Themes from World History

Themes from World History

Wednesday, March 16, 2016

సింహాసనం కన్నా సాంకేతికత అంటే మక్కువ గల యువరాజు పీటర్




1682 లో పుట్టిన పీటర్ బాగా చిన్నప్పటి నుండే తన ప్రత్యేకతని చాటుకున్నాడు. అందరు యువరాజుల లాగా కాక ఇతడు చిన్నప్పటి నుండి వస్తువుల పని తీరు పట్ల, వస్తువులని మరమ్మత్తు చెయ్యడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. సాంకేతిక విషయాల పట్ల అపారమైన మక్కువ చూపించేవాడు.  ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అతడి మనస్తత్వం ఒక ఇంజినీరు మనస్తత్వం

 
యువరాజు పీటర్
 
నౌకలు అన్నా, సముద్రాలు అన్నా అతడి చెప్పలేని ఆకర్షణ. గుర్రాలపై సవారి చేస్తూ కదన కుతూహలాన్ని చూపించాల్సిన రాజు, నౌకలనెక్కి సముద్రాలని జయించడం పట్ల మరింత ఎక్కువ మక్కువ చూపించేవాడు. నౌకల పట్ల, నౌకాయానం పట్ల తన ఆసక్తికి మూర్తిరూపంగా తదనంతరం నౌకాయానానికి చెందిన ఒక విశ్వవిద్యాలయాన్నే స్థాపిస్తాడు.

గుర్రాల మీద స్వారీ చెయ్యడం మాని రాకుమారుడు ఇలా  నౌకా విహారంలో మునిగితేలడం పీటర్ తల్లికి నచ్చలేదు. (అందుకే పెళ్లి చేస్తే కొడుక్కి పిచ్చి కుదుర్తుందని ఆశించి యూడోక్సా అనే రాకుమార్తె నిచ్చి పెళ్లి చేసింది. అయితే వివాహం పదేళ్ల తరువాత విడాకులతో అంతం అయ్యింది. భర్త ప్రోత్సాహం మీదట యుడోక్సానన్గా మారి క్రైస్తవ ఆశ్రమంలో చేరిపోయింది.)

 తల్లి మరణం తరువాత పీటర్ జీవన సరళిని నియంత్రించేవారు లేకపోయేవారు. నౌకల మీద, నౌకా యాత్రల మీద మరింత ధ్యాస కనబరచసాగాడు. సొంతంగా నౌకలు నిర్మించడం నేర్చుకున్నాడు. అలా సొంతంగా నిర్మించిన నౌకలో రష్యాలో ఉత్తర-పశ్చిమ తీరం వద్దతెల్ల సముద్రం’ (White sea) మీద సాహసోపేతమైన యాత్రకి వెళ్లాడు. ఈ తెల్ల సముద్రం రష్యాలో ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో బేరెంట్స్ సముద్రం పక్కగా ఉండే ఓ చిన్న ఖాతం.  బాగా ఉత్తర ప్రాంతాల్లో ఉన్న తెల్ల సముద్రం పేరుకి తగ్గట్టుగానే ఏడాదిలో చాలా కాలం మంచు చేత ఆవరించబడి ఉంటుంది. అక్కడ జరిగిన ఒక ప్రమాదంలో రాకుమారుడు పీటర్ కి వెంట్రుకవాసిలో ప్రాణగండం తప్పింది.

తెల్ల సముద్రం మీద నౌకా యాత్రలు ప్రమాదకరమైనవని తెలిసిన తరువాత పీటర్ తన దృష్టిని నల్ల సముద్రం (Black sea) మీదకి, కాస్పియన్ సముద్రం (Caspian sea) మీదకి మరల్చాడు. నల్ల సముద్రం తూర్పు యూరప్ దేశాల నడి మధ్యలో ఉంటుంది. కాస్పియన్ సముద్రం సరిగ్గా యూరప్, ఏషియా ఖండాల సరిహద్దు వద్ద ఉంటుంది. కాబట్టి రెండు సముద్రాల మీదుగా ఎన్నో ముఖ్యమైన వాణిజ్య సంబంధమైన  నౌకా మార్గాలు (sea routes) విస్తరించి  ఉన్నాయి. నౌకా మార్గాలని నియంత్రించగలిగితే ఎంతో వాణిజ్యాన్ని శాసించవచ్చని త్వరలోనే అర్థం చేసుకున్నాడు పీటర్.

అయితే రోజుల్లో నౌకా మార్గాలు టర్కీ సుల్తాన్ కి సామంత రాజైన క్రిమియా రాజుఇతడి పేరు ఖాన్అధిపత్యంలో ఉండేవి. నౌకా మార్గాలని హస్తగతం చేసుకోవాలంటే క్రిమియాని ఏలే ఖాన్ ని జయించాలి. పీటర్  క్రిమియా మీద యుద్ధం ప్రకటించాడు. అదే తన మొట్టమొదటి యుద్ధం. అయితే యుద్ధంలో రష్యా చిత్తుగా ఓడిపోయింది. యుద్ధంలో తన ఓటమికి కారణం తన బలహీనమైన నౌకా దళమేనని గుర్తించాడు పీటర్.

నావిక విషయాలలో తనకి ఎంత ఆసక్తి వున్నా తన రాజ్యానికి చెందిన నౌకా దళం అంత బలహీనంగా ఉండడం పీటర్ కి నచ్చలేదు. ఇరుగు పొరుగు రాజ్యాలైన ఆస్ట్రియా, ప్రష్యా (ఇది ఆనాటి జర్మనీ) నుండి మంచి ఉద్దండులైన వడ్రంగులని, సాంకేతిక నిపుణులని తన రాజ్యానికి తెప్పించుకున్నాడు. రష్యాలో లెక్కకి చూస్తే శ్రామికులకి కొదవ లేదు. అయితే నైపుణ్యాల విషయంలో వీరు జర్మన్ నిపుణులతో పోల్చితే వెనుకబడి వున్నారు. కాబట్టి బయటి నుండి వచ్చిన జర్మన్ సాంకేతిక నిపుణల చేత స్థానిక రష్యన్ శ్రామికులకి శిక్షణ నిప్పించాడు. భారీ ఎత్తున నౌకా నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు. డాన్ నది వొడ్డున ఉన్న కారడవులలో భారీ ఎత్తున చెట్లు కొట్టించి వాటి కలపతో బలమైన నౌకా దళాన్ని రూపొందించాడు. అలా తయారైన నౌకా దళం తోనే డాన్ నది యొక్క నదీముఖం వద్ద ఉండే అజోవ్ అనే ఒక టర్కిష్ కోటని ముట్టడి చేసి కోటని ఆక్రమించాడు.

 
పీటర్ రాజు నేతృత్వంలో అజోవ్ కోటని ముట్టడిస్తున్న రష్యన్ సేనలు
 

 రష్యన్ సామ్రాజ్యం వృద్ధి చెందాలంటే వాణిజ్య రంగంలో ముందుండాలి. అంటే వీలైనన్ని సముద్ర మార్గాలు రష్యా అధీనం లోకి రావాలి. విశాలమైన భూభాగం గల రష్యాలో అంతరంగ ప్రాంతాల నుండి నదుల ద్వారా సముద్రాలని చేరుకోవచ్చు. కాబట్టి నదీ ముఖాల ద్వార సముద్రాల చేరుకునే మార్గాలు వీలైనన్ని రష్యా అధీనంలో ఉండాలి. ఫలితాలన్నీ సాధ్యం కావాలంటే బలమైన నౌకా దళం ఉండాలి. విధమైన దూరదృష్టితో పీటర్ రాజు తన సామ్రాజ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

(ఇంకా వుంది)






2 comments:

  1. sir,
    మీరు చేసే ప్రయత్నము చాల సంతోషించదగ్గ విషయము. మీరు ప్రపంచ చరిత్ర అంటూ రష్యానుండి మొదలు పెట్టారు. ఇందులో ప్రత్యేకత ఉందా.
    అయితే సందర్భం అవునో కాదో నాకు తెలియదు భారత చరిత్రగురించి:
    మన చరిత్ర కారులు భారత చరిత్ర 1948 తో అంతం చేసారు. తరవాత చరిత్ర ఏమీ లేదా.అక్కడనుండి అన్ని రాజకీయాలేనా. రాజకీయాలు భారత్ చరిత్ర కాదా. భారత్ చరిత్ర అంటే కాంగ్రెస్ చరిత్ర యేనా. తరువాత చరిత్ర గురించి ప్రస్తుతానికి నాకు రామచంద్ర గుహ గారి పుస్తకం దొరికింది. ఇది కాకుండా ఇంకా ఏమైనా పుస్తకాలు ఉన్నాయా. తెలపగలరు.

    ReplyDelete
  2. రామకృష్ణ గారు,
    రష్యాతో మొదలుపెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆ మధ్య ఓ పుస్తకంలో పీటర్ ద గ్రేట్ కథ చదివాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలా తమ రాజ్యాలని ఉద్ధరించిన వాళ్ల కథలు చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి.
    అలాంటి కథలకి ప్రస్తుతం మన దేశం ఉన్న స్థితికి మధ్య సంబంధం కనిపిస్తుంది. ప్రస్తుతం మన దేశం ఎదిగే ప్రయత్నంలో వుంది. చాలా వేగంగా ఎదగాలని చూస్తోంది. అలాంటి వృద్ధి సుస్థిరంగా జరగాలంటే ఎలాంటి నేతలు కావాలి, ఎలాంటి పాలన అవసరం, జనం ఎలా మసలు కోవాలి, తమ వంతుగా ఎలా పని చెయ్యాలి మొదలైనవి స్పష్టంగా తెలిస్తే బావుంటుంది.
    నా వరకు అయితే చరిత్రలో తెలుసుకోదగ్గది ఎవరు, ఎప్పుడు ఎలా కొట్టుకు చచ్చారో ఆ వివరాలు కావు. దేశాలు, రాజ్యాలు, సమాజాలు ఎలా ఎదుగుతాయో, ఎలా పతనం అవుతాయో ఆ పరిణామాలు, వాటి వెనుక వున్న శక్తులు - ఇవి నిజంగా అర్థం చేసుకోదగ్గవి. కొన్ని కొన్ని దశలలో సమాజాలు శతాబ్దాల పాటు స్థతబ్దుగా ఉండిపోతాయి. కొన్ని కొన్ని దశలలో ఒక్క సారిగా మేలుకుని కొన్ని దశాబ్దాలలోనే మహోగ్రంగా ఉద్యమించి పురోగమిస్తాయి. ఈ పరిణామాలన్నీ అధ్యయనం చెయ్యడం వల్ల ఎంతో తెలుస్తుంది.
    ఈ బ్లాగ్ ని అలాంటి వ్యక్తిగత అధ్యయనానికి వేదికగా వాడుకుందామని ఉద్దేశం.
    స్వరాజ్యం తరువాత భారత దేశ చరిత్ర గురించి నాక్కూడా రామచంద్ర గుహ పుస్తకం తప్ప మరేమీ తెలియదు. ఇప్పుడే నెట్ లో చూస్తే India after independence by Bipan Chandra.

    ReplyDelete