిగి మారియస్ యొక్క ఉపసేనాపతులలో ఒకడయ్యాడు.

క్రీ.పూ. 112–106  దరిదాపుల్లో రోమ్ కి ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతమైన నుమీడియా రాజ్యాన్ని పాలించే జుగర్తా అనే రాజుతో వైరం ఉండేది.  ఆ కాలంలో సేనాపతిగా ఉన్న గయస్ మారియస్ కి జుగర్తాకి మధ్య జరిగిన యుద్ధాలలో సల్లా ముఖ్యపాత్ర పోషించాడు. నుమీడియా కి పొరుగురాజ్యమైన మారిటానియా ని ఆ కాలంలో బోకస్ అనే రాజు పాలించేవాడు. బోకస్ సహాయపడితో జుగర్తాని వశం చేసుకోవడం సులభం అని సల్లా గుర్తించాడు. ఒడుపుగా దౌత్యం నడిపి రోమ్ పట్ల కొద్దోగొప్పో సుముఖత గల బోకస్ రాజుని తమ వైపుకి తిప్పుకున్నాడు. బోకస్ ప్రమేయం వల్ల జుగర్తాని వశం చేసుకోవడానికి వీలయ్యింది. ఆ విధంగా జుగర్తా మీద యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

యుద్ధం గెలిచిన ఘనత అంతా తనదేనని సల్లా రోమ్ లో చాటుకోవడం మొదలెట్టాడు. దాంతో ఒళ్లు మండిన మారియస్ తన ప్రియతమ ఉపసేనాపతికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఆ అదను కోసం ఎదురుచూడసాగాడు.


(ఇంకా వుంది)

No comments:

Post a Comment