Themes from World History

Themes from World History

Thursday, July 23, 2020

"చిరాయువులు - ప్రాచీన రోమన్ చరిత్ర" - కొత్త పుస్తకం

బ్లాగర్లకి నమస్కారం.

రోమన్ సామ్రాజ్య చరిత్ర మీద మొదలెట్టిన ధారావాహిక అర్థాంతరంగా ఆగిపోవడం కొంతమందికి చిరాకు కలిగించవచ్చు.
బ్లాగ్ లో రాయకపోయిన రచన మాత్రం కొనసాగించాను. ఆ ప్రయత్నం పూర్తయ్యి ఈ మధ్యన పుస్తక రూపం దాల్చింది.

ఆ పుస్తకం పెరు "చిరాయువులు - ప్రాచీన రోమన్ చరిత్ర" . దీన్ని మంచి పుస్తక్రం ప్రచురణలు ముద్రించారు.

పుస్తకానికి ముందు మాట కింద ఇస్తున్నాను.




ముందుమాట

చిన్నప్పుడు బళ్లో చదువుకునేటప్పుడు చరిత్ర అంటేనే భయపడి పారిపోయే పిల్లల్లో నేనూ ఒక్కణ్ణి. ‘పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగెను?’, ‘అశోకుడు ఎప్పుడు పుట్టెను?’ వంటి నిరర్థక సమాచారాల సమాహారంలా కనిపించేది చరిత్ర. చదవాలంటే ఏవగింపు కలిగేది. మరో విషయం ఏమిటంటే చరిత్ర యొక్క ప్రాముఖ్యత అర్థం కావాలంటే కొంత జీవితానుభవం కావాలేమో. ఆ కారణం చేత కూడా ఆ రోజుల్లో చరిత్ర అంతగా మింగుడు పడకపోయి ఉండొచ్చు.
కాని గత కొన్నేళ్లుగా నెమ్మదిగా మనసు చరిత్ర మీదకు మళ్లింది. వృత్తిరీత్యా శాస్త్రరంగంలో ఉండడం చేత  సైన్స్ రచనలోకి ప్రవేశించాను. దశాబ్దం పైగా రంగంలో కృషి చేస్తూ  వస్తున్నాను. ఆ ప్రయత్నంలో సైన్స్ చరిత్ర మీద కూడా దృష్టి సారించాను. ఒక వైజ్ఞానిక రంగం గురించి చెప్పేటప్పుడు, వర్తమాన కాలంలో అందులో భావజాలం ఎలా వుందో వర్ణించడం ఒక పద్ధతి. సామాన్యంగా పాఠ్యపుస్తకాలు ఆ పద్ధతిని అనుసరిస్తాయి. కాని ఒక వైజ్ఞానిక రంగంలో ఆది నుండి భావాలు ఎలా పరిణతి చెందుతూ వచ్చాయో తెలుసుకున్నప్పుడు ఆ రంగాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోడానికి వీలవుతుంది.
వైజ్ఞానిక చరిత్ర గురించి చదువుతున్నప్పుడు భావ పరిణామ క్రమం తెలియడమే కాకుండా ఆ ఆవిష్కరణలు జరుగుతున్న కాలంలో సామాజిక నేపథ్యం గురించి కూడా తెలుస్తుంది.
        ‘ఖగోళశాస్త్ర చరిత్ర’ అనే పుస్తకం రాయడం కోసం చేసిన పరిశోధనలో  ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాను. ఉదాహరణకి గ్రహగతుల గురించి శోధించిన యోహానెస్ కెప్లర్ జీవితాంతం నిరుపేదగానే జీవించాడు. వివిధ క్రయిస్తవ మత వర్గాల మధ్య నిరంతరం ఘర్షణ చెలరేగే నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ, ఒక పక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తూనే మరో పక్క తన అద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణలు చేశాడు. ఈ రోజుల్లో చాలా మంది వైజ్ఞానిక రంగంలో సరైన ‘ఫండింగ్’ (ధనసహాయం) లేక ఉన్నత స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నామని వాపోతూ ఉంటారు. అలాంటి వాదనలు కేవలం కుంటిసాకులు మాత్రమేనని కెప్లర్ వంటి వారి జీవితాలు చూస్తే అర్థమవుతుంది.


 ‘ఖగోళశాస్త్ర చరిత్ర’ లో నాకు నిజంగా కనువిప్పు కలిగించిన మరి కొన్ని విషయాలు ఉన్నాయి. “ప్రాచీన లోకంలో ఖగోళ శాస్త్రం” అనే అధ్యాయంలో ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి చెందిన ప్రాచీన సంస్కృతులలో ఖగోళవిజ్ఞానం ఏ స్థాయిలో ఉండేదో చర్చించడం జరిగింది. కొన్ని సహస్రాబ్దాల చరిత్ర గల భారతంలో కొన్ని వేల ఏళ్లుగా ఖగోళ విజ్ఞానం ఉందంటే ఆశ్చర్యం లేదు. కాని ప్రాచీన చైనా, ప్రాచీన అరేబియా, ప్రాచీన గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ సంస్కృతులలో కూడా విస్తృతమైన ఖగోళవిజ్ఞానం ఉందని తెలిసి ఆశ్చర్యం కాలిగింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన మరో విషయం. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ భాగాన పాలినేషియా అనే ప్రాంతంలో కొన్ని వేల దివులు చెదురుమొదురుగా విస్తరించి వుంటాయి. అక్కడ కూడా కొన్ని వేల ఏళ్లుగా ఎంతో పరిణతి చెందిన ఖగోళ సాంప్రదాయం ఉందట! మరి ఒక దీవి నుండి మరో దివికి మహాసముద్రం మీద పయనించాలంటే కొండలు, నదులు వంటి కొండగుర్తులేవీ ఉండవు. కేవలం నక్షత్రాల బట్టి, గ్రహస్థానాల బట్టి దారి తెన్నులు తెలుసుకోవలసి ఉంటుంది. నక్షత్ర గ్రహ స్థానాల విజ్ఞానాన్ని వాళ్లు కవితల రూపంలో కూర్చి, మౌఖికంగా కొన్ని సహస్రాబ్దాలుగా పై తరం నుండి కింది తరాలకి చేరవేస్తూ వస్తున్నారు. అది విన్నప్పుడు మన చరిత్ర పట్ల, అన్య ప్రాంతాల చరిత్ర పట్ల అంతవరకు నాలో గూడుకట్టుకున్న భావజాలం అంతా పునాదుల వద్ద కదిలినట్టు అయ్యింది.

సమకాలీన ప్రపంచ రాజకీయ వేదిక మీద పెద్దగా పాత్ర వహించని పాలినేషియా వంటి ప్రాంతంలో కూడా ప్రాచీనవైజ్ఞానిక చరిత్ర ఉన్నప్పుడు మరి భూమి మీద ప్రాచీన చరిత్ర లేని ప్రాంతం ఏది? భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైన సంస్కృతి అని,  ఆ ప్రాచీనతే మన ప్రత్యేకత అని భారతీయులుగా మనం నమ్ముతాము. బళ్లో పాఠాల ద్వార, రాజకీయనాయకుల ప్రసంగాల ద్వార, బామ్మలు పసిపిల్లలకి చెప్పే కథల ద్వార ఆ సందేశాన్నే పరిపరి విధాల మనం వింటుంటాము. భారతీయ జీవన దృక్పథంలో ప్రాచీనత ఒక అత్యంత విలువైన లక్షణం. ఎంత ప్రాచీనమైతే అంత గొప్ప! ఆ కారణం చేతనే కాబోలు దక్షిణాదికి చెందిన భాషలు (తమిళం, కన్నడం, తెలుగు) హోరాహోరిగా పోరి ప్రాచీన భాష హోదాని గెలుచుకున్నాయి. 

అయితే ప్రాచీనత అనేది సాపేక్షమైన విలువ. ఒకటి ప్రాచీనం అనేటప్పుడు, దేని కన్నా ప్రాచీనం అన్న ప్రశ్న వస్తుంది. మనం ప్రాచీనులం అనుకున్నప్పుడు తక్కిన సంస్కృతులు అంత ప్రాచీనం కావు అని అనుకోవలసి వస్తుంది. అలాంటి ఆలోచనాధోరణి, అలాంటి విశ్వాసం మన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో కొట్టొచ్చినట్టు చెప్పే ఒక అనుభవం నా మీద గాఢమైన ముద్ర వేసింది.

2017 లో చెన్నై జల్లికట్టు ఉద్యమం జరిగింది. తమిళుల సాంప్రదాయక క్రీడ అయిన జల్లికట్టుని సుప్రీమ్ కోర్టు నిషేధించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి నిరసన తెలియజేస్తూ లక్షలాది మంది మెరీనాలో పోగై ఉద్యమించారు. ఆ సందర్భంలో సి.ఎన్.ఎన్. టీవీ చానెల్ రిపోర్టర్ జక్కా జేకబ్ అక్కడి వారిని ఇంటర్య్వూ చేస్తూ “ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు?” అని అడిగాడు. అప్పుడు ఉద్యమకారులలో ఒక వ్యక్తి జేకబ్ మైకు లాక్కుంటూ అన్నాడు “రెండు వేల ఏళ్ల క్రితం, తక్కిన ప్రపంచం అంతా అనాగరికంగా, నగ్నంగా అడవులు పట్టి తిరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ గొప్ప నాగరికత విలసిల్లేది. అలాంటి నాగరికతను అణచివేస్తున్నందుకు నిరసిస్తున్నాం…”
పైన మాట్లాడిన వ్యక్తి ఆ ప్రాచీనతను భారతీయులు అందరికీ ఆపాదిస్తున్నాడా, కేవలం మరి తమిళులకే ఆపాదిస్తున్నాడా అన్నది స్పష్టంగా లేదు. ఏదేమైనా అతడి మాట్లల్లో పైన చెప్పుకున్న భావమే ధ్వనిస్తోంది – “మనది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన  సంస్కృతి. మనకున్నంత గొప్ప నాగరికత మరెక్కడా లేదు.”

 పైన ఆ విప్లవకారుడు అన్న మాటలు పూర్తిగా వాస్తవ విరుద్ధం అనడానికి పెద్దగా చరిత్ర తెలియనక్కర్లేదు. రెండు వేల ఏళ్ల క్రితం, అంటే క్రీశ 0 అనుకుంటే, అప్పటికే రోమన్ సామ్రాజ్యం ఏడు శతాబ్దాల చరిత్రని చూసింది. రోమన్లకి ముందు ఎట్రుస్కన్లు, వారికి ముందు గ్రీకులు, ఇంకా వెనక్కు క్రీపూ మూడు నాలుగు వేల ఏళ్లు వెనక్కి పోతే అసీరియన్లు, మెసొపొటేమియన్లు, ఇంకా వెనక్కు పోతే ఈజిప్షియన్లు… అన్నిటి కన్నా ప్రాచీన నాగరికత ఏది అన్న ప్రశ్నకి సమాధానం తేల్చుకోడానికి మన అజ్ఞానమే అవరోధం అనిపిస్తుంది.

మరి అజ్ఞానం తొలగాలంటే ఆధారాలు కావాలి. అంటే వస్తుగత దృష్టితో శాస్త్రీయంగా శోధిస్తూ ఆధారాలు రాబట్టాలి. కాని మన దేశంలో వస్తుగత దృష్టి, శాస్త్రీయత, హేతువుతో కూడుకున్న వివేచన మొదలైన పదజాలానికి ఆదరణ తక్కువ. నమ్మకాలు, భావావేశాలు ఇవే మన జీవితాలని నడిపించే అధిష్టాన దేవతలు. కేవలం గుడ్డి నమ్మకం మీద, భావావేశం మీద నడిచే జీవన గతి కల్లోలమయంగా ఉంటుంది. వస్తుగత దృష్టి, శాస్త్రీయత అనే శక్తులు ఆ గతికి పటుత్వాన్ని, స్థిరతని ఇస్తాయి. వ్యక్తి విషయంలోనే కాక, సమిష్టి విషయంలో కూడా ఆ సూత్రమే వర్తిస్తుంది.

కాబట్టి భారతీయులుగా మనకి మన సమాజం గురించి, మన గతం గురించి, మన ప్రాచీనత గురించి సరైన అవగాహన కలగాలంటే, తక్కిన ప్రపంచం గురించి, ఇతర జాతుల గతాన్ని గురించి, అంతో ఇంతో అవగాహనని పెంపొందించుకోవాలి. తక్కిన ప్రపంచం గురించి మరింత లోతుగా తెలిసినప్పుడు బావిలో కప్పలాంటి మన దుస్థితి నుండి బయటపడ గలుగుతాము. కాబట్టి తక్కిన ప్రపంచం గురించి అవగాహనని అందించే సాహిత్యాన్ని సృష్టించాలి.

తెలుగులో ప్రపంచ సాహిత్యం మీద ఎంత సమాచారం ఉంది అని తెలుగు సాహితీవేత్తలైన  కొందరు మిత్రుల వద్ద వాకబు చేశాను. ఇంగ్లీష్ లో ప్రపంచ చరిత్ర మీద ఒక సాహితీ సముద్రమే ఉంది. మచ్చుకి చెప్పాలంటే కేవలం రెండవ ప్రపంచ యుద్ధం మీదనే 24 వాల్యూముల విజ్ఞానసర్వస్వం (Encyclopedia) వుంది. అది కాక కేవలం రెండవ ప్రపంచ యుద్ధం అనే అంశం మీద వందల, వేల సంఖ్యలో పరిశోధనా పుస్తకాలు, నవళ్లు, కామిక్ లు  ఉంటాయి. అవి గాక సినిమాలు, డాక్యుమెంటరీలు, టీవీ సీరియళ్లు మొదలైనవి. కాని తెలుగులో నేను వాకబు చేసినంత మేరకు ప్రపంచ యుద్ధం మీద ఒక్క పుస్తకం కూడా ఉన్నట్టు సమాచారం లేదు.  అరకొరగా నాలుగు పుస్తకాలు తప్ప అన్ని ముఖ్యమైన అంశాల మీద, అజ్టెక్ ల నుండి అసీరియన్ల దాకా, వైకింగ్ ల నుండి విసిగోథ్ ల దాకా ప్రపంచంలో ప్రతీ జాతి గురించి, ప్రతీ నాగరికత గురించి సమగ్రంగా, సువిస్తారంగా రాయబడ్డ సాహిత్యం తెలుగులో లేదనే చెప్పాలి.

ఈ వెలితి తెలుగులో మాత్రమే వుందా, తక్కిన భారతీయ భాషల గతి కూడా ఇలాగే వుందా అన్న ప్రశ్నకి నా వద్ద జవాబు లేదు. ఏదేమైనా ఈ వెలితి సహించరాని వెలితి. తెలుగు ప్రాచీనమైన భాషా కాదా అన్న ప్రశ్న నా ఉద్దేశంలో అంత ముఖ్యమైన ప్రశ్న కాదు. కాని తెలుగు మంచి భవిష్యత్తు గల భాషా కాదా అన్నది తేలవలసిన అసలు ప్రశ్న. ఏ భాషైనా మంచి భవిష్యత్తు ఉండాలంటే  అందులో విస్తారంగా సమాచారం, విజ్ఞానం ఉండాలి. ఈ సందర్భంలో ప్రపంచ చరిత్ర గురించిన సాహిత్యం విస్తారంగా ఉండాలి అనిపిస్తుంది.

అలా ఆలోచిస్తుంటే నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆలోచన కన్నా దాన్ని కల అనాలేమో. చరిత్ర బాగా తెలిసిన వాళ్లు ఓ పది మంది కలిసి తలా ఒక ప్రాంతాన్ని తిసుకుని మనకి తెలిసినంత మేరకు, మానవ నాగరికత ఆవిర్భవించిన తరుణం నుండి  నేటి వరకు ప్రపంచ చరిత్ర ని విపులంగా 10,000  పేజీల పరిమాణంలో అనేక సంపుటాలుగా తెలుగులో రాస్తే ఎంత ఘనంగా ఉంటుంది! తెలుగు సాహిత్యం మీద అలాంటి పరిణామం గాఢమైన ముద్ర వేస్తుంది. అలాంటి చారిత్రక సాహిత్యం ఎన్నో ఇతర రంగాల్లో గొప్ప సృజనకి హేతువు కాగలదు. చరిత్ర నుండి స్ఫూర్తి తీసుకుని, చారిత్రక ఘట్టాలని నమూనాలుగా చేసుకుని, కుప్పలు తెప్పలుగా నవళ్ళు, కథలు, నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లు పుట్టుకొస్తాయని పిస్తుంది.

ఇటీవలి కాలంలో అలాంటి నిదర్శనాలు లేకపోలేదు. స్టార్ వార్స్ కథలకి స్ఫూర్తి జపనీస్ సమూరాయ్ ల గాధలేనని అంటాడు ఆ సినిమాల సృష్టికర్త, హాలీవుడ్ డైరెక్టర్ జార్జ్ లూకాస్. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఐసాక్ అసిమోవ్ ‘Foundation’ అనే పేరు మీద ఆరు సంపుటాలు గల నవలా మాలిక రాశాడు. అందులో కొన్ని వేల సంవత్సరాలు భవిష్యత్తులో మానవజాతి మొత్తం పాలపుంత గెలాక్సీ అంతటా వ్యాపించి ఒక విశాల విశ్వసామ్రాజ్యాన్ని స్థాపించినట్టు ఊహించి రాస్తాడు. విస్మయం కలిగించే అలాంటి ఊహాగానానికి స్ఫూర్తి  బ్రిటిష్ రచయిత ఎడ్వర్డ్ గిబన్ రాసిన రోమన్ చరిత్ర నుండీ వచ్చిందంటారు వ్యాఖ్యాతలు.   ఇటీవల బాగా విజయవంతం అయిన గేమ్ ఆఫ్ త్రోన్స్ అనే టీవీ సీరియల్ కి స్ఫూర్తి రోమన్, బ్రిటిష్ చరిత్రల నుండి వచ్చిందని పరిశీలకులు అంటారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ చరిత్రలో ఏదైనా ఒక అంశం మీద రాయాలని సంకల్పించాను. ప్రపంచ చరిత్ర మీద చేతికి అందిన సాహిత్యాన్ని చదవడం మొదలెట్టాను. ఇంటర్నెట్ వ్యాసాలు చదివాను.  డాక్యుమెంటరీలు చూశాను. అలా కొంత సమాచారం సేకరించిన తరువాత రోమన్ చరిత్రతో ఈ ప్రయత్నాన్ని మొదలెట్టాలని నిశ్చయించుకున్నాను.

2 comments:

  1. ప్రపంచములో మూడు ఖండాల చరిత్ర గతిని ప్రభావితం చేసిన రోమ్ సామ్రాజ్య పుట్టు పూర్వోత్తరాలను, సహస్రాబ్ద సంవత్సరములు పైగా దాని మహార్దశకు, తరువాతి పతనానికి కారణాలను ఆ సామ్రాజ్యమును పాలించిన చక్రవర్తులు జీవిత చరిత్ర ద్వారా ఉత్సాహభరితముగా చెప్పిన శ్రీనివాస చక్రవర్తికి అభినందనలు.
    - గోపాల్, ఐ. ఐ. టి మద్రాసు

    ReplyDelete
  2. కొనసాగింపుగా తదనంతర చరిత్రను రాయగలరు.

    ReplyDelete